- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్హులందరికి ఇస్తేనే ప్రజా ప్రభుత్వం!
పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో, లేదా మార్పు కోసమో తెలంగాణ మేమే

పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో, లేదా మార్పు కోసమో తెలంగాణ మేమే ఇచ్చినమని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీకి స్వరాష్ట్రంలో మొదటి సారి గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం అప్పగించారు.. గత ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత ప్రభుత్వ పథకాల అమలు మీద రావడంతో ఈ ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం తీసుకు వచ్చే ముందు ప్రజల డిమాండ్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
కొత్త రేషన్ కార్టుల ప్రాతిపదిక ఏంటి?
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు పొందని అర్హులైన పేద ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారు.. వారందరికీ తమ పార్టీ అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చింది. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగా అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. పైగా పాత రేషన్ కార్డులను తొలగించకుండానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఓ మంత్రి ప్రకటించారు. పాత రేషన్ కార్డుల్లో ఎవరైనా అనర్హులుంటే వారిని తొలగించి కొత్తగా అర్హులకు ఇచ్చే సాహసం బహుశా స్థానిక ఎన్నికల కోసం చేయట్లేదు అనే విమర్శలు ప్రభుత్వంపై వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇవ్వలేదని అనకుండా కొంతమందికి ఇచ్చి కొన్ని రోజుల తర్వాత మరింత మంది అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పి స్థానిక ఎన్నికలకు వెళ్లేలా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంటోం దని ప్రజలు చర్చించుకుంటున్నారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలో ప్రజా పాలన దరఖాస్తుల్లో భాగంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుంది. ఆ తర్వాత మొన్నటి సమగ్ర సర్వేలో కూడా రేషన్ కార్డు ఉందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం తీసుకుంది.. ఇప్పుడు ఏ ప్రాతిదికన, ఎవరు రేషన్ కార్డు అర్హుల లిస్ట్ ఫైనల్ చేశారన్నది తెలియదు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం కొన్ని మార్గదర్శకాలను వెళ్లడించిప్పటికి వాటికి అనుగుణంగా కాకుండా కొంతమందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం భావ్యం కాదు. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డులను ఆధారంగా తీసుకుంటారు కాబట్టే రేషన్ కార్డులంటే ఇంత డిమాండ్.. ఈ నేపథ్యంలో స్థానిక చోటా, మోటా నాయకులు ఫైనల్ చేసిన కొంత మందిని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, రేషన్ కార్డులను కుల, మత,రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇస్తేనే ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలు నమ్మేది.
డా. అక్కెనపల్లి వెంకట్రాం రెడ్డి
97002 06444






