- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్న హద్దు తేడా.. పెద్ద న్యాయపోరాటం! సర్వే ఎందుకు ముఖ్యం?
నేటి కాలంలో భూమి అంటే కేవలం ఆస్తి కాదు.. భవిష్యత్తుకు భరోసా. భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్న కొద్దీ, చిన్న హద్దు తేడా కూడా పెద్ద న్యాయపోరాటంగా మారుతోంది. పట్టాదారు పాస్ పుస్తకంలో విస్తీర్ణం సరిగ్గా ఉంటే సరిపోదు.. మీ భూమి హద్దులు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా గుర్తించబడ్డాయా? రెవెన్యూ రికార్డులు, ఎఫ్.ఎమ్.బి, సర్వే ప్రక్రియలపై అవగాహన లేకపోతే, ఎప్పుడైనా వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి భూయజమాని భూమి సరిహద్దుల గుర్తింపు, సర్వే ప్రక్రియపై తప్పక తెలుసుకోవాలి..

నేటి కాలంలో భూమి అంటే కేవలం ఆస్తి కాదు.. భవిష్యత్తుకు భరోసా. భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్న కొద్దీ, చిన్న హద్దు తేడా కూడా పెద్ద న్యాయపోరాటంగా మారుతోంది. పట్టాదారు పాస్ పుస్తకంలో విస్తీర్ణం సరిగ్గా ఉంటే సరిపోదు.. మీ భూమి హద్దులు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా గుర్తించబడ్డాయా? రెవెన్యూ రికార్డులు, ఎఫ్.ఎమ్.బి, సర్వే ప్రక్రియలపై అవగాహన లేకపోతే, ఎప్పుడైనా వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి భూయజమాని భూమి సరిహద్దుల గుర్తింపు, సర్వే ప్రక్రియపై తప్పక తెలుసుకోవాలి..
ప్రతి భూమికి గ్రామ పటాల ఆధారంగా ఒక ప్రత్యేకమైన సర్వే నంబర్ కేటాయిస్తారు. ఈ నంబర్ ద్వారా భూమి విస్తీర్ణం, ఆకారాన్ని గుర్తించవచ్చు. అయితే కేవలం పట్టాదా రు పాస్ పుస్తకం ఉంటే సరిపోదు. భూమి భౌతిక సరిహద్దులను నిర్ధారించడానికి రెవెన్యూ రికార్డులే ప్రామాణికం..
భూ రికార్డులు ఇలా ఉంటాయి..
భూమి కొలతల కోసం వెళ్లే ముందు మీ వద్ద పట్టాదారు పాస్ పుస్తకం, అడంగల్ లేదా పహాణీ, ఎఫ్.ఎమ్.బి టిప్పన్, సేల్ డీడ్ వంటి కీలక పత్రాలు సిద్ధంగా ఉండాలి. పాస్ పుస్తకం మీ యాజమాన్య హక్కును నిరూపిస్తే, పహాణీ భూమి స్వభావాన్ని తెలుపుతుంది. ఎఫ్.ఎమ్.బి (Field Measurement Book) టిప్పన్ అనేది క్షేత్రస్థాయి కొలతలతో కూడిన ఒక చట్టబద్ధమైన స్కేల్ పటం. ఇందులో భూమి పొడవు, వెడల్పులు, మూలల ఖచ్చితమైన కొలతలు ఉంటాయి. ఇది సర్వే సమయంలో అత్యంత కీలకమైన పత్రం. ఈ రికార్డులు సరిగా లేకపోతే క్షేత్ర స్థాయిలో సర్వే చేయడం కష్టమవుతుంది. కాబట్టి వీటిని ముందుగానే సరి చూసుకోవాలి. మీ దగ్గర పాత పత్రాలు ఉన్నా, వాటిని తాజా ఆన్‌లైన్ రికార్డులతో పోల్చి చూసుకోవడం చాలా మంచిది.
సర్వే కోసం దరఖాస్తు..
మీ భూమిని సర్వే చేయించాలనుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను మీ-సేవా కేంద్రాలు 'F-Line' మాడ్యూల్ ద్వారా సులభంగా పొందవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు భూమి విస్తీర్ణం, భూమి రకాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయించిన చలానా రుసుము చెల్లించాలి.. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పాస్ పుస్తకం నకలు, తాజా పహాణీని జత చేయాలి. ఆ తర్వాత రెవెన్యూ విభాగం మీ పొరుగు భూముల యజమానులకు నోటీసులు జారీ చేసి అందరి సమక్షంలో సర్వే చేస్తుంది. వారు లేకుండా చేసిన సర్వే చట్టపరంగా నిలబడదు. అందుకే సర్వే సమయంలో అందరూ ఉండేలా చూసుకోవాలి.. నోటీసులు పంపిన రసీదులను భద్రపరుచుకోవడం కూడా ఎందుకైనా మంచిది.
క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణ..
సర్వే రోజున మండల సర్వేయర్ క్షేత్రస్థాయికి వస్తారు.. ఆయన తన వద్ద ఉన్న విలేజ్ మ్యాప్, ఎఫ్.ఎమ్.బి కాపీలతో మీ భూమిని కొలుస్తారు. ప్రస్తుతం అత్యాధునిక ఈ.టి.ఎస్ పరికరాల ద్వారా డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. దీనివల్ల పొరపాట్లు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సర్వే పూర్తయిన వెంటనే భూమి మూలల వద్ద శాశ్వత సరిహద్దు రాళ్లను పాతి, వాటికి రంగు వేయడం లేదా సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేయడం ఉత్తమం. ఈ రాళ్లే మీ భూమికి శాశ్వత గుర్తులుగా ఉంటాయి. చివరిగా సర్వేయర్ ఒక పంచనామా లేదా సర్వే రిపోర్ట్ తయారు చేస్తారు. దీనిపై భూయజమాని, సరిహద్దు యజమానుల సంతకాలు తీసుకుంటారు.. ఇవి వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయి. సర్వే పూర్తయ్యాక ఆ నివేదికను ఆన్‌లైన్ రికార్డులలో కూడా అప్‌డేట్ చేయడం ముఖ్యం. డిజిటల్ సిగ్నేచర్‌తో కూడిన మ్యాప్‌ను ఆన్‌లైన్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.
సవాళ్లు, అప్పీల్ చేసుకునే అవకాశం..
చాలా సందర్భాల్లో పొరుగు వారు సర్వేకు సహకరించకపోవచ్చు లేదా సరిహద్దు రాళ్లను తొలగించవచ్చు. అటువంటి సమయంలో భూయజమానులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సర్వేయర్ తప్పుగా కొలిచారని మీరు భావిస్తే ఆర్.డి.ఓకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సర్వేకు అడ్డంకులు ఎదురవుతాయని భావిస్తే, మీరు ముందస్తుగా మీ-సేవ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి పోలీసు రక్షణ కోరవచ్చు.. దీనివల్ల ఎటువంటి అడ్డంకులు లేకుండా సర్వే ప్రక్రియ పూర్తవుతుంది. ఇక ఏదైనా భూమి కొనుగోలు చేసే ముందే సర్వే చేయించు కోవడం మంచిది. సర్వేకు అభ్యంతరాలు ఉన్నప్పుడు వాటిని రాతపూర్వకంగా ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అప్పుడే న్యాయపరంగా మీ భూమికి రక్షణ లభిస్తుంది. కోర్టు కేసులలో ఉన్న భూముల విషయంలో సర్వే చేయించే ముందు న్యాయ సలహా తీసుకోవడం ఇంకా మంచిది.
భవిష్యత్తులో గొడవలు రాకుండా..
మీ భూమికి సంబంధించిన ఎఫ్.ఎమ్.బి కాపీని ఎప్పుడూ భద్రపరుచుకోండి. ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే కార్య క్రమాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. కేవలం సర్వే చేయించుకోవడం మాత్రమే కాదు, పొరుగువారితో సఖ్యతగా ఉంటూ హద్దులను కాపాడుకోవాలి. రాళ్లు అదృశ్యమైనా, ఆక్రమణ యత్నాలు జరిగినా వెంటనే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలి. భూమి చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహరీ గోడ నిర్మించుకోవడం రక్షణ పరంగా అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. పక్కాగా ఉన్న భూమి రికార్డులు, శాస్త్రీయంగా జరిగిన సర్వే మాత్రమే మీ ఆస్తికి అసలైన రక్షణ కవచాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న ఆన్‌లైన్ సేవలను, ఆధునిక సర్వే పద్ధతులను ఉపయోగించుకుని మీ భూమిని భద్రంగా ఉంచుకోండి. ఇది భవిష్యత్తులో మీ వారసులకు గొడవలు లేని ఆస్తిని అందించడానికి మార్గం సుగమం చేస్తుంది.
-డా.కట్కూరి
సైబర్ సెక్యురిటీ న్యాయ నిపుణులు
94909 34520






