అన్నదాతకు అభయహస్తం

by Ravi |   (  Updated:2026-05-13 01:00:57  IST  )

వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కానీ రైతులు కనీస మద్దతు ధరలు, అప్పులు, ప్రకృతి విపత్తులు, మార్కెట్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలపై వ్యాసం.

అన్నదాతకు అభయహస్తం
X

ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా.. భూమి తల్లి దయతో రైతన్న పండించిన పంటలే ఆహారం.. గుప్పెడు మట్టిలోంచి పిడికెడు ఆహారాన్ని అందించే రైతన్న దేశానికి పెద్ద కొడుకు లాంటి వాడు.. అగ్గిపెట్టె నుండి విమానాల దాకా ఏ పరిశ్రమలో అయినా తన ఉత్పత్తికి తానే ధర నిర్ణయించుకునే అధికారం ఉత్పత్తిదారులకు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ అవకాశం రైతులకు లేదు..

భారతదేశం వంటి వ్యవసాయ ప్రధాన దేశంలో రైతుల ప్రాముఖ్యత అపారమైనది. దేశ జనాభాలో సుమారు 54 శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. వ్యవసాయం కేవలం ఆహార ఉత్పత్తి మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక స్థిరత్వం, గ్రామీణ ఉపాధి, పరిశ్రమల అభివృద్ధికి కూడా మూలస్తంభంగా ఉంది. భారతదేశ జీడీపీలో వ్యవసాయ రంగం సుమారు 15–18% వరకు వాటా కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల్లో 40% కంటే ఎక్కువ వ్యవసాయం ద్వారానే లభిస్తున్నాయి.

రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు..

అయితే, రైతుల పరిస్థితి మాత్రం ఆశించినంత స్థిరంగా లేదు. ముఖ్యంగా పంటలకు తగిన కనీస మద్దతు ధర అందకపోవడం వల్ల తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావంగా ఎండలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో రైతుల ఆదాయం అస్థిరంగా మారుతోంది. అదనంగా, వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడుల కోసం తీసుకున్న రుణాలు పెరుగుతూ ఉండటం రైతులను అప్పుల బారిన పడేలా చేస్తోంది. మధ్యవర్తుల దోపిడీ కారణంగా రైతులకు తగిన లాభం దక్కకపోవడం, సరైన సాగునీటి సౌకర్యాల లేమి వల్ల పంట దిగుబడులు తగ్గిపోవడం, మార్కెట్‌లో ధరల మార్పులు రైతుల భవిష్యత్తును అనిశ్చితంగా మారుస్తున్నాయి. ఈ సమస్యలన్నింటి కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు అప్పుల ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివిధ నివేదికలు సూచిస్తున్నాయి.

రైతులకు చేయూత..

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పలు కీలక చర్యలు చేపట్టాయి. 2008లో అమలు చేసిన భారీ రుణమాఫీ పథకం ద్వారా సుమారు ₹70,000 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలు మాఫీ చేసింది. దీనివల్ల కోట్లాది మంది రైతులు అప్పుల భారం నుంచి ఉపశమనం పొందారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి, రైతుల కుటుంబాలకు అదనపు ఆదాయం లభించింది. కనీస మద్దతు ధర వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పంటలకు మెరుగైన ధరలు అందేలా ప్రయత్నాలు జరిగాయి. ఎరువులు, విత్తనాలు, సాగునీటి ప్రాజెక్టులకు సబ్సిడీలు అందించడం ద్వారా వ్యవసాయ వ్యయాలను తగ్గించే చర్యలు తీసుకున్నారు. అలాగే 2013లో ఆహార భద్రత చట్టం అమలు చేయడం వల్ల రైతుల ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ డిమాండ్ ఏర్పడింది. ఈ చర్యల వల్ల రైతుల ఆదాయం కొంతవరకు స్థిరపడటమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరింది. అదే బీజేపీ 2020లో మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టి రైతుల నిరసనలతో ఏడాది తర్వాత రద్దు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం..

ఇక తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఉన్న అప్పు భారాన్ని తగ్గించేందుకు భారీ స్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేస్తోంది. సుమారు ₹31,000 కోట్ల రుణమాఫీ లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటికే ₹20,616 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, ఒక్కో రైతుకు ₹2 లక్షల వరకు ఉపశమనం కల్పిస్తున్నారు. అలాగే 2026–27 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయ శాఖకు ₹23,179 కోట్లు కేటాయించగా, అందులో రైతు భరోసా పథకానికి ₹18,000 కోట్లు, సన్న వడ్ల బోనస్‌కు ₹3,500 కోట్లు కేటాయించారు. ఇక పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా చూస్తే రైతుల ఆదాయం పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం లక్ష్యంగా ఈ కేటాయింపులు చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే నిజం ఎప్పటికీ మారదు. కాబట్టి రైతుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించడం అత్యంత అవసరం.

- డా. వి. చంద్రకాంత్ రెడ్డి

రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్

77992 92222

Next Story