- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మహా’ముంపు లేకుండా తుమ్మిడిహెట్టి.. కొత్త అలైన్మెంట్‌తో సర్కారు సిద్ధం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టిని పూర్తిచేసి తీరుతామని ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తుమ్మిడిహెట్టి నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అడ్డంకిగా మారడంతో.. ఎలాగైనా ఆ ప్రభుత్వాన్ని

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టిని పూర్తిచేసి తీరుతామని ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తుమ్మిడిహెట్టి నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అడ్డంకిగా మారడంతో.. ఎలాగైనా ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కొర్రీలకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా.. ప్రత్యామ్నాయాలు చూపించి పర్మిషన్ తీసుకువచ్చేందుకు పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. గతంలో అక్కడి ప్రభుత్వం అభ్యంతరాలతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎప్పటి నుంచో ప్రస్తావిస్తున్న ముంపు సమస్యను పూర్తిగా తొలగించేలా కొత్త అలైన్‌మెంట్‌ను సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
150 మీటర్ల ఎత్తు..
అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. కొత్త డిజైన్‌తో బరాజ్‌ను 150 మీటర్ల ఎత్తుతో నిర్మించినా మహారాష్ట్ర భూభాగంలోగానీ, చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో గానీ ముంపు ప్రభావం ఉండదని అంటున్నారు. అప్పట్లో ప్రతిపాదించిన డిజైన్ ప్రకారం బరాజ్‌ను 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో దాదాపు 1,500 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నదని అధికారులు గుర్తించారు. ఇందులో అటవీ భూములు, ముఖ్యంగా చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని ప్రాంతాలు కూడా ఉండటంతో మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడి సర్కార్ అంగీకరించలేదు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య చర్చల అనంతరం బరాజ్ ఎత్తును 148 మీటర్లకు పరిమితం చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయంతో ముంపు ప్రభావం సుమారు 270 ఎకరాలకు తగ్గినప్పటికీ, నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. అయితే.. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ప్రాజెక్టు అసలు లక్ష్యాలకు అనుగుణంగా నీటి లభ్యత ఉండదని భావించిన గత ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లలేదు.
బరాజ్‌ల లొకేషన్‌లో చేంజ్
గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో తుమ్మిడిహెట్టికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందించారు. గతంలో ప్రతిపాదించిన డిజైన్‌కు భిన్నంగా రెండు బరాజ్‌ల నిర్మాణం, వాటిని అనుసంధానించే నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్ ఏర్పాటులో మార్పులు చేశారు. వైన్ గంగా నదిపై నిర్మించే బరాజ్ స్థానాన్ని సైతం కొంత వెనక్కి మార్చితే ముంపు తక్కువ అవుతుందని అంచనా వేశారు. అంతేకాకుండా.. ఈ మార్పులతో బ్యాక్ వాటర్ ప్రభావం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో మహారాష్ట్ర అత్యంత ఆందోళన వ్యక్తం చేసిన అంశాల్లో చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ప్రధానంగా ఉన్నది. తాజా అలైన్‌మెంట్ ప్రకారం చాప్రాల్ అభయారణ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా అటవీ భూములు మునిగే అవకాశం కూడా లేదని చెబుతున్నారు. వైన్ గంగా, వార్ధా నదుల పరివాహక ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరిగినా, అది కేవలం క్యాచ్‌మెంట్ విస్తరణకే పరిమితమవుతుందని.. శాశ్వత ముంపు పరిస్థితులు ఏర్పడవని అంటున్నారు.
కొత్త అలైన్‌మెంట్‌పై సమగ్ర సర్వే
ఇదిలా ఉండగా.. కొత్త అలైన్‌మెంట్‌కు సంబంధించిన ముంపు అంచనాలపై ప్రస్తుతం ప్రభుత్వం సమగ్ర సర్వే చేయిస్తున్నది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఆర్వీ అసోసియేట్స్‌తోపాటు ఐఐటీ నిపుణులు సంయుక్తంగా ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నారు. ముంపు పరిధి, బ్యాక్ వాటర్ ప్రభావం, పర్యావరణ అంశాలు, అటవీ భూములపై ప్రభావం వంటి అంశాలను శాస్త్రీయంగా పరిశీలిస్తున్నారు. ఈ నివేదిక రాగానే ప్రాజెక్టుకు సంబంధించిన తుది సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. నివేదికలో ముంపు లేదని నిర్ధారణ అయితే మహారాష్ట్రను ఒప్పించడం మరింత సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త అలైన్‌మెంట్‌తో ముంపు మరింత తగ్గే అవకాశం ఉండటంతో పర్యావరణ అనుమతులు వచ్చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతులు పొందిన తర్వాత పర్యావరణ క్లియరెన్సులు సైతం వేగంగా వచ్చే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. సర్వే నివేదికలు, సాంకేతిక అనుమతులు, రాజకీయ చర్చలు సానుకూలంగా సాగితే తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.






