క్వింటాలుకు 19 కిలోల తరుగా..? ఇదేం న్యాయం!

by Ravi |   (  Updated:2026-05-31 00:30:44  IST  )

ధాన్యం అమ్మకాల్లో తరుగు, తూకాల్లో అక్రమాలు, కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబ్‌నగర్ ఘటన నేపథ్యంలో రైతుల దోపిడీ, పంట విక్రయాల్లో పారదర్శకత అవసరం, ప్రభుత్వ బాధ్యతపై విశ్లేషణ.

క్వింటాలుకు 19 కిలోల తరుగా..? ఇదేం న్యాయం!
X

“రైతే రాజు”, “రైతు లేనిదే రాజ్యం లేదు” అని నాయ కులు చెబుతుంటారు. కానీ రైతు వాస్తవ పరిస్థితి చూస్తే ఆ మాటలు కేవలం నినాదాలుగానే మిగిలి పోయాయనిపిస్తుంది. పంట పండించే వరకు ప్రకృతితో పోరాడే రైతు, అమ్మే సమయంలో వ్యవస్థతో యుద్ధం చేయాల్సి వస్తోంది. మహ బూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని ఓ రైస్ మిల్లులో రైతు తిరుపతయ్యకు క్వింటాలుకు 19 కిలోల వరకు తరుగు వేస్తున్నారని ఆరోపణలు రావడం రైతుల దుస్థితికి నిదర్శనం. ‘తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం అన్‌లోడ్ చేస్తాం’ అని రైస్ మిల్లుల యజమానులు చెప్పడం మరింత ఆందోళనకరం. ఇది ఒక్క భూత్పూర్ సమస్య కాదు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తేమ, నాణ్యత, తరుగు పేర్లతో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం, అకాల వర్షాల వల్ల నష్టాలు, తూకాల్లో అక్రమాలు రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒక రైతు పంట పండించడానికి ఎంతో కష్ట పడితే కానీ పంట చేతికి రాదు. కానీ అమ్మకానికి తీసుకెళ్లిన తర్వాత కూడా రైతు అవమానాలు, దోపిడీలు ఎదుర్కొంటే.. అతని మనోధైర్యం ఎలా నిలబడుతుంది? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో తెలంగాణ సమాజాన్ని కదిలించింది. కానీ ప్రశ్న ఏమిటంటే వీడియో వైరల్ అయిన తర్వాతే స్పందన ఎందుకు? అధికారులు ముందుగానే తనిఖీలు ఎందుకు చేయలేకపోతున్నారు? కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద సీసీ కెమెరాలు, డిజిటల్ తూకాలు, పారదర్శక విధానం ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వం రైతుబంధు, ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో పారదర్శకత లేకపోతే రైతుకు పూర్తి ప్రయోజనం అందదు. రైతు పంటను అమ్మే సమయంలో జరిగే దోపిడీని అరికట్టకపోతే.. రైతు సంక్షేమంపై చేసే ప్రకటనలకు అర్థం ఉండదు. రైతు కేవలం ఓటు వేసే వ్యక్తి కాదు.. దేశానికి అన్నం పెట్టే అన్నదాత. అతని చెమటతోనే దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడుతోంది. అలాంటి రైతు కళ్లలో కన్నీళ్లు కనిపిస్తే.. అది సమాజం మొత్తం విఫలమైనట్టే.

- అంజి గోపి

89788 37933

Next Story