24 ఫ్రేమ్స్: అన్ని రంగాలు గుజరాత్ వైపేనా? ఎందుకు

by Disha edit |
24 ఫ్రేమ్స్: అన్ని రంగాలు గుజరాత్ వైపేనా? ఎందుకు
X

ఈ సినిమా మన దేశంలో ప్రైవేట్ ప్రదర్శనలు మాత్రమే జరిగాయి. టాకీసులలో ఇంకా విడుదల కావాల్సి వుంది. ఇదిట్లా వుంటే 'చెల్లో షో' పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంది. బయటి దేశాలలో అర్థవంతమయిన సినిమా అనే పేరు తెచ్చుకుంది ఇదిట్లా వుంటే 'చెల్లో షో' ఎంపిక ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా కమర్షియల్ ఫిలిం సర్కిల్స్‌లో పెద్ద చర్చ వెల్లువెత్తింది 'ఆర్ఆర్ఆర్''కాశ్మీర్ ఫైల్స్'లాంటి సినిమాలుండగా 'చెల్లో షో' ఎంపిక కావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వెలువడ్డాయి.

టీవలి కాలం వరకు 'గుజరాత్' అనగానే మహాత్మా గాంధీ స్ఫురణ లోకి వచ్చేవారు. కానీ, ఇప్పుడు గుజరాత్ అంటే ప్రధాని మోడీ గుర్తుకొస్తారు. అంతే కాదు, అంబానీ, అదానీ కూడా మతిలోకి వస్తారు. ప్రధాని స్థాయికి వచ్చిన ఒక నేత తన ప్రాంతం పైన మక్కువ చూపడాన్ని అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చేస్తే అభినందించవచ్చు. కానీ, అన్ని దారులనూ ఒకే వైపునకు నడపడం అంత సమంజసం కాదు. అభిలషనీయమూ కాదు. ఇవ్వాళ దేశంలో అన్ని అభివృద్ధి కళా సాంస్కృతిక క్రీడా రంగాలూ గుజరాత్ వైపునకే దారి తీయడం యాదృచ్ఛికం అంటే ఎందుకో నమ్మాలనిపించదు. కానీ, అదే జరుగుతున్నది. ముఖ్యంగా ఇవ్వాళ సినిమా రంగానికి సంబంధించిన అంశాలను చూస్తే రెండు విషయాలు చర్చగా నిలుస్తున్నాయి. వాటిలో ఒకటి ఇటీవలే ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం. గుజరాత్ కు చెందిన సీనియర్ హీరోయిన్ ఆశా పరేఖ్ కు ఈ అవార్డును ప్రకటించారు.

ఆమె గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ కాలంలో ఫిలిం సెన్సార్ బోర్డ్ చైర్ పర్సన్‌గా పనిచేసారు. ఇక మరో సినిమా విషయం ఏమిటంటే ఇటీవలే ఎఫ్ఎఫ్ఐ ఆస్కార్ పోటీలకు 'చెల్లో షో' సినిమాను ఎంపిక చేసారు. అదీ గుజరాతీ సినిమా సినిమానే. ఆ సినిమా ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'సినిమా పారడిజో' అన్న సినిమాకు కాపీ అనో, అనుసరణ అనో అన్న వాదన దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చెలరేగింది. సినీ విమర్శకులు కూడా అనేక మంది స్పందించారు.

'హిట్ గర్ల్'కి పురస్కారం

ఇక్కడొక మాట అంగీకరించాలి. ప్రతి అవార్డు విషయంలో ఏదో ఒక చర్చ లేవడం సహజమే కానీ, ఆశాపరేఖ్ కానీ, 'చెల్లో షో' కానీ అర్హులా కాదా అన్నదాని కంటే గుజరాత్ వాదనే అధికంగా చర్చకు వచ్చింది. సరే ఈ వివాదం సంగతి అట్లావుంచి వారి గురించి నాలుగు మాటలు చెబుతాను. 'అఛ్చా తో హం చల్‌తే హై, ఫిర్ కబ్ మిలోగే, జబ్ తుమ్ కహోగే, జుమ్మే రాత్‌కో'లాంటి అనేక హిట్ పాటలలో అభినయించి, అనాటి యువత మనసులను దోచుకున్న నటి ఆశా పరేఖ్. 1960 –70 దశకాలలో అనేక విజయవంతమైన హిందీ సినిమాలలో కథానాయికగా నటించిన 'హిట్ గర్ల్'కు కేంద్ర ప్రభుత్వం ఈ యేటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.

'హిట్ గర్ల్' అన్నది ఆమెకు ఉన్న పేరే కాదు. ఆమె తన జీవిత చరిత్రను ఆ పేరు మీదనే రాసారు . ఆశా పరేఖ్ ఆ రోజులలో యువకుల కలల రాణి. 'ఏ జో మోహోబ్బత్ హై, ఏ ఉన్కా హై కామ్. మహెబూబ్ కా జో లేతే హువే నామ్'అంటూ 'కటీ పతంగ్' లాంటి సినిమాలలో రాజేష్ ఖన్నా అభినయిస్తూ వుంటే ఆశా పరేఖ్ మౌన గంభీర నటన ఎంతో ఆకట్టుకుంటుంది. హిందీ సినిమా రంగంలో నేటికీ అత్యంత పేరు ప్రఖ్యాతులున్న నటిగా ఆమెకు గౌరవాభిమానాలున్నాయి.

అనేక పాత్రలు

ఆషా పరేఖ్ తొలుత బాల నటిగా గొప్ప దర్శకుడు బిమల్ రాయ్ 1952 లో తీసిన 'మా' తో సినిమా రంగ ప్రవేశం చేసారు. తర్వాత ఆమె 'బాప్ బేటీ'ల్ కూడా నటించారు. 1959 లో నాసిర్ హుసైన్ దర్శ కత్వం వహించిన 'దిల్ దేఖే దేఖో' తో కథానాయికగా ఆమె తన కెరీర్ ఆరంభించింది.అందులో ఆనాటి బిగ్ స్టార్ శమ్మీకపూర్ హీరో. తర్వాత ఆ ఇద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై', ' ఫిర్ వొహీ దిల్ లాయా హూన్' , 'తీస్రీ మంజిల్', 'బహారోన్కే సప్నే', 'ప్యార్ కా మోసం', 'కార్వాన్' లాంటివి అప్పుడు విశేష ప్రజాదరణ పొందిన సినిమాలు.

ఆ రోజుల్లో ఆమె హిందీ సినిమాల్లో అధిక పారితోషికం తీసుకున్న నటిగా కూడా పేరు తెచ్చుకున్నారు.తర్వాత రాజ్ ఖోస్లా తీసిన 'దో బదన్', 'చిరాగ్',' మై తులసీ తేరే అంగన్ మె' లాంటి సినిమాలు హిట్ గా నిలిచాయి. అయితే అప్పటిదాకా కేవలం గ్లామర్ హీరోయిన్ గా నిలిచిన ఆశా పరేఖ్ శక్తిసామంతా తీసిన 'కటీ పతంగ్' తో సీరియస్ నటి గా, ప్రతిభగల నటి గా నిలబడింది. ఆమె హిందీ సినిమాలతో పాటు గుజరాతీ, పంజాబీ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు.

డాక్టర్ కావాలనుకుని

డాక్టర్ కావాలనుకున్న ఆశా పరేఖ్ ఒక రోజు స్కూలుకు వెళ్తూ వుండగా దారిలో ఒక ప్రమాదాన్ని, రక్త మోడుతున్న వారిని చూసి కలతచెంది డాక్టర్ కావాలనుకున్న కోరికను వదిలేసుకుందట. అయినా తర్వాత బాంబే లో ఒక హాస్పిటల్ కట్టించారు. కథానాయిక పాత్రల తర్వాత ఆమె క్యారెక్టర్ పాత్రలనూ వేసారు.'కాలియా' లాంటి అమితాబ్ సినిమాలలలోనూ నటించారు. అవివాహితగా వుండి పోయిన ఆమె నాసిర్ హుసైన్‌ని ప్రేమించారు. ఈ విషయాన్ని తన జీవిత చరిత్రలో విపులంగా రాసుకున్నారు.

తర్వాత ఫిలిం సెన్సార్ బోర్డు చైర్మన్‌గా శేఖర్ కపూర్ 'ఎలిజబెత్' సినిమాకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించి వివాదాస్పదమయ్యారు. నటిగా ఆశా పరేఖ్ కు 'కటీ పతంగ్' సినిమాకు ఫిలిం ఫేర్ 'ఉత్తమ నటి' అవార్డు లభించింది. తర్వాత లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో పాటు 'పద్మ శ్రీ' అవార్డు కూడా లభించింది.

'చెల్లో షో'

గుజరాత్ కు చెందిన దర్శకుడు పాన్ నలిన్ రూపొందించిన 'చెల్లో షో'(చివరి సినిమా ప్రదర్శన) త్వరలో జరుగనున్న ఆస్కార్ పోటీలకు భారతీయ ఎంట్రీ గా వెళ్లనుంది. ఈ మేరకు ఎఫ్ఎఫ్ఐ ఎంపిక చేసింది. భారతీయ సినిమా రంగం నుంచి ఆస్కార్ కు 1957లో 'మదర్ ఇండియా', 1988లో మీరానాయర్ 'సలాం బాంబే'తర్వాత 2002 లో అశుతోష్ గవరీకర్ 'లగాన్'అధికారిక ఎంట్రీలుగా ఎంపికయ్యాయి. ఇరవై యేళ్ల తర్వాత ఇప్పుడు 'చెల్లో షో' వెళ్తున్నది. అయితే, ఈ సినిమా గురించి పెద్ద చర్చ జరుగుతున్నది. చెల్లో షో' కథ స్టిల్స్ చూసి ఇది ప్రపంచ ఖ్యాతి గాంచిన 'సినిమా పారడిజో' చిత్రానికి కాపీ అయినా కావాలి లేదా కనీసం అనుసరణ అయినా అయి ఉండాలి.

అట్లా అయినప్పుడు ఎఫ్ఎఫ్ఐ దాన్ని ఆస్కార్‌కి ఎంపిక చేయడం సమంజసం కాదన్నది ఆ వాదన. ఆ సినిమా రూపకర్త అయిన పాన్ నలిన్ మాత్రం తమ సినిమా కేవలం తన పాక్షిక జీవితమని అంటున్నారు. తాను తాను నివసించిన కతైవారి ప్రాంత సినిమా అంటున్నారు. తాను ఎక్కడయితే తన బాల్యాన్ని గడిపానో ఎక్కడయితే తనకు సినిమా పట్ల దాని ప్రదర్శన పట్ల ఆసక్తి కలిగిందో అది మాత్రమే ఈ సినిమా అంటున్నాడాయన. తనకు 'సినిమా పారడిజో' ఎంతో నచ్చిన సినిమా అని కూడా అంటున్నాడు పాన్ నలిన్.

ఇతర షోలు ఉన్నా

ఈ సినిమా మన దేశంలో ప్రైవేట్ ప్రదర్శనలు మాత్రమే జరిగాయి. టాకీసులలో ఇంకా విడుదల కావాల్సి వుంది. ఇదిట్లా వుంటే 'చెల్లో షో' పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంది. బయటి దేశాలలో అర్థవంతమయిన సినిమా అనే పేరు తెచ్చుకుంది ఇదిట్లా వుంటే 'చెల్లో షో' ఎంపిక ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా కమర్షియల్ ఫిలిం సర్కిల్స్‌లో పెద్ద చర్చ వెల్లువెత్తింది 'ఆర్ఆర్ఆర్''కాశ్మీర్ ఫైల్స్'లాంటి సినిమాలుండగా 'చెల్లో షో' ఎంపిక కావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వెలువడ్డాయి.

ఆ విమర్శల మాట ఎలా వున్నా మన వ్యాపార రంగ సినిమా వాళ్లకు అంతర్జాతీయంగా జరిగే సినిమా ఉత్సవాలలో కేవలం ఆస్కార్ మాత్రమే ఆనుతుంది. దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కానీ, ప్రతిష్టాత్మకంగా వుండే కేన్స్, బెర్లిన్ లాంటి అనేక ఫెస్టివల్స్ పట్ల వీళ్లకు సోయి తక్కువ. ఎందుకంటే ఆ ఉత్సవాలలో కళాత్మకత, మానవీయత ఆర్ద్రత లాంటివి పరిగణిస్తారు. అవేవీ కనిపించని వ్యాపార రంగ సినిమా ఆస్కార్‌ను మించి ఆలోచించలేదు మరి.


వారాల ఆనంద్

94405 01281



Next Story

Most Viewed