Zohran Mamdani: న్యూయార్క్‌లో కొత్త చరిత్ర.. పెట్టుబడిదారీ సమాజంలో సామ్యవాద గళం

by Ravi |   (  Updated:2025-11-12 00:30:49  IST  )

న్యూయార్క్ నగరానికి పిన్న వయస్కుడైన జోహ్రాన్ మందానీ ఎన్నిక కావడం చాలా కోణాల్లో శుభ సంకేతం. అంతేకాదు ఒక కొత్త చరిత్ర. వందేళ్ల తర్వాత అతి తక్కువ వయసులో ఎన్నికైన ఆ 34 ఏళ్ల యువకుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకం.

Zohran Mamdani: న్యూయార్క్‌లో కొత్త చరిత్ర.. పెట్టుబడిదారీ సమాజంలో సామ్యవాద గళం
X

న్యూయార్క్ నగరానికి పిన్న వయస్కుడైన జోహ్రాన్ మందానీ ఎన్నిక కావడం చాలా కోణాల్లో శుభ సంకేతం. అంతేకాదు ఒక కొత్త చరిత్ర. వందేళ్ల తర్వాత అతి తక్కువ వయసులో ఎన్నికైన ఆ 34 ఏళ్ల యువకుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకం. దక్షిణాసియా మూలాలు, ఇంకా చెప్పాలంటే భారత మూలాలు కలిగి ఆ నగరంలో అత్యున్నత పదవికి ఎన్నికైన మొదటి వ్యక్తి. అక్కడి వాళ్లు ద్వేషించకపోయినా, అంతగా ఇష్టపడని మతానికి చెందిన వ్యక్తి. సంపన్నులు, పెట్టుబడిదారులు శాసించే రాజకీయ రంగంలో నిలదొక్కుకున్న సాధారణ పౌరుడు. పైగా వారికి అంతగా రుచించని సామ్యవాద భావాలు కలిగిన ప్రచారం చేసి గెలిచాడు. ఆయన ఎన్నికైతే ఫెడరల్ నిధుల్ని న్యూయార్క్ అందనివ్వనని ట్రంప్ నేరుగా భయపెట్టినా ప్రజామోదం పొందిన నాయకుడు. ఆయన గెలుపుతో అమెరికా పౌర సమాజం ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనాన్ని మరోమారు చాటింది. కొత్త తరహా రాజకీయాలకు, చైతన్యవంతులైన యువతకు ప్రజాస్వామ్య విధానంలో ఎప్పుడూ చోటు తగ్గదని నిరూపించింది. అత్యంత శక్తివంతుడైన అధ్యక్షుడు తన స్థాయి తగ్గించుకుని బెదిరింపులకు పాల్పడ్డా, ప్రజల ఆదరణ ముందు అవి తాటాకు చప్పుళ్లగానే మిగిలాయి. జోహ్రాన్ ప్రజలకు అవసరమైన విషయాలే ప్రచారంలో మాట్లాడాడు. ఎక్కువ మందికి తిండి, గూడు, ప్రజా రవాణా ఛార్జీలు తడిసి మోపెడయినందున వాటిపై స్పష్టమైన హామీలిచ్చాడు. అందరినీ కలుపుకుపోయే ధోరణి చూపించాడు. ప్రత్యర్థి తప్పులెంచి వాదించాడు తప్ప అనవసర ప్రసంగాలు చెయలేదు. నిధుల లేమి వల్ల ప్రచారంలో వెనకబడి పోకుండా, సామాజిక మాధ్యమాల్ని, నేరుగా ఓటర్లను కలిసే మార్గాల్ని ఎంచుకున్నాడు. వీటితో బాటు ప్రజలు కూడా ట్రంప్‌కి హితబోధ అవసరం పడిందని డిసైడ్ అయ్యారు. ఆయన విధానాల వల్ల పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఫెడరల్ షట్‌డౌన్‌లు ప్రభావం చూపాయి. ఒక రకంగా స్థానికమైనా ఈ ఎన్నికలు ఆయనకి రెఫరెండం. మిగతా నగరాల్లో కూడా ఇదే తరహాలో ఎన్నికల ఫలితాలు ఆయన పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. పెట్టుబడిదారీ సమాజంలో సామ్యవాద భావాల యువకుడు గెలిచాడని పత్రికలు రాస్తున్నాయి. అయితే అసలు విషయమేమిటంటే ఎప్పుడైనా ప్రజలకు వాదాల కన్నా తమ బాధలు వినేవాడే నాయకుడు. కొంచెం భరోసా ఇస్తే పట్టం కడతారు. ప్రజాస్వామ్యంలోని అందం కూడా అదే.

-డా. డి.వి.జి. శంకరరావు,

94408 36931

Next Story