- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరణంలోనూ వీడని మమకారం..!
జబల్‌పూర్ బర్గీ డ్యామ్‌లో జరిగిన క్రూయిజ్ ప్రమాదం హృదయ విదారక ఘటనగా మారింది. తల్లి ప్రేమకు నిదర్శనమైన దృశ్యాలు, సాంకేతిక లోపాలు, నిర్వాహకుల నిర్లక్ష్యం, పర్యాటక భద్రతపై లేవనెత్తిన ప్రశ్నలపై విశ్లేషణ.

జబల్ పూర్ క్రూయిజ్ ప్రమాదంలో వెలుగు చూసిన ఒక దృశ్యం యావత్ ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తోంది. మృత్యువు కళ్లముందు తాండవిస్తున్నా, ఆ తల్లి తన ప్రాణం కంటే బిడ్డ ప్రాణమే మిన్నగా భావించింది. నర్మదా నది అలలు ముంచెత్తుతున్న వేళ, తన 4 ఏళ్ల చిన్నారిని గుండెలకు హత్తుకుని, తన లైఫ్ జాకెట్‌లోనే బిడ్డను కూడా ఉంచి రక్షించుకోవాలని ఆ తల్లి చేసిన ప్రయత్నం వర్ణనాతీతం.
రెస్క్యూ టీమ్ మృతదేహాలను బయటకు తీసినప్పుడు కూడా ఆ బిడ్డ తల్లిని హత్తుకునే ఉన్నాడు. ఆఖరి శ్వాస వరకు ఆ తల్లి చేసిన పోరాటం మాతృత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. ఈ హృదయ విదారక దృశ్యం చూసి అక్కడ ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.
సాంకేతిక లోపాలు.. నిర్లక్ష్యపు జల సమాధి
ఈ ఘోర విపత్తుకు కేవలం వాతావరణమే కారణం కాదు, క్రూయిజ్ నౌకలోని సాంకేతిక వైఫల్యాలే ప్రధాన హేతువులని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నౌకలోని 'బ్యాలెన్సింగ్ ట్యాంక్'లో తలెత్తిన లోపం వల్ల అలల తాకిడికి క్రూయిజ్ ఒక్క సారిగా ఓ పక్కకు ఒరిగిపోయింది. సామర్థ్యానికి మించి పర్యాటకులు అప్పర్ డెక్‌పై ఉండటంతో భారం ఎక్కువై, కేవలం 180 సెకన్ల వ్యవధిలోనే నౌక సగానికి పైగా నీటిలో మునిగిపోయింది. ఇంజిన్ గదిలోకి నీరు చేరడంతో విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయి, కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయింది. ఇది కేవలం ప్రమాదం కాదు, కనీస నిర్వహణ లోపాలతో జరిగిన వ్యవస్థాగత వైఫల్యమని రెస్క్యూ నిపుణులు ధృవీకరిస్తున్నారు..
నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నలు..
జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ నేతృత్వంలోని విచారణ కమిటీ సేకరించిన ఆధారాలు నిర్వాహకుల బాధ్యతారాహిత్యాన్ని ఎండగడుతున్నాయి. ప్రయాణికుల జాబితాలో కేవలం 29 మంది పెద్దల పేర్లు మాత్రమే ఉండగా, 12 మంది చిన్నారుల వివరాలు ఎక్కడా నమోదు కాలేదు.. ఇది నేరుగా 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' ఉల్లంఘనే. మరీ ముఖ్యంగా, ప్రమాద సమయంలో ఉండాల్సిన క్వాలిఫైడ్ లైఫ్ గార్డులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. క్యాబిన్ గదులకు వాడిన 'టెంపర్డ్ గ్లాస్' అత్యవసర సమయంలో పగలగొట్టడానికి వీలు లేకుండా ఉండటం వల్ల బాధితులు లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు వదిలారు.
ప్రాణాల కోసం చివరి పోరాటం..
72 ఏళ్ల రియాజ్ హుస్సేన్ అనే బాధితుడి గాథ వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మునిగిపోయిన నౌకలోని ఒక గదిలో, మెడ వరకు ఉన్న నీటిలో ఆయన మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడారు. బయటకు రావడానికి దారి లేదు, అరుస్తున్నా వినిపించే నాథుడు లేడు.. కేవలం ఒక చిన్న సందు ద్వారా వచ్చిన గాలిని పీలుస్తూ ప్రాణాలు నిలుపుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెస్క్యూ టీమ్ గ్యాస్ కట్టర్లతో పైకప్పును కోసి ఆయనను రక్షించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లైఫ్ జాకెట్లు ఉన్నా, వాటిని ఎలా ధరించాలో ప్రయాణికులకు అవగాహన లేకపోవడం నిర్వాహకుల అపరాధమేనని ప్రత్యక్ష సాక్షులు వాపోతున్నారు. జబల్‌పూర్ బర్గీ డ్యామ్‌లో క్రూయిజ్ షిప్ మునిగిపోయిన 15 గంటల తర్వాత విడుదలైన దిగ్భ్రాంతికరమైన ఫొటో, పిల్లల సంరక్షణలో మాతృమూర్తి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. తల్లీకొడుకులు ఈ రోజు ప్రాణాలతో బయటపడకపోయి ఉండవచ్చు, కానీ ఈ ఫొటో ఆ సంఘటన జరిగిన క్షణాన్ని బంధించింది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ తల్లి తన కొడుకును వదిలిపెట్టలేదు. అలాంటి తల్లికి వందనాలు.
పర్యాటక భద్రతపై ప్రశ్నలు..
ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. పర్యాటక శాఖ మంత్రి రాకేష్ సింగ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రూయిజ్ సర్వీసులను నిలిపివేసి, భద్రతా ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నౌకలో ఇకపై 'లోడ్ మానిటరింగ్ సిస్టమ్' తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు జారీ చేశారు. ఈ ఘోర ప్రమాదంలో 28 మంది ప్రయాణికులను రక్షించినా, 9 మంది మృత్యువాత పడటం పర్యాటక రంగ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. నిరంతర నిఘా ఉంటేనే ఇలాంటి జల సమాధులను ఆపడం సాధ్యమవుతుంది.
-ఫిరోజ్ ఖాన్,
96404 66464






