ఉపాధ్యాయ హక్కుల సాధనలో కొత్త దిశ.. దశాబ్దం తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణ

by Ravi |   (  Updated:2025-11-12 01:00:54  IST  )

ఉద్యమాలే ఊపిరిగా, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్న ఉద్యమ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరించడం ముదావహం.

ఉపాధ్యాయ హక్కుల సాధనలో కొత్త దిశ.. దశాబ్దం తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణ
X

ఉద్యమాలే ఊపిరిగా, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్న ఉద్యమ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరించడం ముదావహం. అది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు లభించిన ఆదరణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కౌన్సిల్ ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తరువాత నాటి ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దీనిని పునరుద్ధరించాలని కొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆనాటి నుండి కౌన్సిల్ ఏర్పాటు అంశం ఉద్యమ సంఘాల ప్రధాన డిమాండ్లలో ఒకటిగా మారింది.

దశాబ్ద కాలం తర్వాత రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు స్నేహ హస్తం అందించి ఈ కౌన్సిల్‌పై ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారులతో, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఏర్పడిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

ప్రభుత్వానికి ఉద్యోగులకు వారధిగా ఉంటూ..

ఈ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగిన సంఘాల ప్రతినిధులకు ఆన్ డ్యూటీ సౌకర్యం ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా జరిపే సమావేశాలకు ఆహ్వానించడం జరుగుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల గురించి చర్చించి వాటి పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక వేదికగా పని చేస్తుంది. అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగ ఉపాధ్యాయులకు నడుమ వారధిగా ఉంటూ క్రియా శీలకంగా వ్యవహరించే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం పొంది భాగస్వామ్యం కావాలని ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం కోరుకుంటుంది. అయితే అందరికీ ఆ అవకాశం లభించదు. కొన్ని సంఘాలకు మాత్రమే ఇది లభిస్తుంది. అది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిల్‌ను పునరుద్ధరిస్తూ అందులో తొమ్మిది సంఘాలకు శాశ్వత సభ్యత్వం మరో ఆరు సంఘాలకు రొటేషన్ సభ్యత్వం కల్పించింది. ప్రతి యేటా శాశ్వత సభ్యత్వ సంఘాల గుర్తింపు కొనసాగుతుంది. అయితే రొటీన్ సంఘాల గుర్తింపు మారుతుంటాయి. ఈ కౌన్సిల్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. ఉద్యోగుల సంక్షేమానికి దోహదం చేస్తుంది.

స్వాతంత్య్రానికి పూర్వమే ఆవిర్భవించి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ కౌన్సిల్‌లో యస్.టి.యు. శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉన్నది. తెలం గాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కౌన్సిల్‌లో కూడా యన్.టి.యు. శాశ్వత సభ్యత్వాన్ని పొందడం అభినందనీయం. ఒక విధంగా ఇది సంఘం మనుగడకు లభించిన ప్రోత్సాహం అనుకుంటే మరో విధంగా ఇది యస్.టి.యు. సంఘ నిర్మాణం, అంకితభావం, ఉద్యమ విధానం, సమర్థవంతమైన పనితీరు, సమస్యల పట్ల వైవిధ్య భరితమైన స్వతంత్ర ఆలోచనా విధానం, విద్యారంగం పట్ల ఉన్న అవగాహన మొదలైనవాటికి లభించిన గుర్తింపుగా భావించాలి. ఇది స్టేట్ టీచర్స్ యూనియన్ సభ్యులందరికీ గర్వకారణమైన విషయం. నిజమే 79 ఏండ్లు యన్.టి.యు. ప్రస్థానాన్ని గమనిస్తే ఈ సంఘ చరిత్రలో సాధించిన విజయాలెన్నో మనకు కన్పిస్తాయి. భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వమే వాటి నిజాం రాష్ట్రంలో ది హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూని యన్‌గా అవతరించి తరువాతి కాలంలో స్టేట్ టీచర్స్ యూనియన్‌గా రూపాంతరం చెంది నాటి నుండి నేటి విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంక్షేమానికి పాటు పడుతూ, సమస్యలను సాధిస్తూ, హక్కులను పరిరక్షిస్తూ వస్తున్న ఉద్యమ సంఘం యస్.టి.యు. ఈనాడు ఉపాధ్యాయలోకం అనుభవిస్తున్న అనేక ప్రయోజనాలు ఈ సంఘం పోరాటం వల్లనే వచ్చాయి. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత కూడా ఆనాటి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ విద్యా రంగాన్ని కాపాడుకోవడం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడి అక్రమ కేసులు ఎదుర్కొన్న సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్ అనడంలో అతిశయోక్తిలేదు.

వారిని ఆదర్శంగా తీసుకోవాలి..

కాళోజీ, మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసిన రాఘవాచారి మరణించే నాటికి దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడం వారి పనితనానికి నిదర్శనం. నేటి ఎమ్మెల్సీలు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రొఫెసర్ జయశంకర్ సార్, అప్పరసు శ్యాంసుందరరావు వంటివారు ఎందరో యస్.టి.యు. ఉద్యమతారలై వెలుగొందడం సంఘ ఘన చరిత్రకు ఆనవాళ్లు. ఆ స్ఫూర్తిని నేటికీ కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, ప్రభుత్వాలు ఏవైనా సమస్యల సాధన కొరకై ఉద్యమబాట పడుతున్న సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయులు అభినందనీయులు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం పొందిన యస్.టి.యు. విద్యారంగ సంక్షేమానికి, ఉపాధ్యాయ వర్గ సమస్యల పరిష్కారానికి తగిన విధంగా కృషి చేయగలదని, అవసరమైన మేరకు ప్రభుత్వానికి తగు సూచనలు, సలహాలు ఇవ్వగలదని ఉపాధ్యాయులు విశ్వసిస్తున్నారు.

-సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Next Story