ప్రజాస్వామ్యం పేరు మీద అవినీతి రాజ్యం.. మన యువత నేపాల్ బాట పట్టక తప్పదా?

by Ravi |   (  Updated:2025-09-24 01:15:38  IST  )

కట్టు బొట్టులో నేపాల్, భారత్ ఒకటేనని మన ప్రధాని అంటున్నారు. అట్లే అక్కడ ఇక్కడ పాలకుల అవినీతిలో, యువత నిరుద్యోగంలో కూడా ఒకటేనా?

ప్రజాస్వామ్యం పేరు మీద అవినీతి రాజ్యం.. మన యువత నేపాల్ బాట పట్టక తప్పదా?
X

కట్టు బొట్టులో నేపాల్, భారత్ ఒకటేనని మన ప్రధాని అంటున్నారు. అట్లే అక్కడ ఇక్కడ పాలకుల అవినీతిలో, యువత నిరుద్యోగంలో కూడా ఒకటేనా? 187 ప్రపంచ దేశాలలో అవినీతిలో నేపాల్ 107వ స్థానంలో ఉండగా భారత్‌ది 96వ స్థానం. మానవ వనరుల అభివృద్ధిలో నేపాల్ 145వది కాగా, భారత్ 130వది. భారత్‌లో ఒక శాతం సంపన్నుల చేతిలో 40 శాతం పైగా దేశ సంపద ఉండగా, నేపాల్‌లో పది శాతం సంపన్నుల చేతిలో 40 శాతం పైగా ఆ దేశ సంపద ఉన్నది. మన దేశంలో గాని నేపాల్‌లో గాని ఆర్థికవృద్ధి జరిగింది గాని ఆర్థికాభివృద్ధిలో లేదు. అందరినీ కలుపుకొని పోయేదే ఆర్థికాభివృద్ధి.

25 శాతం యువత అటు నేపాల్‌లో ఇటు భారత్‌లో నిరుద్యోగ నిస్పృహలతో కుటుంబాలకు భారంగా మారిన వారే. చదువుకున్న యువత నిరుద్యోగం ఇంకా ఎక్కువ. నిరుద్యోగుల్లో 60 శాతం వరకు చదువుకున్నవారే. బీటెక్ లాంటి కోర్సు చేసిన వారి నిరుద్యోగిత రేటు 2025 లో 83% వరకు ఉన్నదని, ఉన్న ఉద్యోగాలు కూడా ఎప్పుడు పోతాయో అని సందేహాలు ఉన్నాయి. వారే నిరాశ నిస్పృహలతో పని పాట లేకుండా ఉంటే ఈ దేశానికి దిక్కెవరు? పాలకులు నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేస్తున్నందున యువత జాతి నిర్మాణంలో భాగస్వాములు కాలేకపోతున్నారు. అటు ఆర్థికాభివృద్ధికి ఇటు సామాజిక భద్రతకు నష్టం వాటిల్లేది యువతలో అశాంతి హెచ్చరిల్లడం వల్లే కదా..

నిరాశ నిస్పృహలతో యువత..

దేశంలో పాలకులు వ్యవహరించే తీరు వలన కోట్ల కొలది యువతీ యువకులు నిరాశ నిస్పృహలతో నీరసించి పోతున్నారు. దీని‌వల్ల కుటుంబం, సమాజం, దేశం అశాంతికి గురి కాబడుతుంది. యువతలో నూతన ఉత్సాహం నింపి జీవితం పట్ల ఆశలు రేకెత్తించి అలాంటి విధాన కార్యక్రమాలు రూపొందించి చేపడితే పాలకులు త్రికరణ శుద్ధిగా యువతీ యువకులను అధునాతన ప్రపంచంలో మమేకం చేయగలిగితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కాలాన్ని మించిన వేగంతో యువత పరిగెత్తగలదు. చదివిన చదువుకు సరైన ఉద్యోగం దొరకక కనీస సంపాదనకు సైతం నోచుకోక దుర్భర పరిస్థితిలో మన యువత ఉండటం శోచనీయం. డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వ్యవ సాయ కూలీలుగా పనిచేస్తున్న వైనం పాల కులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు.

అతి తక్కువ సాంకేతిక నైపుణ్యం మనదే..

సాంకేతిక పరిజ్ఞానం చాలా వేగంగా అభివృద్ధి చెందడం, జాబ్ మార్కెట్ కూడా సాంకేతిక విద్య అభివృద్ధి చెందడం వలన యువతకు అనుకూలమైన కావలసిన నైపుణ్యాలను కల్పించగలిగితే సాంకేతిక సాధికారికతో దేశం మెరిసిపోతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ పట్టభద్రులు కూడా సగానికి పైగా నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రపంచంలో అత్యంత అల్ప స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలను కలిగిన దేశం మనది. మొత్తం శ్రామి కులలో కేవలం 4.69% మాత్రమే ఎంతో కొంత నైపుణ్యం కలిగి ఉన్నారు. మొత్తం శ్రామికుల విషయానికి వస్తే చైనాలో 24%, అమెరికాలో 52%, యునైటెడ్ కింగ్డమ్ 68%, జర్మనీలో 75%, జపాన్‌లో 80%, సౌత్ కొరియాలో 96% శ్రామికులు పూర్తి నైపుణ్యాలతో ఆర్థిక అభివృద్ధికి ఆయా దేశాలలో సహాయపడుతున్నారు. మన దేశం లో మాత్రమే అత్యంత తక్కువ స్థాయిలో నైపుణ్యం కలిగిన శ్రామికు‌లు ఉన్నారు. కాబట్టి మన దేశంలో శ్రామికుల నైపుణ్య శాతం పెంచాలి. ముఖ్యంగా యువత సాంకేతిక నైపుణ్యాన్ని పెంచగలిగితే దేశా భివృద్ధి వేగంగా జరుగుతుంది.

అవినీతి ప్రభుత్వాలను స్థాపించామా?

నేపాల్‌లో 2008లో రాచరిక వ్యవస్థను కూలదోసి కమ్యూనిస్టులు అని చెప్పుకునే ప్రజాస్వామ్యవాదులు నేపాల్‌లో ప్రభుత్వాన్ని స్థాపించారు. 2008 నుంచి 18 సంవత్సరాల్లో అక్కడ 15 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభుత్వాలు బహిరంగంగానే అవినీతికి బంధుప్రీతికి పాల్పడుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వాల పాలన పట్ల ప్రజలు విసిగిపోయి పాలకులను గద్దె దించేందుకు పోరాడారు. 2025లో మాజీ రాజు నేపాల్ అంతటా పర్యటించారు. ఆయన సభలకు పెద్ద ఎత్తున యువత హాజరయ్యారు. నేపాల్ రాచరిక వ్యవస్థను పారదోలి అవినీతి ప్రభుత్వాలను స్థాపించామని ప్రజల్లో ఆలోచన మొదలైంది. ముఖ్యంగా యువత నేపాల్ ప్రభుత్వాన్ని కోలదోయడంలో యువతకూ ఆ దేశ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. రాజకీయ వేత్తలను తరిమికొట్టారు. వారి ఆగ్రహానికి తట్టుకోలేక ప్రధాని కేపీ శర్మ ఓలి, ఆయన మంత్రివర్గ సహచరులు నేపాల్ విడిచి పారిపోయారు.

నిరుద్యోగమే అశాంతికి కారణం..

అక్కడి యువత నిరుద్యోగమే ప్రధాన కారణంగా మనకు కనబడుతుంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం నేపాల్ యువతలో ఐదుగురిలో ఒకరు నిరుద్యోగులు.. పాలకులు ప్రజల కు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక పోయారు. మనదేశంలో కూడా 2014లో మన ప్రధాని ప్రతి ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగ కల్పన చేస్తానని వాగ్దానం చేశారు. కానీ దానిని నిలబెట్టుకోలేక పోయారు. ఈ పది సంవత్సరాల కాలంలో ఆ లెక్కన 20 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఉంటే మన దేశం మెరిసిపోయేది. అలా కాకుండా బిలీనీయర్ల సంఖ్య పెరిగితే దేశం మెరిసిపోతుందనుకోవడం యువతకు అర్థం కావటం లేదు. అందుకే ఇలాంటి పరిణామాలు. ఇలాగే కొనసాగితే భారత్ యువత కూడా నేపాల్ బాట పట్టక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. తస్మాత్ జాగ్రత్త!

-డాక్టర్ ఎ. నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172

Next Story