అమలిన శృంగార దృశ్యకావ్య దర్శకుడు..

by Ravi |   (  Updated:2026-06-13 01:00:11  IST  )

గ్రామీణ జీవితాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని, మానవ సంబంధాల లోతులను వెండితెరపై సహజంగా ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా సినీ ప్రస్థానం, ఆయన సృష్టించిన విప్లవాత్మక మార్పులు, మహిళా పాత్రల చిత్రణ, సామాజిక చైతన్యం, చిరస్మరణీయ వారసత్వంపై ప్రత్యేక కథనం.

అమలిన శృంగార దృశ్యకావ్య దర్శకుడు..
X

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన భారతిరాజా దర్శకుడిగా, నటుడిగా విశేష ఖ్యాతి గడించాడు. తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలు నాటి సామాజిక రుగ్మతలు, కుల వివక్షతకు, మూఢ నమ్మకాలను కళ్లకు కట్టాయి, ఆయన ఎంచుకునే కథ అంశాలు క్లిష్టమైనప్పటికీ ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా వాటిని తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్య చిత్రాలే కాదు. ఆడ శిశు హత్యలకు వ్యతిరేకంగా మహిళా ప్రాధాన్యత చిత్ర లను కూడా రూపొందించాడు.

మనిషికో స్నేహం, మనసుకో దాహం, అంటూ అమలిన శృంగారాన్ని వెండి తెరకెక్కించిన భారతి రాజా ఇకలేరు. తమిళ తెరను కప్పేసిన మెలోడి డ్రామాకి, అవుట్ స్పోకెన్ సంభాషణలకి చెల్లు చీటీ ఇచ్చి, తమిళ చిత్రాన్ని నాలుగు గోడల మధ్య నుండి విశాల ప్రపంచంలోకి తీసుకుని వచ్చి, ప్రేక్షకుడికి తన కళ్లముందే ఉన్న తన ప్రకృతిక సౌందర్యాన్ని తనకే సరి కొత్తగా పరిచయం చేసిన భారతీరాజా ఇకలేరు. సామాన్య మనుషుల అసామాన్య భావోద్వేగాలకు పెద్ద పీట వేసిన భారతీ రాజా ఇకలేరు.

మట్టి గుబాళింపును పట్టి చూపి...

భారతిరాజా తెరకెక్కించిన ప్రతి చిత్రంలో సన్నివేశాలు అన్నీ కూడా పల్లెటూరి నేపథ్యాన్ని, ప్రకృతిని ఒడిసి పట్టుకునేటట్టు ఉంటాయి. పల్లెలు పంచే మమకారం, పొలం గట్లపై విహారం ఆయన సినిమా అంటే మట్టి గుబాలింపు సహజమైన సౌందర్యం సంఘర్షణలకు చిరునామా, పాటలు చెక్కు చెదరకుండా అతి సహజంగా ఉంటాయి. ఆయన సినిమాలు పల్లెలో కట్టుకున్న అందమైన పొదరిల్లులు. అందుకే ఆ సినిమాలు కాలంతో పోటీపడుతూ నిత్య నూతనంగా నిలిచిపోయాయి.

సినిమా ఆలోచననే మార్చిన దిగ్గజం..

భారతీరాజా రాకతో తమిళ సినిమా శైలి మాత్రమే కాదు, మొత్తం దక్షిణ భారత సినిమా ఆలోచనా విధానమే మారి పోయింది. పల్లెటూరి మట్టి వాసనను, గ్రామీణ సంస్కృతిని, పల్లెటూరి మనుషుల అంతరంగలను వెండితెరపై భారతీరాజా చూపించినంత అద్భుతంగా ఎవరూ చూపించలేరనే పేరును ఆయన సొంతం చేసుకున్నారు. భారతీరాజా దర్శకత్వ శైలి అత్యంత విలక్షణమైనది. సినిమా అంటే కేవలం నటీనటులు చెప్పే డైలాగులు మాత్రమే కాదని, కెమెరా కదలికలు, నేపథ్య సంగీతం, ప్రకృతి కూడా మాట్లాడగలవని ఆయన నిరూపించారు. భారతీరాజా సినిమాల్లో విజువల్స్ చాలా బలంగా ఉంటాయి. ఎర్రటి మట్టి రోడ్లు, చెరువులు, పొలాలు, ఎండ తీవ్రత, వర్షం, ఇవన్నీ ఆయన సినిమాల్లో కేవలం నేపథ్యాలుగా కాక కథలో పాత్రలుగా మారిపోతాయి. పాత్రల భావోద్వే గాలను ప్రతిబింబించడానికి ప్రకృతిని ఒక సాధనంగా వాడు కోవడం ఆయన శైలి.

సహజత్వానికి అగ్రతాంబూలం!

సాంప్రదాయక సినిమా సూత్రాలను బద్దలు కొడుతూ, పాత్రల సహజత్వానికి ఆయన అగ్రతాంబూలం ఇచ్చారు. మెలోడ్రామాను తగ్గించి, మనుషుల మధ్య ఉండే అసలైన మానసిక సంఘర్షణను తెరపై చూపించారు. నిశ్శబ్దం ఒక భాష అనీ, అదొక బలమైన భావ వ్యక్తీకరణ అని ఆయన తన సినిమాల ద్వారా నిరూపించారు. సంగీత దర్శకుడు ఇళయరాజాతో ఆయనకు ఉన్న అనుబంధం సినిమా చరిత్రలోనే ఒక స్వర్ణయుగం. భారతీరాజా దృశ్య శైలికి, ఇళయరాజా జానపద శాస్త్రీయ సంగీత మిశ్రమానికి కుదిరిన బంధం తమిళ సినిమాకు ప్రాణం పోసింది. భారతీరాజా కేవలం కెమెరాను స్టూడియో నాలుగు గోడల నుండి బయటకు తీసుకురావడమే కాదు, సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ రంగాల్లో సరికొత్త ప్రమా ణాలను నెలకొల్పారు.

శక్తివంతమైన మహిళా పాత్రలు..

భారతీరాజా సినిమాల్లో మహిళా పాత్రల చిత్రణ అత్యంత శక్తిమంతంగా, సమాజ ఆలోచనలను ప్రశ్నించే విధంగా ఉంటుంది. ఆయన సృష్టించిన నాయికలు కేవలం గ్లామర్ బొమ్మలు కాదు. వారిలో పల్లెటూరి అమాయకత్వం కని పిస్తూనే, కష్టాలను ఎదుర్కొనే మానసిక ధైర్యం, పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించే తిరుగుబాటు స్వభావం మూర్తీ భవిస్తాయి. ప్రేమ కోసం ప్రాణాలనైనా ఇచ్చే లేదా కులమతాల కట్టుబాట్లను తెంచుకుని పోరాడే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన సృష్టించే ప్రతి నాయిక పాత్రలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తుంది.

తరాలను ప్రభావితం చేసిన దర్శకుడు..

ఒక పక్క సమాజంలోని కుల వివక్ష, కట్టుబాట్లు, మూఢ నమ్మకాలపై తన సినిమాల ద్వారా తిరుగుబాటు చేస్తూనే, మరోపక్క మానవత్వంలోని మంచితనాన్ని, ప్రేమను సున్నితంగా ఆవిష్కరించిన భారతీరాజా ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచి పోతుంది. చలనచిత్ర రంగంలో ఆయన సృష్టించిన విప్లవాత్మక మార్పులు ఒక తరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, సినిమా ఉన్నంత కాలం భారతీరాజా అనే పేరును సజీవంగా ఉంచుతాయి.

-డా.జి. భాస్కర్ యాదవ్

ప్రొఫెసర్, ఓయూ

96030 97923

Next Story