పల్లె జీవితం వెండితెరపై పలికించిన సినీ శిల్పి

by Ravi |   (  Updated:2026-06-13 01:15:43  IST  )

గ్రామీణ జీవితాన్ని సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా సినీ ప్రయాణం, ఆయన చిత్రాల ప్రత్యేకత, దక్షిణ భారత చిత్రసీమకు అందించిన కొత్త దృశ్యభాష, సామాజిక చైతన్యం, చిరస్థాయి వారసత్వం గురించి తెలుసుకోండి.

పల్లె జీవితం వెండితెరపై పలికించిన సినీ శిల్పి
X

భారతీరాజా దక్షిణ భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవితాన్ని వాస్తవికంగా, కొత్త దృశ్యభాషగా, సరికొత్త దృశ్య సౌందర్యాన్ని అందించిన దర్శకుడు. తమిళ సినీ ప్రపంచంలో ఆయన ఫిలిం మేకింగ్‌లో చేసిన అనేక అందమైన చేర్పులు మార్పులు దక్షిణ భారత చిత్రసీమ మొత్తానికీ కొత్త దిశను చూపించా యి. అప్పటిదాకా స్టూడియో గోడల మధ్య బంధించబడి రూపొందిస్తూ వచ్చిన సినిమా కథలను పొలాల మధ్యకు, పల్లెల గుండెల్లోకి తీసుకెళ్లిన దర్శకుడు. అందుకే ఆయనను మట్టి వాసనగల దర్శకుడు (మణ్వాసనై దర్శకుడు) అని అభిమానులు ప్రేమగా పిలుస్తారు.

భారతీయ సినీ చరిత్రలో భారతీరాజా కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే రచయితగా విజయవంతమయ్యారు. ఆయన ఆవిష్కరించిన దృశ్యాలూ, కథ చెప్పిన విధానం ఒక సరికొత్త ఉద్యమంలా నిలిచింది. నటుడిగా కూడా మెప్పించాడాయన. పల్లె జీవితాల్ని వెండితెరపై చిత్రించి సినిమాను ప్రజలకు మట్టి అందాలతో ముడిపెట్టిన సృజనశీలి. దర్శకుడిగా ఆయన చిత్రాలు కాలాన్ని దాటి నిలబడ్డాయి. నగరీకరణ అత్యంత వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా భారతీరాజా సినిమాల్ని చూస్తే మనల్ని మట్టివైపు, మూలాలవైపు, మనుషులవైపు తీసుకెళ్తాయి. అదే ఆయన గొప్పతనం.

నాలుగు అంశాల సమ్మేళనంతో సినిమాలు..

భారతీరాజా పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘సీతాకోకచిలుక’’ ‘ఆరాధన’, ‘యవ్వనం పిలిచింది’, ‘ఎర్ర గులాబీలు’ వంటి చిత్రాలే. గ్రామీణ నేపథ్యం, సహజ ప్రేమ, ప్రకృతి సౌందర్యం, వాటికి తోడు ఇళయరాజా సంగీతం ఈ నాలుగు అంశాల సమ్మేళనంతో భారతీరాజా సినిమాలు తెలుగువారికి కూడా అత్యంత ఆత్మీయంగా మారిపోయాయి. ఆయన చిత్రాలు ఒక తరం యువత ప్రేమను, గ్రామీణ జీవనానుభూతిని కొత్తగా చూడడాన్ని నేర్పించాయి. 1941 జూలై 17న తమిళనాడులోని అల్లినగరం గ్రామంలో పుట్టిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి. చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. సాధారణ గ్రామీణ కుటుంబంలో పెరిగిన రాజా రైతుల జీవితం, గ్రామీణ సంబంధాలు, కుల వ్యవస్థ, ప్రేమ, ప్రకృతి వంటి అంశా లను చిన్నప్పటి నుంచి దగ్గరగా గమనించినవాడు కావడంతో ఆ అను భవమే తరువాతి కాలంలో ఆయన సినిమాలకు ఊపిరిగా మారింది. సినీ రంగంలోకి రావడానికి ముందు భారతి రాజా అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. దర్శకుడిగా అవకా శం కోసం మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు 1977 లో వచ్చిన ‘16 వైతినిలే’ ఆయన జీవితాన్నే మార్చేసింది.

నిజమైన లొకేషన్లకు కెమెరాలను తీసుకెళ్లి..

ఆ సినిమా తమిళ సినిమాకు కొత్త మలుపు ‘16 వయ తినిలే’ విడుదలకు ముందు తమిళ సినిమాలు ప్రధానంగా స్టూడియోల్లో, కృత్రిమ సెట్లల్లో చిత్రీకరించబడేవి. కానీ భారతీ రాజా కెమెరాను గ్రామాలకు తీసుకెళ్లారు. నిజమైన పొలాలు, చెరువులు, పల్లె దారులు, గుడిసెలు ఆయన సినిమాల్లో కనిపించాయి. ఆ సినిమా విజయంతో తమిళ చిత్ర సీమలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. ఆ సినిమా తెలుగులో 'పదహారేళ్ల వయసు' పేరుతో రీమేక్ చేయబడింది. ఆ తర్వాత 1978లో వచ్చిన ‘కిళక్కే పోగమ్ రైల్’, ‘సిగప్పు రోజక్కళ్’ ఆ సినిమా తెలుగులో "ఎర్ర గులాబీలు" పేరుతో డబ్ చేయబడి విజయం సాధించింది. ఆ తర్వాత భారతీరాజా 1981లో రూపొందించిన సినిమా ‘సీతాకోకచిలుక’. అది ఆయన దర్శకత్వం వహించిన విజయవంతమైన చిత్రం. ‘టిక్ టిక్ టిక్’ ఒక విభిన్నమైన థ్రిల్లర్ చిత్రం. కిళక్కే పోగుం రైల్, అలైగళ్ ఒయ్వతిల్లై, ముదల్ మరియాదై, కరుత్తమ్మా వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచాయి.

దృశ్యాలు కూడా కథలో భాగమైపోయి..

భారతిరాజా తన సినిమాల్లో గ్రామాన్ని కేవలం నేపథ్యంగా కాకుండా, ఒక సజీవ పాత్రగా చూపించాడు. పల్లె జీవితం, రైతుల కష్టాలు, సంప్రదాయాలు, మానవ సంబంధాలు సహజత్వంతో కనిపిస్తాయి. ఇక పచ్చని పొలాలు, వర్షాలు, చెరువులు, కొండలు ఆయన సినిమాల్లో కేవలం దృశ్యాలుగా కాకుండా కథలో భాగమైపోతాయి. ప్రకృతిని అంత అందంగా వెండితెరపై చూపించిన దర్శకులు దక్షిణ భారతీయ సినిమా రంగంలో చాలా అరుదు. ఇక యువ ప్రేమను, గ్రామీణ నేపథ్యంలోని భావోద్వేగాలను ఆయన ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు. ఆయన ప్రేమ కథల్లో కలలు ఉంటాయి. అదే సమయంలో సామాజిక వాస్తవికత కూడా కనిపిస్తుంది. ఇక సామాజిక సమస్యలైన కుల వివక్ష, పేదరికం, స్త్రీల స్థితిగతులు వంటి అంశాలు కూడా ఆయన సినిమాల్లో ప్రధానంగా కనిపిస్తాయి.

ఎంతోమందిని సినీ ప్రపంచానికి పరిచయం చేసి..

ఈయన అనేక మంది నటీనటులను, సాంకేతిక నిపు ణులను సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన అనేక కళాకారులు తరువాత భారతీయ సినీరంగంలో అగ్రస్థానాలకు చేరు కున్నారు. ఈయన అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందుకున్నారు. పద్మశ్రీతో పాటు జాతీయ చలనచిత్ర పురస్కారాలు కూడా ఆయనను వరించాయి. భారతీయ చిత్రసీమకు చేసిన విశిష్ట సేవలకు ఆయనకు అనేక జీవిత సాఫల్య పురస్కారాలు లభించాయి. ఈయన సినిమాలు గ్రామీణ భారతదేశానికి సంబంధించిన సామాజిక పత్రాలు. ఆయన సినిమాలను చూస్తే తమిళనాడు గ్రామాల జీవన గీతం వినిపిస్తుంది. మట్టివాసన, మనుషుల భావోద్వేగాలు, ప్రకృతి సౌందర్యం, సామాజిక చైతన్యం ఇవన్నీ కలిసినప్పుడు భారతీ రాజా సినిమా రూపుదిద్దుకుంటుంది.

-వారాల ఆనంద్

94405 01281

Next Story