- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక రాజకీయ ఒప్పందానికి సహజ ముగింపు!
కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు, సిద్ధరామయ్య రాజీనామా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి ఎదిగిన తీరు, కుల సమీకరణాలు మరియు 2028 ఎన్నికలపై ఈ మార్పు ప్రభావంపై విశ్లేషణ.

రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఒక్కరోజులో జరగవు. వాటి వెనుక నెలలు, సంవత్సరాల వ్యూహాలు దాగి ఉంటాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా, డీకే శివకుమార్ అధికార పగ్గాలు చేపట్టబోతున్న తాజా పరిణామం కూడా అలాంటిదే. ఇది ఆకస్మిక నిర్ణయం కాదు.. 2023 ఎన్నికల తర్వాత ప్రారంభమైన రాజకీయ ఒప్పందానికి ఇప్పుడు వచ్చిన సహజ ముగింపు..
చెరో మూడేళ్ల ఫార్ములాతో..
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అసలు పోరు బీజేపీతో కాదు, ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్‌లోనే మొదలైంది. ప్రజల్లో అపారమైన ఆదరణ కలిగిన సిద్ధరామయ్య ఒకవైపు ఉంటే, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ మరోవైపు నిలిచారు. ఇద్దరిలో ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించినా మరొక వర్గంలో అసంతృప్తి చెలరేగే ప్రమాదం కనిపించింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఒక మధ్యేమార్గాన్ని ఎంచుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. తొలి అర్ధకాలం సిద్ధరామయ్యకు, మిగిలిన కాలం డీకే శివకుమార్‌కు అనే ఫార్ములా అప్పటినుంచే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ ఫార్ములా అమలవుతున్నట్లు కనిపిస్తోంది. సిద్ధరామయ్య తప్పుకోవడం, డీకే శివకుమార్ ముందుకు రావడం చూస్తే దీంట్లో వ్యక్తిగత నిర్ణయం కంటే పార్టీ నిర్ణయమే ఎక్కువగా కనిపిస్తోంది.
సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం..
సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం కర్ణాటక కాంగ్రెస్ చరిత్రలో ప్రత్యేకమైనది. మైసూరు జిల్లాలోని నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన సిద్ధరామయ్య.. మొదట లాయర్‌గా పనిచేశారు. అయితే రామ్ మనోహర్ లోహియా భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇలా జనతా పరివార్‌లో బద్ధ కాంగ్రెస్ వ్యతిరేక నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సిద్ధరామయ్య.. కాల క్రమేణా కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగి కర్ణాటక చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా నిలిచారు. 1980లో ప్రారంభమైన సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం.. సుదీర్ఘంగా 50 ఏళ్లుగా కొనసాగుతోంది. ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు. వెనుకబడిన వర్గాల గొంతుకగా, సంక్షేమ రాజకీయాల ప్రతినిధిగా ఎదిగారు. అందుకే ఆయనకు ఇప్పటికీ పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉంది.
ట్రబుల్ షూటర్‌గా డీకే శివకుమార్
అయితే కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ కూడా అంతే అవసరమైన నాయకుడు. సంక్షోభ సమయాల్లో పార్టీని కాపాడిన ట్రబుల్ షూటర్‌గా ఆయనకు పేరుంది. కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంలో ఆయన పాత్రను పార్టీ నాయకత్వం ఎప్పుడూ గుర్తించింది. రాజకీయ నిర్వహణలోనూ, ఎన్నికల వ్యూహాల్లోనూ ఆయనకు ఉన్న నైపుణ్యం కారణంగానే ఇప్పుడు అత్యున్నత పదవి దక్కుతోంది. కర్ణాటక రాజకీయాల్లో కుల సమీకరణాల ప్రాధాన్యతను కూడా విస్మరించలేం. సిద్ధరామయ్య ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడు కాగా, డీకే శివకుమార్ వొక్కలిగ సమాజానికి చెందిన ప్రముఖ నేత. రాష్ట్ర రాజకీయాల్లో వొక్కలిగల ప్రభావం, ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలో వారి ఓటు బ్యాంక్ చాలా కీలకం. డీకేకు సీఎం పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి స్పష్టమైన రాజకీయ సందేశం పంపాలని కాంగ్రెస్ భావి స్తున్నట్లు కనిపిస్తోంది.
నాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశం!
ఇప్పుడు అందరి దృష్టి డీకే శివకుమార్‌పైనే ఉంది. ఆయన ముందున్న రెండేళ్లు కేవలం పరిపాలనా కాలం మాత్రమే కాదు. తన నాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశం కూడా. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం, కాంగ్రెస్‌ను ఐక్యంగా ఉంచడం, 2028 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం ఆయనకు పెద్ద సవాళ్లు.. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ మార్పుతో భవిష్యత్ ఎన్నికలకు బలమైన పునాది వేయాలని చూస్తోంది. కొత్త నాయకత్వంతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది పార్టీ లక్ష్యంగా కని పిస్తోంది. మొత్తానికి కర్ణాటకలో జరిగిన ఈ పరిణామం ఒక రాజీనామా వార్త మాత్రమే కాదు. ఇది రాజకీయ హామీలు, అధికారం, ఆశలు, వ్యూహాలు, భవిష్యత్ ఎన్నికల లెక్కలతో ముడిపడిన ఒక పెద్ద రాజకీయ కథ. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కథలో ఒక అధ్యాయం ముగిసింది. కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445






