బాధల్ని దాచుకుంటూ, నవ్వుల్ని చిందిస్తూ..

by Ravi |
బాధల్ని దాచుకుంటూ, నవ్వుల్ని చిందిస్తూ..
X

రానున్న రోజుల్లో ఉపాధ్యాయులు దొరకరు అనేది నమ్మశక్యం కాని పచ్చి నిజం. నేను ఒకప్పుడు ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయురాలుగా పని చేశా అని చెప్పుకునే దీన స్థితికి ఉపాధ్యాయ లోకం చేరుకుంటుందేమో.. అని భయంగా ఉంది. ఇక భవిష్యత్‌లో ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ బడుల్లో మాత్రమే కనిపిస్తారు అనేది అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. కార్పొరేట్ బడిలో ఉపాధ్యాయ వృత్తి అనగానే భయపడే స్థాయికి తీసుకువచ్చారు ఇప్పటి తల్లిదండ్రులు, సమాజం. ఇక ముందు ముందు కార్పొరేట్ పాఠశాలలో పనిచేసే కన్నా సొంత వ్యాపారం పెట్టుకోవచ్చని లేదా మల్టీనేషనల్ కంపెనీ‌లో సేల్స్ ఎక్జిక్యూటివ్‌గా చేరితే మంచి జీతంతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందుకోవచ్చు అని తమ వృత్తి మార్చుకుంటున్నారు ఎందరో ఉపాధ్యాయులు.

ప్రిన్సిపల్‌ని శిక్షిస్తే సెట్‌రైట్ అవుతుందా?

ఒకప్పుడు గురుభ్యో నమః, గురు దేవో భవ అని శ్రీకృష్ణుడు అంతటి వాడే సాందీపని అనే తన గురువుకి సేవ చేస్తూ విద్యను అభ్యసించాడు. రాజులు సైతం గురువుల ముందు మోకరిల్లి గురువుకి సేవ చేస్తూ విద్యను అభ్యసించే వాళ్లు. అలాంటిది పిల్లల అతి గారాబం, అతి తెలివితేటలతో తల్లిదండ్రులు నిజ నిజాలు తెలియకుండా ఉపాధ్యాయుల మీద నిందలు వేయడం, ఉపాధ్యాయులను కొట్టడం, ఉపాధ్యాయులు మనస్తాపం చెందేలా చేస్తూ, వాళ్లు అత్మహత్యలు చేసుకోవడానికి కారకులు అవుతున్నారు. ఒక్కొక్క సందర్భంలో కార్పొరేట్ పాఠశాలల్లో ఏదన్నా జరిగితే అక్కడి ప్రిన్సిపల్‌ని శిక్షిస్తున్నారు. కానీ ఆ కార్పొరేట్ పాఠశాల యధావిధిగా నడుస్తుంది. ఇలాంటి యథార్థ సంఘటనలు కొన్ని..

యాజమాన్యాన్ని ఏమీ చేయలేరు!

ఒక పాఠశాలలోని అమ్మాయి తప్పు చేసిందని గురువు నిలదీసినందుకు, ఆ ఉపాధ్యాయుడి మీద తప్పుడు నిందలు వేసి అతని ఉద్యోగం పోయేలా చేసింది ఒక అమ్మాయి. ఒక కాలేజీలో, ఒక అబ్బాయి యాజమాన్యం, తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ప్రిన్సిపాల్‌ని జైల్లో పెట్టారు. కానీ ఆ ఒత్తిడితో కూడిన చదువులు చెప్పమన్న యాజమాన్యంని ఎవరూ ఏమీ చేయలేదు? ఎటువంటి శిక్షా వెయ్యలేదు న్యాయస్థానం.

గురుదండన పిల్లలకు వరం

సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పట్లో అమ్మాయిలు, అబ్బా యిలు మంచి కన్నా చెడును నేర్చుకుని, ఉపాధ్యాయులను బెదిరిస్తూ వాళ్ల మానసిక క్షోభకు కారణం అవుతున్నారు. 100 మందిలో 1 శాతం తప్పుగా ఉన్నారని అందరూ ఉపాధ్యాయులను ఒకేలా చూస్తోంది ఈ సమాజం. ఇకనైనా తల్లిదండ్రులూ కళ్లు తెరవండి.! గురువు దండిచడమంటే మీ పిల్లలను సరైన దారిలో పెట్టడానికి మాత్రమే.! మీ పిల్లల్ని దారుల్లో పెట్టడం, నేటి కాలంలో మీకు అసాధ్యమైన పని. గురువులు మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని మందలిస్తే, అది వాళ్లు సరైన మార్గంలో పెట్టడానికి మాత్రమే అని అర్థం చేసుకుని, ప్రైవేటు టీచర్లను కాపాడుకోండి.

అనంత బాధల్లో ప్రైవేట్ టీచర్లు!

ప్రైవేట్ టీచర్లకు జీతాలు తక్కువ కానీ బాధ్యతలు మాత్రం చెప్పలేనన్ని. అడ్మిషన్స్ అండ్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్స్, ఎన్‌రోల్‌మెంట్, అకడమిక్ మార్క్ టెస్ట్‌లు, కేర్ టేకర్, ఉదయం వచ్చినప్పటీ నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకూ, వాళ్లకి చిన్న దెబ్బ కూడా తాకకుండా చూసుకోవాలి. ఇంత చేసినా పెదవులపై నవ్వునే ఉంచుకొని అలసట కనిపించకుండా మనసులో బాధలని కనిపించకుండా మిడిల్ క్లాస్ కష్టాలని కనపడకుండా బతికేస్తారు ఈ ప్రైవేట్ టీచర్లు.. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వాళ్లకి నా శతకోటి వందనాలు. మొదటి గురువులు అయిన తల్లిదండ్రులు, తరువాత ఉపాధ్యాయుల నుండి అనుభవాలను పంచుకుని, విద్యార్ధినీ విద్యార్థులు చదువుతో పాటు, క్రమ శిక్షణ, ప్రశ్నించే తత్వం, ఆత్మరక్షణ శిక్షణతోపాటు క్రీడలలో ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ... ఓ ఉపాధ్యాయురాలు...

పి. కరుణ బిందు

ప్రిన్సిపాల్, ప్రముఖ పాఠశాల

Advertisement

Next Story

Most Viewed