- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 ఫ్రేమ్స్.. 'సినిమా హబ్’కు పునాది అంతర్జాతీయ చిత్రోత్సవం
సినిమా కేవలం వినోద సాధనం మాత్రమే కాదు. అది ఒక కళ, ఒక పరిశ్రమ, ఒక సంస్కృతి, ఒక సమాజపు ఆత్మాభివ్యక్తి కూడా.

సినిమా కేవలం వినోద సాధనం మాత్రమే కాదు. అది ఒక కళ, ఒక పరిశ్రమ, ఒక సంస్కృతి, ఒక సమాజపు ఆత్మాభివ్యక్తి కూడా. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన ఉత్తమ చిత్రాలను ఒకే వేదికపై ప్రదర్శించే గొప్ప సాంస్కృతిక వేడుక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం. ఇది కేవలం సినిమాలు చూపించే కార్యక్రమం మాత్రమె కాదు. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న సామాజిక అనుభవాలను సినిమా మాధ్యమం ద్వారా పరిచయం చేసే ప్రపంచ వేదిక.
ఆ ఉత్సవంలో కథా చిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ప్రయోగాత్మక చిత్రాలు ప్రదర్శించబడతాయి. దర్శకులు, రచయితలు, నటులు, విమర్శకులు, ప్రేక్షకులు అందరూ ఒకే స్థలంలో కలుసుకునే వేదిక ఇది. సాంకేతికత, కళాత్మకత, మంచి పరిశ్రమ, గొప్ప ప్రేక్షకుడు ఈ అంశాలు ‘సినిమా హబ్’లకు మూలాలు, వీటిని ఒకే వేదికపై కలిపే శక్తి ఈ ఉత్సవాలకు ఉంది. అందుకే, ప్రపంచ సినిమా పటంలో నిలిచిన ప్రతి ప్రధాన సినిమా హబ్ వెనుక ఒక బలమైన చలనచిత్రోత్సవం తప్పనిసరిగా ఉంటుంది.
చలనచిత్రోత్సవాలు కేవలం వేడుకలు కావు
అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ముఖ్యంగా ప్రపంచ సినిమాను ప్రోత్సహించడం, ప్రాంతీయ హద్దులు దాటి, మంచి సినిమా ప్రపంచవ్యాప్తంగా చేరేలా చేయడం ప్రధాన లక్ష్యాలుగా నిలబడుతుంది. ఇందులో ప్రసిద్ధ కమర్షియల్ సినిమాలే కాకుండా, కొత్తగా ఆలోచించే యువ దర్శకులకు గుర్తింపును ఇచ్చి కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలకు వేదికగా పనిచేస్తుంది. ఇలాంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల నిర్వహణ వల్లనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సినిమా నగరాలు కాన్స్, బెర్లిన్, వెనిస్, టొరంటో, బుసాన్ వాటి నగరాలు గుర్తింపును పొందాయి. ప్రధానంగా అక్కడ జరిగే ఈ చలన చిత్రోత్సవాలవల్లనే ఆయా నగరాలు సినిమా హబ్‌లుగా రూపుదిద్దు కున్నాయి. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు కేవలం వేడుకలు కావు.
ఓ చిన్న పట్టణం ప్రపంచ సినిమా రాజధాని
సాంకేతికత, కళాత్మకత, మంచి పరిశ్రమ, గొప్ప ప్రేక్షకుడు ఈ అంశాలు ‘సినిమా హబ్’లకు మూలాలు, వీటిని ఒకే వేదికపై కలిపే శక్తి ఈ ఉత్సవాలకు ఉంది. అందుకే, ప్రపంచ సినిమా పటంలో నిలిచిన ప్రతి ప్రధాన సినిమా హబ్ వెనుక ఒక బలమైన చలనచిత్రోత్సవం తప్పనిసరిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వల్ల ఫ్రాన్స్ లోని ఆ చిన్నపట్టణం ప్రపంచ సినిమా రాజధానిగా మారింది. ఒక అంతర్జాతీయ చిత్రోత్సవం ఆ నగరాన్ని కేవలం నగరంగా కాకుండా, సినిమా సంస్కృతికి ప్రతీకగా మార్చింది. వాస్తవానికి సినిమా హబ్‌లు సంబంధాల మీదే నిలబడతాయి. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు దర్శకులు, రచయితలు, నిర్మాతలు, పెట్టుబడిదారులు కలిసే వేదికలు. అవే కాన్స్ మార్కెట్, బెర్లిన్ యూరోపియన్ ఫిల్మ్ మార్కెట్ వంటి వాణిజ్య వేదికలు సినిమాను ఒక స్థిర పరిశ్రమగా మారడంలో కీలకంగా వున్నాయి. ఈ పరిచయాలు, సహకారాలు కాలక్రమంలో శాశ్వత సినిమా వ్యవస్థలకు దారి తీస్తాయి.
చిత్రోత్సవాలతోటే ప్రపంచ స్థాయి గుర్తింపు
అనేక దశాబ్దాలుగా ప్రాంతీయ, స్వతంత్ర, ప్రయోగాత్మక సినిమాలకు అంతర్జాతీయ ఉత్సవాలే ప్రధాన వేదికలుగా నిలబడ్డాయి. అనేక ప్రపంచ స్థాయి దర్శకులు మొదటిసారి గుర్తింపు పొందింది ఇలాంటి ఉత్సవాల ద్వారానే. ఒక ఉత్సవం స్థానిక కథలను, స్థానిక ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తే ఆ ప్రాంతం స్వయం పోషక సినిమా హబ్‌గా ఎదుగుతుంది. చలనచిత్రోత్సవాలు పర్యాటక రంగాన్ని, హోటళ్లు, రవాణా, స్థానిక ఉపాధిని పెంపొందిస్తాయి. దీని ఫలితంగా స్టూడియోలు, పోస్ట్-ప్రొడక్షన్ యూనిట్లు, ఫిల్మ్ స్కూల్స్, ఆర్కైవ్స్ వంటి మౌలిక వసతులపై పెట్టుబడులు పెరుగుతాయి. ఉత్సవం ఒక వారపు ఈవెంట్ అయినా, దాని ప్రభావం సంవత్సరాలపాటు ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే ఈ ఉత్సవాలు ప్రభుత్వాలను సినిమా రంగంపై దృష్టి పెట్టేలా చేస్తాయి. ఫిల్మ్ కమిషన్లు, పన్ను రాయితీలు, గ్రాంట్లు, సబ్సిడీలు వంటి విధానాలు ఇలాంటి ఉత్సవాల ప్రభావంతోనే అమలులోకి వస్థాయి. వాస్తవంగా ఇవి సినిమా హబ్‌ల స్థిరత్వానికి అవసరమైన పునాదులు. సినిమా హబ్‌లకు అవగాహన కలిగిన ప్రేక్షకులు అవసరం. చలనచిత్రోత్సవాలు ప్రపంచ సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేస్తాయి. చర్చలు, మాస్టర్‌క్లాసులు, రిట్రోస్పెక్టివ్‌లు ద్వారా సినిమా చైతన్యం పెరుగుతుంది. ఇది వాణిజ్యానికి అతీతమైన సినిమాలకు కూడా స్థానం కల్పిస్తుంది.
హైదరాబాద్ ఫిల్మోత్మవ్.. ఎన్టీఆర్ చొరవే..
ఈ విషయంలో హైదరాబాద్ లో 1986 లో అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు తీసుకున్న చొరవ గొప్పది. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ‘ఫిల్మోత్సవ్’ పేర హైదరబాద్ నగరానికి వచ్చింది. దానికి స్పందించి ముఖ్యమంత్రి రామా రావు కేవలం 90 రోజుల్లో ‘లలిత కళాతోరణం’ నిర్మింపచేసి హైదరబాద్ లో మొట్టమొదటి ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. అది జరిగిన అన్నిరోజులూ ప్రతినిధులకు ఉచిత భోజనాలూ ఏర్పాటు చేసి ఉత్సవాన్ని విలక్షణంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత హైదరాబాద్ లో 1999లో మరోసారి కేంద్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని నిర్వహించారు. తర్వాతి కాలంలో కేంద్రం గోవాను శాశ్వత కేంద్రంగా మార్చి అక్కడే స్థిర పరిచింది. హైదరాబాద్ విషయానికి వస్తే చలన చిత్రోత్సవాల నిర్వహణ మరుగున పడిపోయింది. చివరికి శాశ్వత కేంద్రంగా నిర్వహిస్తూ వచ్చిన అంతర్జాతీయ బాలల చాల చిత్రోత్సవాలకూ మంగళం పాడేసారు.
అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్
ఇప్పుడు చాలా ఏండ్ల తర్వాత ప్రముఖ దర్శకుడు సి.ఉమామహేశ్వర్ రావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహణకు చొరవ చూపింది. ముఖ్యంగా టూరిజం, చలన చిత్ర అభివృద్ధి సంస్థల సహకారంతో డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టారు. ఇది ఎంతగానో ఆహ్వానించదగ్గ పరిణామం. పేరుకు ఇది షార్ట్ ఫిలిం ఫెస్టివలే అయినా హైదరాబాద్ అంతర్జాతీయ సినిమాల వేదికగా మారేందుకు తొలి మెట్టుగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న సినిమా హబ్ ఏర్పాటుకు కేవలం స్టుడియోల ఏర్పాటే కాకుండా పూర్తి స్థాయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణపై దృష్టి సారించాల్సి వుంది. అప్పుడే సినిమా హబ్ ఆలోచన వాస్తవ రూపం దాలుస్తుంది.
(డిసెంబర్ 19 నుండి హైదరాబాద్‌లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్)
వారాల ఆనంద్
94405 01281






