భారత అంతరిక్ష యానానికి శుభాంకం

by Ravi |   (  Updated:2025-06-26 01:15:49  IST  )

అంతరిక్ష యాత్ర కేవలం ఒక సాహసం మాత్రమే కాదు. ఇది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందడుగు వేసే ఒక గొప్ప ప్రయోగం. ఇది మన

భారత అంతరిక్ష యానానికి శుభాంకం
X

అంతరిక్ష యాత్ర కేవలం ఒక సాహసం మాత్రమే కాదు. ఇది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందడుగు వేసే ఒక గొప్ప ప్రయోగం. ఇది మన ప్రాపంచిక పరిధిని విస్తరించడమే కాకుండా, భవిష్యత్తు తరాలకు నూతన అవకా శాలను అందించే మార్గం. అంతరిక్షంలో, జీవన విధానం, జీవసంబంధిత ప్రయోగాలు, శరీరంపై గురుత్వాకర్షణ లేని వాతావరణ ప్రభావం వంటి అంశాలు శాస్త్రీయంగా విశ్లే షించబడతాయి. అంతే కాదు, భూమికి వెలుపల జీవనం సాధ్యమా? అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం కూడా అంతరిక్ష ప్రయాణంలో భాగమే..

భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెడుతున్న రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టిస్తున్నారు..

అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కీలక అధ్యాయంగా..

యాక్సియం- 4 మిషన్‌లో భాగంగా స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ - 9 రాకెట్‌ ద్వారా శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు నిన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పయనమయ్యారు. ఇది భారత అంతరిక్ష ప్రయా ణ చరిత్రలో ఒక కీలక అధ్యాయంగా నిలిచిపోనుంది. నిన్న మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం - 4 ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుండి ఫాల్కన్‌ -9 రాకెట్‌ను ప్రయోగించారు. దీంతో కోట్లాది మంది భారతీయుల కలలు సఫలమయ్యాయి. ఈ మిషన్‌కు శుభాంశు శుక్లా పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. భారత్‌కు చెందిన ఓ వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి వెళ్తుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మిషన్ విజయ వంతంగా పూర్తయితే భవిష్యత్తులో మన దేశీయ వ్యోమగాములకు మరిన్ని అవకాశాలు తెరుచుకోనున్నాయి..

పలు వాయిదాల తర్వాత..

ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ యాత్ర ఎట్టకేలకు బుధవారం సాకారమైంది. భారత రోదసీ పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానం అవుతుంది. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. శుక్లాతో పాటు మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్‌ కపు (హంగరీ), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ (పోలండ్‌) రోదసిలోకి వెళ్లారు..

అనంత దూరాలకు మానవ సహిత యాత్రలు

మానవులు నిత్యం రోదసీలో ఉండటాన్ని ఐఎస్‌ఎస్‌ సుసాధ్యం చేసింది. వ్యోమగాములు దీంట్లో ఉన్న ప్రయోగ శాలలను ఉపయోగించుకుంటూ భూ ప్రపంచంలో కానీ మరెక్కడ కానీ చేయలేని పరిశోధనలు చేస్తున్నారు.. ఈ పరిశోధన భూమిపైన మానవాళికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. పరిశోధన ఫలితాలను ‘స్పినోఫ్స్‌’ అంటారు.. మానవులు మైక్రో గ్రావిటీ సూక్ష్మ గురుత్వాకర్షణ నెలకొన్న పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఉన్నప్పుడు వారి దేహానికి ఏమౌతుందనే దానిపైన కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తుంటారు. ఐఎస్‌ఎస్‌‌లో జరిపే ప్రయోగాల వల్ల పరిశోధనలు రోదసిలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో దూర తీరాలకు చేరుకునే మానవసహిత యాత్రలను చేపట్టడానికి మార్గం సుగమమౌతుంది.

ప్రయోగాల్లో ప్రధానాంశాలు..

అంతరిక్షంలో శుభాంశు చేపట్టనున్న ప్రయోగాల్లో ముఖ్యంగా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో భారతీయ ఆహార పదార్థాలపై జరగబోయే ప్రయోగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మన సంప్రదాయ ఆహారాలైన మెంతి, పెసర మొలకలను అంతరిక్షంలో ఎలా పెంచవచ్చు? వాటి పెరుగుదల, జీవన విధానం ఎలా ఉంటుందనే అంశాలను ఆయన అధ్యయనం చేయనున్నారు.. పంట సాగుతో పాటు, అత్యంత అరుదైన సూక్ష్మజీవి 'నీటి ఎలుగుబంటి'పై అధ్యయనం ప్రధానమైనవి. 0.3 మి.మీల నుంచి 0.5 మి.మీల పొడవు ఉండే టార్డిగ్రేడ్, భూమిపై అత్యంత కఠినమైన పర్యా వరణ పరిస్థితులను సైతం తట్టుకుని జీవించగల అరుదైన డీఎన్ఏను కలిగి ఉంటుంది. ఇస్రో ఇప్పటికే ఈ జీవి డీఎన్ఏను డీకోడ్ చేసింది. అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వా కర్షణ శక్తిలో దీని పునరుత్పత్తిని, భూమి, అంతరిక్షంలో జరిగే జన్యు మార్పిడిని అధ్యయనం చేస్తారు. తీవ్రమైన సూర్యరశ్మి, గురుత్వాకర్షణ వంటి పరిస్థితుల్లో ఈ జీవి డీఎన్ఏలో కలిగే మార్పులను పరిశీలించడం ద్వారా భవిష్యత్ వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు.. ఈ అధ్యయనం త్వరలో ప్రయోగించనున్న మానవసహిత ‘గగన్ యాన్’ కూడా ఎంతో ఉపయోగపడనుందని ఇస్రో అంచనా వేస్తోంది.

సొంత అంతరిక్ష కేంద్రం దిశగా..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ, విద్యార్థులతోనూ శుభాంశు శుక్లా సంభాషించనున్నారు. ఈ ప్రయోగాన్ని నాసా, భారత అంతరిక్ష సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా, 2047 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర, ఆయన చేపట్టే పరిశోధనలు భారతదేశాన్ని అంతరిక్షయాన సామర్థ్యం కలిగిన దేశాల సరసన నిలబెట్టడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మారనున్నాయి. ఈ మిషన్ విజయవంతంగా పూర్తయితే భవిష్యత్తులో మన దేశీయ వ్యోమగాములకు మరిన్ని అవకాశాలు తెరుచుకోనున్నాయి. ఇది భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో ఒక కీలక అధ్యాయంగా నిలిచిపోనుంది.

-వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story