కాల గగనంలో నూతనోదయ క్రాంతి..!

by Bhoopathi Nagaiah |

మనందరినీ 2026లోకి నెట్టేస్తూ 2025 వెళ్ళిపోయింది. ఈ సందర్భంలో కొన్ని గుర్తులను, భిన్న జ్ఞాపకాలను, విభిన్న స్మృతులను, జయాలు, అపజయాలను నెమరేసుకుందాం.

కాల గగనంలో నూతనోదయ క్రాంతి..!
X

విశ్వం ఆవిర్భవించడానికి ముందు కాలం అనే భావనకు ఎలాంటి అర్థం లేదు అంటారు విఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. కాలం నిత్య నూతన ప్రభావపు ప్రవాహం. విశ్వాంతరాల అన్వేషణలో మన నేస్తం కాలం. ఆదిమానవుల నుంచి నేటి అర్ధవాహక పరికరాల మానవుల దాకా కాలం గురించి మానవ మేధస్సు ఆలోచనా పరిధి మారుతూనే వస్తుంది. మన ఉనికిని మనం ప్రశ్నించుకునే సందర్భంలో కాలమే ఓ ప్రయోగ పరికరం.

ఫిజిక్స్‌లో, ఫిలాసఫీలో, పోయెట్రీలో... కాలం రూపాంతరాలు ఎన్నో. ఏదేమైనా ఇప్పుడు నాగరికతకు క్యాలెండర్ దిక్సూచి అయ్యింది. మన ఆలోచనల పరిణామాన్ని అంకెల్లో చెప్పడమే నేటి మన అభివృద్ధికి సంకేతం. 2025 వెళ్ళిపోయింది.. మనందరినీ 2026లోకి నెట్టేస్తూ..! ఈ సందర్భంలో కొన్ని గుర్తులను, భిన్న జ్ఞాపకాలను, విభిన్న స్మృతులను... ఇలా ఎన్నో... జయాలు, అపజయాలను నెమరేసుకుంటూ.. ఆశావాదంతో... ఆత్మవిశ్వాసంతో... 2026 లో అడుగులు ముందుకే వేద్దాం.

సైకిల్‌పై మొదలైన ఇస్రో ప్రయాణం

1975లో సైకిల్‌పై ప్రారంభమైన ఇస్రో ప్రయాణం ఎన్నో అవమానాలను, అపజయాలను, అగ్రదేశాల ఆధిపత్యాలను అధిగమిస్తూనే.. ఐదు దశాబ్దాలు తిరిగేసరికి 100 ప్రయోగాలు చేసి 2025లో విశ్వ యవ్వనికపై నవ చరిత్ర సృష్టించింది. వారం రోజుల కిందటే ఎల్ వీ ఎం-3 ఎం 6 రాకెట్ సాయంతో 6100 కిలోల బ్లూ బర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని దిగ్విజయంగా నింగిలోకి పంపింది. ఒకప్పుడు ఉపగ్రహాల పరికరాల తయారీకి అగ్రరాజ్యాలపై ఆధారపడిన మనం... నేడు అగ్ర రాజ్యాలతో సహా 34 దేశాల ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా పంపగలిగాం. డాకింగ్, నిసార్, గగనయాన్ ప్రాజెక్ట్ లో భాగంగా జరిపిన ప్రయోగాల్లో సైతం విజయవంతమయ్యాం. శుభాంశు శుక్లా ఐఎస్ఎస్‌ను చేరిన తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించారు.

ఏఐ టూల్స్‌తో నవతరం స్నేహం

ప్రపంచం 2025ను అంతర్జాతీయ క్వాంటం శాస్త్ర సాంకేతిక సంవత్సరంగా గుర్తించింది. నానో టెక్నాలజీతో కూడిన క్వాంటం విప్లవం క్వాంటం కంప్యూటర్స్‌ను సృష్టించింది. బరువును తగ్గిస్తూ, వేగాన్ని పెంచడం నేటి ఆధునికతలోని అంతర్లీనంగా ఉన్న సాంకేతికం. డీప్ సిక్ సంచలనంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జెమిని, నానో బనానా, చాట్ జీపీటీ, పర్ ప్లెక్సిటీ వంటి ఏఐ టూల్స్‌తో నవతరం స్నేహం చేస్తుంది. ఏఐ సాంకేతికత వల్ల భవిష్యత్తులో విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్యం తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

అంతరిక్షం... ఆటలు, రక్షణలో ప్రగతి

అంతరిక్షంలోనే కాదు..! ఆటల్లోను, దేశరక్షణ లోను సాంస్కృతిక వారసత్వంలోనూ... 2025 సంవత్సరం మనకు ఒక మైలురాయిగా నిలిచింది. వందేమాతరం 150 జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోయింది. భగవద్గీత, నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకూ మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో గుర్తింపు లభించింది. దీపావళి పండుగను యునెస్కో అంతర్జాతీయ స్థాయిలో గౌరవించింది. మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ లో మన సభ్యుల ఆట తీరు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని మన జట్టు వరల్డ్ కప్ గెలిచిన క్షణాలు చరిత్రలో సువర్ణాక్షరాలుగా మిగిలాయి. అండర్-19 అమ్మాయిల జట్టు టీ20 వరల్డ్ కప్, భారత అంధ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్, కబడ్డీ వరల్డ్ కప్, రోల్ బాల్ వరల్డ్ కప్ తో పాటు హాకీ, బాస్కెట్ బాల్ వంటి ఆటల్లోనూ అంతర్జాతీయ స్థాయి వేదికలపై మన ఆటగాళ్లు సత్తాను చాటారు.పహల్గాం ఉగ్రదాడితో మన దేశం ఒకసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదానికి గట్టి జవాబిచ్చింది. ఈ దేశ రక్షణ కోసం ఎందాకైనా వెళ్తామనే సంకేతాన్ని, సందేశాన్ని ప్రపంచానికి వినిపించింది. జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము రికార్డ్ సృష్టించారు. మూడోసారి స్పేస్ లో అడుగుపెట్టి, అనూహ్య పరిస్థితుల్లో తొమ్మిది నెలలు స్పేస్ తో యుద్ధం చేసి.. సునీతా విలియమ్స్ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి శిఖరంగా నిలిచారు.

మార్మోగిన దేశ రాజకీయం

2025 సంవత్సరంలో దేశంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం 2047 పేరుతో మారుమోగింది. ఎనిమిది దశాబ్దాలకు చేరువవుతున్న స్వాతంత్ర భారతంలో బీసీల రాజ్యాధికారం ఏమైందనీ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓట్ల తొలగింపు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన..మన దేశ ఓ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపు, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్, నదీ జలాల పంపిణీపై వివాదం, రైతుల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, వందేమాతరం, నెహ్రూ పాలన ఇలాంటి వెన్నో మీడియాలో ప్రముఖ వార్తా శీర్షికలయ్యాయి. "మా బలం తక్కువే ఉండొచ్చు కానీ మా వెన్నెముక నిటారుగానే ఉంది. రాజ్యాంగం, లౌకికవాదం, పేదల హక్కుల విషయంలో కాంగ్రెస్ ఎన్నడూ రాజీ పడలేదంటూ రాహుల్ అండ్ టీం అంటుంటే... మన సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ.. విశ్వ గురువుగా ఎదగడమే మా లక్ష్యం అంటూ మోడీ అండ్ టీం రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు.

కోటి ఆశలతో కొత్త సంవత్సరం

దారుణమైన రోడ్డు ప్రమాదాలు, యుద్ధాల శబ్దాలు, ఆకలి కేకలు, రైతుల పోరు బాటలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రముఖుల మరణాలు, నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగం, పర్యావరణ కాలుష్యం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల్లో బతుకు చిత్రాలు, పసిడి ధర, డాలర్@90, ట్రంప్ టారిఫ్, స్వచ్ఛమైన ఆక్సిజన్, నోబెల్ శాంతి బహుమతి ఇలాంటివి కూడా 2025లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏది ఏమైనప్పటికీ కాలగర్భంలో 2025 కనుమరుగైపోయింది. కోటి ఆశలతో కొత్త సంవత్సరం మన ముంగిట్లో ముగ్గులు వేస్తుంది. మానవత్వపు వెలుగులో జాతీయ కిరణాలమై.. శాస్త్ర సాంకేతిక హద్దులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని, ప్రకృతిని పరిరక్షిస్తూ.. నిరాశ నిస్పృహలను ఓడిస్తూ.. ఆనందంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. మొక్కలను పెంచుదాం. పుస్తకాలను చదువుదాం. You must be the change...you wish to see in the world అన్న గాంధీజీ ఆలోచనతో మనమంతా బాధ్యతాయుతంగా మెలుగుతూ.. అందమైన ప్రపంచాన్ని, అద్భుతమైన ప్రకృతిని భావితరాలకు కానుకగా అందిద్దాం..!

హద్దులు మీరకుండా, ప్రమాదాలు జరగకుండా, నూతన సంవత్సర వేడుకలను చిరునవ్వుల చిరుదివ్వెల మధ్య ఆనందంగా ఆప్యాయత వర్షంలో ఘనంగా నిర్వహిద్దాం. లోకా: సమస్తా: సుఖినోభవంతు

(నూతన సంవత్సర దినోత్సవం సందర్బంగా)

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Next Story