పాత ఆధిపత్యాలకు బ్రేక్.. మార్పుకే మద్దతు!

by Ravi |   (  Updated:2026-05-05 00:50:50  IST  )

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే సూచనలుగా మారాయి.

పాత ఆధిపత్యాలకు బ్రేక్.. మార్పుకే మద్దతు!
X

ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సంచలన పరిణామాలకు దారి తీస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో మమత కంచుకోటను బీజేపీ బద్దలు గొట్టింది. తమిళనాడులో 50 సంవత్సరాల ద్రవిడ రాజకీయ ఆధిపత్యాన్ని సినీ హీరో విజయ్ తోసి రాజనడం కొత్త చరిత్రకు సంకేతం. ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి కనివిని ఎరుగని పరిణామం.

కేరళలో లెఫ్ట్ డెమాక్రాటిక్ ఫ్రంట్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చిత్తుగా ఓడించింది. అస్సాంలో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. పుదుచ్చేరిలోనూ బీజేపీ మద్దతిస్తున్న ఎన్నార్ కాంగ్రెస్ మరోసారి అధికారం కైవసం చేసుకుంటోంది. ఈ ఫలితాలు భారత రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సంకేతిస్తున్నాయి.

కుప్పగూలిన మమత ఆధిపత్యం..

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గత దశాబ్దానికి పైగా ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2011లో “పరివర్తన్” నినాదంతో అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ప్రారంభంలో ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పినా, కాలక్రమేణా పాలనపై అసంతృప్తి పెరుగుతున్నట్లు సంకేతాలు కనిపించాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ అసంతృప్తికి ప్రధాన కారణంగా మారింది. పరిశ్రమల వలస, పెట్టుబడుల తగ్గుదల, అభివృద్ధి మందగింపు వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. విద్యావంతులైన యువతకు ఉపాధి అవకాశాల లోపం నిరుద్యోగాన్ని పెంచి, యువ ఓటర్లలో అసహనాన్ని పెంచింది. అదనంగా, అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో ఉద్రిక్తతలు రాజకీయ వాతావరణాన్ని మరింత సంక్లిష్టం చేశాయి..

బలమైన ప్రత్యామ్నాయం..

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వచ్చింది. ముఖ్యంగా సువేందు అధికారి వంటి నాయకులు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందూ ఓట్ల ఏకీకరణ, కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓట్ల విభజన, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. అన్నీ కలిసి బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇక పౌరసత్వ సవరణ చట్టం (CAA) వంటి అంశాలు కూడా ఎన్నికల చర్చల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వలసదారుల ఓటు బ్యాంక్‌పై దీని ప్రభావం ఉందని విశ్లేష కులు భావిస్తున్నారు. అలాగే, నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతూ బీజేపీకి మద్దతు పెంచుతు‌న్నాయి. SIR (Special Intensive Revision) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా శుద్ధి చేయడం, కొత్త ఓటర్ల నమోదు పెరగడం వంటి మార్పులు ఎన్నికల గణితాన్ని ప్రభావితం చేశాయి. అధిక పోలింగ్ శాతం ప్రత్యేకంగా మహిళలు, యువత, తొలిసారి ఓటర్ల పాల్గొనడం.. మార్పు కోరికకు సంకేతంగా భావిస్తున్నారు.

తమిళనాడు - సంప్రదాయ రాజకీయాలు దాటి..

తమిళనాడు రాష్ట్రం దశాబ్దాలుగా ద్రవిడ మున్నేట్ర కజగం, అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం మధ్య రాజకీయ పోటీకి కేంద్రంగా నిలిచింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అధికారంలో కొనసాగుతోంది. అయితే ఈసారి రాజకీయ సమీకరణంలో కొత్త మార్పు చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం రాజకీయ రంగప్రవేశం చేయడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. బీజేపీ మద్దతుతో ఏఐఏడీఎంకే, అధికార డీఎంకే, కొత్తగా ఎదుగు తున్న టీవీకే.. ఈ మూడు శక్తుల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. విజయ్ ప్రవేశం యువతలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఆయనపై ఉన్న సినీ ప్రభావం, సామాజిక సందేశాలు, కొత్త రాజకీయ దృక్పథం ఇవి అన్ని కలిసి సంప్రదాయ రాజకీయాలను సవాలు చేస్తున్నాయి. టీవీకే మంచి ఫలితాలు సాధించడం కొత్త పరిణామం. తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కొత్త శకానికి నాంది కావచ్చు.

కేరళంలో మారుతున్న సమీకరణాలు..

కేరళంలో సాధారణంగా ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుం‌దనే సంప్రదాయం ఉంది. అయితే గత ఎన్నికల్లో పినరయి విజయన్ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని భంగం చేసింది. కానీ ప్రస్తుతం ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి మరోసారి మార్పు వైపు దారితీంది. యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్ ఈసారి బలంగా ఎదిగి క్లీన్ స్వీప్ దిశగా వెళుతోంది. స్థానిక సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలు లెఫ్ట్ కూటమి ప్రభుత్వ వ్యతిరేక భావనను పెంచాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఇది అనుకూల పరిస్థితిగా మారింది. ఫలితాల సరళి అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. యూడీఎఫ్ విజయం సాధించడంతో, కేరళలో వామపక్షాల ఆధిపత్యానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే అవుతుంది.

భారత రాజకీయాల్లో కొత్త దశ!

ఈ మూడు రాష్ట్రాల పరిణామాలను సమగ్రంగా పరిశీ లిస్తే, భారత రాజకీయాల్లో ఒక కీలక మార్పు దశ ప్రారంభమవుతోంది. దీర్ఘకాలంగా కొనసాగిన ప్రాంతీయ ఆధిపత్యాలు ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం, అభివృద్ధి మీద ఆశలు, పరి పాలనపై అంచనాలు.. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదల, తమిళ‌నాడులో కొత్త రాజకీయ శక్తి ప్రవేశం, కేరళంలో ప్రభుత్వ వ్యతిరేకత ఈ మూడు ధోరణులు కలిసి దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే, ఈ మార్పులు తాత్కాలికమా లేక దీర్ఘకాలికమా..?

ఇది ప్రాంతీయ మార్పు కాదు..

ఒక విషయం మాత్రం స్పష్టం. భారత ఓటరు ఇప్పుడు మరింత చైతన్యంతో, స్పష్టమైన అంచనాలతో, మార్పు కోరుకునే దిశగా ముందుకు సాగుతున్నాడని.. మొత్తంగా చూస్తే, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కేవలం ప్రాంతీయ మార్పులు కాకుండా, దేశవ్యాప్తంగా రాజకీయ దిశను ప్రభావితం చేసే సూచనలుగా నిలుస్తున్నాయి. ప్రజల అభిప్రాయంలో వచ్చిన మార్పు, కొత్త నాయకత్వానికి అవకాశాలు, పెరుగుతున్న రాజకీయ పోటీ వంటివి.. భారత రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి.

- వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story