24 ఫ్రేమ్స్: బాలలు ఓటర్లు కాదనేనా? వారిపై వివక్ష

by Disha edit |
24 ఫ్రేమ్స్: బాలలు ఓటర్లు కాదనేనా? వారిపై వివక్ష
X

పిల్లల మనో వికాసానికి, సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి. దృశ్య మాధ్యమాలు వారిమీద అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమాలు నిర్మించాలి. ఇందుకు ఇరాన్‌లాంటి దేశాలను ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలను నగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెలకు కూడా చేరాలి. జిల్లా స్థాయిలో నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేయాలి. యేటా క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాలను ప్రదర్శించాలి. అప్పుడే బాలలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.

వంబర్ నెల వచ్చిందంటే చాలు మనకు నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం గుర్తొస్తాయి. అప్పుడు అందరమూ పిల్లల గురించి మాట్లాడతాం. అటు ప్రభుత్వమూ ఇటు సంస్థలూ సభలు పెడతాయి. జెండాలు కడతాయి. పిల్లలకు మిఠాయీలు పంచుతాయి. అంతా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం. భావి భారత పౌరులు అంటాం. భవిష్యత్తు నిర్మాతలు అంటాం. మర్నాటికి మరిచిపోతాం. నిజానికి మనకు పిల్లలంటే మనకు అస్సలు పట్టింపు లేదు, ప్రేమ అసలే లేదు. ఇలా అంటే కొంచెం కష్టం అనిపించొచ్చు. కానీ, అది నిజం. మనం నవంబర్ రోజులలో మాత్రమే పిల్లల గురించి మాట్లాడతాం. కానీ, వారి కోసం ఆలోచించం. ఏమీ చేయం. ప్రభుత్వాలూ, పార్టీలూ ఏమీ చేయవు. ఎందుకంటే బాలలు ఓటర్లు కాదు. వాళ్లకు ఓటు హక్కు లేదు.

బాలల కోసం ప్రత్యేకంగా ఏమీ రాయం. కథలు, కవితలు రాయడానికి వారిని ప్రోత్సహించం. పిల్లలను మార్కుల వెంట పరుగెత్తిస్తాం. మెరిట్ అంటూ హింస పెడతాం. ఇప్పుడు ఇంకా ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ తరగతులు అంటూ కనీస సంబంధాల నుంచీ దూరం చేస్తున్నాం. భారతీయ భాషలన్నింటినీ చూస్తే బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీలో తప్ప మిగతా భాషలలో బాలసాహిత్యం తక్కువే. కొన్ని భాషలలో అస్సలు లేదు. పిల్లల కోసం రాసేవారు తక్కువ. రాసిన వారికి గుర్తింపు తక్కువ. పిల్లల పుస్తకాలకు మార్కెట్ తక్కువ. పిల్లలను చేరే సాహిత్యం తక్కువ. పిల్లల కోసం సృజనాత్మక కార్యక్రమాలు మరీ తక్కువ. పాలకులు, అధికారులు, తల్లిదండ్రులలో కూడా (ఏ కొంత మందో తప్ప) పిల్లల గురించి మాట్లాడేవారు ఎక్కువే. కానీ, వారి కోసం ప్రత్యేకించి చేసేది తక్కువే.

సినిమాల ఊసే లేదు

ఇక మన దేశంలో బాల సాహిత్యం కంటే 'బాలల సినిమాల' పరిస్థితి మరీ దారుణం. దాదాపు అన్ని భాషల నిర్మాతలలోనూ పిల్లల సినిమాలు తీస్తే 'మార్కెట్ లేదు, ఏమొస్తుంది?' అనే భావనే. బెంగాలీ మలయాళం లాంటి కొన్ని భాషలలో మాత్రం వేళ్ల మీద లెక్కించదగిన కొన్ని మంచి సినిమాలు తీశారు. ముంబైలోని బాలల చిత్ర సమితి ( CHILDREN FILM SOCIETY OF INDIA) నిర్మించిన వందలాది పిల్లల సినిమాలు ప్రదర్శనకు నోచుకోకుండా పడి ఉన్నాయి. ఫిలిం సొసైటీ ఉద్యమం బలంగా ఉన్న కాలంలో కరీంనగర్‌లో రెండేసి వారాల పాటు పిల్లలంతా స్కూళ్ల నుంచి ఉదయమే 'ప్రభాత్ భేరీ' లాగా వరుసగా సినిమా హాళ్లకు వచ్చేవారు.

బాలల చలన చిత్రోత్సవాలు జరిగినన్ని రోజులూ ఊరు ఊరంతా కోలాహలంగా ఉండేది. 1980ల నుంచి రెండున్నర దశాబ్దాల పాటు కరీంనగర్‌, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల లాంటి అనేక పట్టణాలలో పిల్లల సినిమాల పండుగ జరిగేది. 1987లో గ్రామీణ బాలల కోసం చొప్పదండి, తాటిపల్లి, కొండాపూర్, మల్లాపూర్, పెంబట్ల తదితర గ్రామాలలో గ్రామీణ బాలల చిత్రోత్సవాల పేరిట పిల్లల సినిమాలు ప్రదర్శించారు. ఫిలిం సొసైటీ ఉద్యమం సన్నగిల్లిన తర్వాత ఇప్పుడు 'ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు' అని బాధ పడాల్సిన స్థితి నెలకొంది.

Also read: 24 ఫ్రేమ్స్: అన్ని రంగాలు గుజరాత్ వైపేనా? ఎందుకు

చాచా చొరవ మేరకు

స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనల మేరకు, ఎస్‌కే పాటిల్ కమిటీ సూచనల ప్రకారం 1955లో 'చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా' ఏర్పాటైంది. సొసైటీ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ముఖ్యంగా కేదార్‌శర్మ, భీమసేన్, జయాబచ్చన్, సాయి పరంజపే, గుల్జార్ తదితరులు దానితో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. పోత్లీ బాబా, జంగల్ బుక్, ముఝ్‌సే దోస్తీ కరోగే, లావణ్య ప్రీతీ ఇట్లా ఎన్నో ఎన్నో సినిమాలు వచ్చాయి.

బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, రెండేండ్లకోసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. దేశంలోని వివిధ నగరాలలో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నది. 1995లో మొదటిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించారు. 1999లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు శాశ్వత వేదికగా హైదరాబాద్‌ని ప్రతిపాదించారు.

Also read: 24 ఫ్రేమ్స్: అర్థవంత సినిమా కావాలంటే అది తప్పదా?

అమలు కాని హామీలు

బాలల చిత్రాలకు ఇతోధిక సహకారం అందిస్తామని, ప్రోత్సాహకాలు ఇస్తామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించగలిగితే నగదు బహుమతులు ఇస్తామని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. సొసైటీకి భూమి ఇస్తామని, శాశ్వత కార్యాలయం, థియేటర్లు నిర్మించుకోవాలని సూచించాయి. అవేవీ సాకారం కాలేదు. తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదేమీ జరగలేదు. పిల్లల మనో వికాసానికి, సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి.

దృశ్య మాధ్యమాలు వారిమీద అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమాలు నిర్మించాలి. ఇందుకు ఇరాన్‌లాంటి దేశాలను ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలను నగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెలకు కూడా చేరాలి. జిల్లా స్థాయిలో నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేయాలి. యేటా క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాలను ప్రదర్శించాలి. అప్పుడే బాలలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.


వారాల ఆనంద్

94405 01281

Next Story

Most Viewed