- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఈ సుప్రీంకోర్టు తీర్పు కాపీ.. ఎందుకంటే?

పాక్షిక సమాఖ్య వ్యవస్థతో కూడిన గణతంత్ర భారతదేశంలో రాష్ట్రాల గవర్నర్ల పాత్ర లిమిటెడ్ మాత్రమే, ఆయా రాష్ట్రాల కేబినెట్ నిర్ణయానికి వారు బద్ధులై ఉండాలి అని మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి కొత్త జవసత్వాలు ఇచ్చిందనే చెప్పాలి. సదరు తీర్పు ప్రతిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా దేశంలోని అందరూ గవర్నర్లకు, ఆయా రాష్ట్రాల హైకోర్టులకు పంపించాలని ఇచ్చిన ఆదేశాలు, భారత రాజ్యాంగానికి సుప్రీంకోర్టు కస్టోడియన్ అని విస్పష్టంగా తేల్చి చెప్పాయి.
తాత్సారానికి అడ్డుకట్ట
బీజేపీ వాసన కూడా గిట్టని ద్రవిడవాద తమిళనాడులో ఎలాగైనా అధికారాన్ని చెలాయించాలని తహతహలాడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గవర్నర్ ఆర్. ఎన్. రవి ద్వారా తొక్కి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 10 బిల్లులు గవర్నర్ అనుమతి కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నాయి అక్కడ. రాజ్యాంగం ప్రకారం ఒకసారి కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం ఏ రాష్ట్ర గవర్నర్‌కూ లేదు, మహా అయితే పునః పరిశీలించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేబినెట్‌ను కోరవచ్చును, అటువంటి సందర్భంలో రెండోసారి గనుక రాష్ట్ర ప్రభుత్వం/కేబినెట్ అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటే సదరు నిర్ణయాన్ని ఆమోదించడం మినహా గవర్నర్‌కు మరో మార్గం లేదు. అయినప్పటికీ కూడా గవర్నర్ ఆర్.ఎన్ రవి మొండిగా ఢిల్లీ నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఆయా బిల్లులను చట్టరూపం దాల్చడానికి అనుమతి ఇవ్వకుండా నెలల తరబడి తన అధికార నివాసంలోనే తొక్కిపెట్టారు.
గవర్నర్ పాత్ర ఇదే!
తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీం తలుపుతట్టిన తమిళనాడు ప్రభుత్వానికి, సుప్రీం డివిజనల్ బెంచ్ అండగా నిలవడమే కాదు భారత పార్లమెంటరీ వ్యవస్థలో గవర్నర్ల పాత్రను విస్పష్టంగా నిర్వచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు/ కేబినెట్ ఆమోదించిన బిల్లులను, ఆయా రాష్ట్రాల శాసన సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సిందే అని ఆదేశించడమే కాదు, ఇటువంటి పొరపాట్లు ఇంకెవరూ చేయకుండా, భవిష్యత్తులో ఎటువంటి అనుమానానికి అవకాశం ఇవ్వకూడదన్నట్లు అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఆ తీర్పు ప్రతిని పంపించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. 415 పేజీల సుప్రీం తీర్పు భారత ప్రజాస్వామ్యానికి నూతనో త్తేజాన్ని ఇచ్చిందనే చెప్పాలి.
కళ్లు తెరిపించిన తీర్పు
తమ అనుంగు సహచరులను ఆయా రాష్ట్రాల గవర్నర్లుగా నియమించుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేయడం, కేంద్ర ప్రభుత్వాలు గత కొద్ది దశాబ్దాలుగా చేస్తున్న తప్పిదమే. ఒక్క గవర్నర్ల రూపంలో ఆయా రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకోవాలని తహతహలాడుతున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సుప్రీంతీర్పు చెంపపెట్టు లాంటిది. బలమైన రాష్ట్రాలే బలమైన కేంద్రానికి పునాది అని మన రాజ్యాంగ నిర్మాతలు బలంగా నమ్మిన విషయం సుప్రీం తీర్పుతో తేటతెల్లం అయింది. ఇప్పటికైనా కేంద్రం కండ్లు తెరుస్తుందని, విపక్ష రాష్ట్రాల్లో పాలనా పరమైన అంశాలలో కబంధ హస్తాలు కాకుండా స్నేహ హస్తాన్ని అందిస్తుందని ఆశిద్దాం.
- చందుపట్ల రమణ కుమార్ రెడ్డి
న్యాయవాది,
94404 49392