వంద అబద్ధాలు.. ఒక పెళ్లి.. లక్షల వసూళ్లు..

by Ravi |   (  Updated:2026-02-04 01:15:12  IST  )

ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దల మాట, పరిచయాల విశ్వాసం, కుటుంబాల మధ్య బాధ్యత, రెండు మనసుల మధ్య బంధం ఈ నాలుగు స్థంభాల మీద నిలబడిన వ్యవస్థ. కానీ నేడు యాప్, సబ్‌స్క్రిప్షన్, కమీషన్, డీల్ క్లోజింగ్.. ఇది పెళ్లి కాదు.. మ్యాట్రిమోని యల్ మార్కెట్.. ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. మొదట పరిచయాల కొరత వచ్చింది. పట్టణీకరణ పెరిగింది. కుటుంబాలు చిన్నవయ్యాయి. పెద్దల పాత్ర తగ్గింది. ఈ ఖాళీలోకి మ్యారేజ్ బ్యూరోలు ప్రవేశించాయి..

వంద అబద్ధాలు.. ఒక పెళ్లి.. లక్షల వసూళ్లు..
X

ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దల మాట, పరిచయాల విశ్వాసం, కుటుంబాల మధ్య బాధ్యత, రెండు మనసుల మధ్య బంధం ఈ నాలుగు స్థంభాల మీద నిలబడిన వ్యవస్థ. కానీ నేడు యాప్, సబ్‌స్క్రిప్షన్, కమీషన్, డీల్ క్లోజింగ్.. ఇది పెళ్లి కాదు.. మ్యాట్రిమోని యల్ మార్కెట్.. ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. మొదట పరిచయాల కొరత వచ్చింది. పట్టణీకరణ పెరిగింది. కుటుంబాలు చిన్నవయ్యాయి. పెద్దల పాత్ర తగ్గింది. ఈ ఖాళీలోకి మ్యారేజ్ బ్యూరోలు ప్రవేశించాయి. ప్రారంభంలో అవి అవసరానికి సమాధానం ఇచ్చాయి. కానీ అవసరమే శాశ్వతమైతే, అది వ్యాపారంగా మారడం సహజం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది..

ఏ సమాజంలోనైనా వివాహ వ్యవస్థ ఎలా ఉందో చూసి ఆ సమాజం మానవ విలువల స్థాయి అర్థమవుతుంది. భారతీయ సమాజంలో పెళ్లి కేవలం రెండు మనసుల మధ్య ఒప్పందం కాదు.. అది రెండు కుటుంబాల మధ్య బాధ్యతా బంధం, తరాల కొనసాగింపు, సామాజిక భద్రతా వ్యవస్థ. అలాంటి వ్యవస్థ నేడు నెమ్మదిగా కానీ స్పష్టంగా వాణిజ్య మార్కెట్‌గా మారుతోంది..

సేవ నుంచీ.. దోపిడీ వరకు..

నేడు చాలా మ్యారేజ్ బ్యూరోలు ‘సేవ’ అన్న పదాన్ని వాడుతున్నప్పటికీ, వాటి పని తీరును గమనిస్తే అవి ఒక రిస్క్ లేని బ్రోకరేజ్ వ్యవస్థలా పనిచేస్తున్నాయి. మొదట్లో మ్యారేజ్ బ్యూరోలు ఒక అవసరంగా పుట్టాయి. ఉద్దేశ్యం మంచిదే, సరైన సంబంధం వెతకడం, కుటుంబాల మధ్య మధ్యవర్తిత్వం, విశ్వసనీయత కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు కనిపిస్తున్న భయంకర వాస్తవాలు, ఒక పెళ్లి కుదిరితే 5% – 10% కమిషన్, అబ్బాయి జీతం ఎక్కువైతే ‘ప్రీమియం ప్రొఫైల్’, అమ్మాయి ఆస్తి ఉంటే ‘హాట్ డీల్’ ఇది పెళ్లి కాదు.. హ్యూమన్ ట్రేడింగ్, వంద అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలనేది పాత కాలం సూక్తి, కానీ నేడు.. వంద అబద్ధాలాడి ఒక పెళ్లి చేసి లక్షలు దోచుకోవాలి.. అంటే, పెళ్లి ఎంత ‘పెద్దది’ అయితే, బ్రోకర్ లాభం అంత ఎక్కువ.

లాభం ప్రైవేట్‌కి, నష్టం సమాజానికి..

ఇక్కడ ఒక ప్రాథమిక ప్రశ్న వేయాలి, పెళ్లి కుదరడంలో మధ్యవర్తి పాత్ర ఉందనుకుందాం. కానీ అతనికి అబ్బాయి మంచివాడా? మానసికంగా స్థిరంగా ఉన్నాడా? వ్యసనాలు ఉన్నాయా? మహిళలపై దృక్పథం ఎలా ఉంది? ఇవి నిజాయితీగా పరిశీలించే బాధ్యత వాస్తవంలో లేదు. ఎందుకంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే డీల్ ఆలస్యం అవుతుంది, లేదా పూర్తిగా కుదరకపోవచ్చు.. వ్యాపార దృష్టిలో అది ‘నష్టం’. ఇదే కారణంగా అబద్ధాలు వ్యవస్థలో భాగమయ్యాయి. ఇది వ్యక్తిగత దుర్మార్గం కాదు. ఇది వ్యవస్థాగత ప్రోత్సాహం. అందుకే ఇవన్నీ ‘తర్వాత చూసుకుందాం’ అన్న ధోరణితో పెళ్లి చేసేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత సమస్యలు వస్తే అది కుటుంబాల సమస్యగా మారుతుంది, బ్రోకర్ బాధ్యత కాదు. అంటే లాభం ప్రైవేట్‌కి, నష్టం సామాజానికి..

నష్టపోతున్న ఆడపిల్ల తల్లిదండ్రులు..

ఈ వ్యవస్థలో అత్యధికంగా నష్టపోతున్న వర్గం ఆడపిల్ల తల్లిదండ్రులు.. ఇది భావోద్వేగ వాదన కాదు, ఒక సామాజిక వాస్తవం. పెళ్లి వయసు దాటిపోతుందేమో అన్న భయం, సమాజపు ప్రశ్నలు, బంధువుల ఒత్తిడి ఇవి ఇప్పటికే మానసి కంగా భారంగా ఉంటాయి. ఈ భయాన్ని కొందరు బ్యూరోలు స్పష్టంగా ఉపయోగించుకుంటున్నారు. ‘ఇదే చివరి మంచి సంబంధం’, ‘ఇలాంటి అబ్బాయి మళ్లీ రాడు’ వంటి మాటలు ఒకరకమైన మానసిక మానిప్యులేషన్. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు ఆలోచన కంటే భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు.. మ్యారేజ్ యాప్స్ ఈ వాణిజ్యీ‌కరణను మరింత వేగవంతం చేశాయి. ఆల్గారిథమ్ ఆధారిత మ్యాచింగ్ అనేది సాంకేతికంగా ఆధునికంగా కనిపించినా, వాస్తవానికి అది కొద్ది కొలమానాలకే పరిమితం. వయసు, జీతం, కులం, ఆస్తి, మానవ స్వభావం, మానసిక ఆరోగ్యం, విలువలు వంటి అంశాలు డేటాగా మారలేవు.. కాబట్టి అవి పూర్తిగా పక్కకు నెట్టబడుతున్నాయి. ఫలితంగా మనిషి ఒక ప్రొఫైల్ కార్డుగా మారిపోయాడు.

ఇలాగే అయితే...

విద్య, వైద్యం వాణిజ్యమైతే ఫలితాలు మనం ఇప్పటికే చూస్తున్నాం. ఇప్పుడు వివాహ వ్యవస్థ కూడా అదే దారిలో నడిస్తే, దాని ప్రభావం మరింత లోతుగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబం అనేది సమాజానికి మూల యూనిట్. కుటుంబాలు బలహీనపడితే, చట్టాలు ఎంత ఉన్నా సమాజం నిలబడదు.. దీర్ఘకాలంలో సామాజిక అసమతుల్యత పెరుగుతుంది. పెళ్లి ఒక డీల్‌గా మారితే, విశ్వాసం బలహీనపడుతుంది, కుటుంబాలు అస్థిరమవుతాయి. ఇది ‘ఆధునికత వర్సెస్ సంప్రదాయం’ అనే సులభమైన చర్చ కాదు. మార్పు అవసరం. యాప్స్ అవసరం. కానీ నియంత్రణ లేకుండా, బాధ్యత లేకుండా, లాభమే లక్ష్యంగా మారితే అది అభివృద్ధి కాదు, మానవతా విలువల క్షీణత.

పరిష్కారం...

ఈ పరిస్థితికి పరిష్కారం రెండు స్థాయిల్లో ఉండాలి. ఒకటి వ్యవస్థాగతంగా.. అంటే మ్యారేజ్ బ్యూరోలకి చట్ట బద్ధమైన నమోదు, కమిషన్ పరిమితులు, తప్పుడు సమాచారానికి శిక్షలు, కనీస వెరిఫికేషన్ ప్రమాణాలు అవసరం. రెండోది సామాజికం.. కుటుంబాలు ‘పెళ్లి కుదిరితే చాలు’ అనే ఆలోచన నుంచి ‘ఎలాంటి పెళ్లి’ అనే ప్రశ్న వైపు మారాలి. ఎందుకంటే పెళ్లి అనేది మార్కెట్ డీల్ కాదు.. అది జీవితకాల బాధ్యత. దాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చి భవిష్యత్ తరాల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెడుతున్నాం. పెళ్లి అంటే బాధ్యత, విశ్వాసం, మానవత్వం. వాటిని కమీషన్లలో కొలవడం మన సమాజం చేసిన నైతిక అపరాధం. ఇది ఇప్పుడే ఆలోచించాల్సిన సమయం.. తర్వాత కాదు..

-డాక్టర్. కేశవులు ఎండీ. (సైకియాట్రీ)

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Next Story