కులం మీద చావుడప్పు కొట్టిన దండోరా..

by Ravi |   (  Updated:2026-01-31 01:00:47  IST  )

ఎన్నోయేండ్లుగా తెలుగు సినిమా ఆధిపత్య కులాల చేతిలోనే తన వెండితెర రంగులను విరజిమ్ముతున్న దనే లోక పలుకులు లేకపోలేదు.. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన కుల-వర్గాలను ఉద్దేశించి తమిళ-మళయాలి, బెంగాలీ వంటి సినిమాలు నేరుగా తెలుగులో కూడా వస్తాయా!? అనుకునే సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్ పలాస 1978 సినిమాతో మనకున్న సందేహాలను తొలిచే ప్రయత్నం చేసిండు.

కులం మీద చావుడప్పు కొట్టిన దండోరా..
X

ఎన్నోయేండ్లుగా తెలుగు సినిమా ఆధిపత్య కులాల చేతిలోనే తన వెండితెర రంగులను విరజిమ్ముతున్న దనే లోక పలుకులు లేకపోలేదు.. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన కుల-వర్గాలను ఉద్దేశించి తమిళ-మళయాలి, బెంగాలీ వంటి సినిమాలు నేరుగా తెలుగులో కూడా వస్తాయా!? అనుకునే సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్ పలాస 1978 సినిమాతో మనకున్న సందేహాలను తొలిచే ప్రయత్నం చేసిండు. ఇదే తరహలో ఇప్పుడు దండోరా-2025 మరింత నేరుగా కులంమీద చావుడప్పు కొట్టిందనే చెప్పుకోవాలి.

నేరుగా చెప్పాలంటే చాటింపుకు మరొక రూపమే దండోరా.. తెలుగులో 1993లో ఆర్. నారాయణ మూర్తి దండోరా పేరు మీద సినిమా తీసినప్పుడు పిచ్చి సారా లేదా గుడుంబా మీద ఒక బలమైన తిరుగుబాటును లేవనెత్తిన వైనం మూడున్నర దశాబ్దాల కిందట మనం చూసినదే. ఆ సమయంలో ఈ సినిమా ఎంతో హిట్‌గా నిలబడింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దండోరా 2025 సినిమా కూడా ఒక అద్భుతమైన చరిత్రనే..

నటించలేదు.. జీవించేశారు..

తొడలు బాదుకునే దగ్గర నుండి ముసలి స్టెప్పులు వేసే నేటి వరకు వచ్చిన తెలుగు సినిమా మధ్యలో ఒక 'స్వయంకృషి' వృత్తిపరంగానే కన్పించి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన వర్గమే కన్పిస్తుంది గానీ ఇక్కడ కుల వివక్షతను నేరుగా చూపలేదు కె.విశ్వనాథ్. కానీ మురళీకాంత్ మాత్రం నేరుగా కులం ఎంతటి విషంతో నిండివుందో అది సాగించే దమనకాండ ఎంతకు దారితీస్తుందో చాలా ధైర్యంగా తెరకెక్కించారు.. ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, మహిళా యాక్టర్స్ ఎవరికివారే జీవించిర్రు తమ నటనలో.

కులపిచ్చి బాడ్కావుల మొఖాన ఊసి...

ఇంతగొప్ప సినిమాను కనపడనివ్వకుండా శివాజీ- అనసూయ బట్టల పంచాయతీ మాటున బలే తెల్విగా ప్రవర్తించింది కుల మీడియా, ఆధిపత్య సినిమా ప్రపంచం. తమిళ‌నాడు తరహలో ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్ మనకు ఇపుడిపుడే రావడం చాలా సంతోషం.. రేపటి సినిమా భవిష్యత్తు కూడా వీరిదే! నవదీప్ దళిత వర్గాల నుండి ఎన్నికైన సర్పంచ్. నిజంగా ఊళ్లల్లో ఇట్లనే ఉంటరు.. ఊరిని కాదని ఆధిపత్య కులాన్ని దాటుకోని ఏ నిర్ణయం తీసుకోకుండా! కానీ ఈయన హావభావాలు మొత్తం కుల పిచ్చి బాడ్కావుల మొఖాన ఊసినట్లుగానే ఉంటయ్! కుల పిచ్చితో ఊగిపోయిన శివాజీ చివరకు అదే కులంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు.. ఎందుకంటే ఈయన కూతురు సుజాత చనిపోయాక చేసిన తప్పులు తెలుసు కోని మార్పు చెందుతాడు. అయితే కులం ఇప్పుడు ఈయన మీద కుల పరువు పడగ విప్పుతుంది.

మత్తు దిగేందుకు సమయం పట్టింది!

తన(శివాజీ) కూతుర్ని ప్రేమించిన దళిత యువకుడిని శివాజీ కులం తరపునోళ్లు చంపేసిన కొంతకాలానికి కోర్టులో కేసు జడ్జిమెంట్ సమయం వస్తుంది అప్పుడు న్యాయమూర్తి శివాజీతో ‘ఏమయ్య పెద్దమనిషి ఇన్నేండ్లకు నీకు తప్పు చేశామని అన్పించిందా? అంటాడు అప్పుడు దోషిగా బోనులో నిలబడిన శివాజీ ‘కల్లుమత్తు కాదు గదా సార్ రాత్రి తాగితే పొద్దున్నే దిగిపోవడానికి.. ఇది కులం మత్తులో చేసింది అందుకే కొంత సమయం పట్టింది’ అని అంటాడు. నిజమే ఈ దేశంలో ఎంతోమంది కులం పేరిట సాగించే దమనకాండలో చివరకు ఏదో ఒక క్షణంలో పశ్చాత్తాపం చెందాల్సిందే కానీ ఈ సమయానికే జీవితం ముగిసిపోవచ్చు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇలా కులం పేరిట సాగే ఎన్నో హత్యలకు మీడియా పెట్టిన పేరు కూడా పరువు హత్యలని ఇది కూడా ఒక కుట్ర. పరువుకు కులానికి సంబంధమే లేదు.. శివాజీ చేరదీసిన ఒక వ్యభిచారిణి కూతురు ఈ సినిమాకు నిజమైన హీరో అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు ఆ పాపనే హీరో అనేది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తోంది!

చదువు లేదా రాజకీయం చెయ్!

డైరెక్టర్, బుద్దుడిని పూలే - అంబేద్కర్ అలాగే దళిత సాహిత్యాన్ని బాగా చదివినోడేమో అనిపిస్తుంది ఈ సినిమా చూసినంతసేపు.. ఏ జాతులైతే తమ హక్కుల కోసం పోరాటాలు చేయవో అలాంటి జాతులు చరిత్రలో కనుమరుగై పోతాయనే బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు చాలా స్పష్టంగా విన్పిస్తూ కన్పిస్తాయి ఈ సినిమాలో.. సీనియర్ నటులు, దర్శకుడైన దేవి ప్రసాద్ ఇదే సినిమాలో చెప్పే ఒక డైలాగ్ ఇప్పుడు మన నిజజీవితాలకు ఎంతో అవసరం "చదివితే పిచ్చిపట్టినట్లుగా చదివేయండి. పూలే, పెరియార్, అంబేద్కర్ ఏం చెప్పారో చదివేయండి లేదంటే రాజకీయాలు చేయాలే" ఇదే నేటి ఈ దేశంలో ఎనభై శాతమున్న అణగారిన బడుగు బలహీన కులాలకు అవసరమైన జీవిత పాఠం.

చిత్రం: దండోరా

నటీనటులు: శివాజీ, నందు, మౌనిక రెడ్డి,

నవదీప్ తదితరులు

దర్శకత్వం: మురళీకాంత్

లభ్యం: అమెజాన్ ప్రైమ్


-వరకుమార్ గుండెపంగు

99485 41711

Next Story