అక్కడ పోటీ చేస్తే రాహుల్ గాంధీ తప్పక గెలుస్తాడు..: ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్తున్న బీజేపీ సీఎం

by Dishanational5 |
అక్కడ పోటీ చేస్తే రాహుల్ గాంధీ తప్పక గెలుస్తాడు..: ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్తున్న బీజేపీ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ వేయడంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యంగ్యంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘రాహుల్ గాంధీ పాకిస్థాన్‌లో చాలా పాపులర్. అక్కడి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాడు. పాక్‌లో అతన్ని ఓడించడం అసాధ్యం. కానీ, పాక్‌లో జరగాల్సినవి భారత్‌లో ఎలా జరుగుతాయి? పాకిస్థాన్ ఏది కోరుకుంటే భారత్‌లో అందుకు విరుద్ధంగా జరుగుతుంది కదా’’ అంటూ సెటైర్లు వేశారు. కాగా, పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీని పొగుడుతూ తాజాగా పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. రాహుల్ ఎన్నికల ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియోను ఫవాద్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘రాహుల్ గాంధీ ఆన్ ఫైర్’’ అని కామెంట్ చేశారు. ఈ పోస్టును ఉటంకిస్తూ ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలంతా రాహుల్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. ‘‘దేశంలో కాంగ్రెస్ బలహీనంగా తయారవుతోంది. ఇక్కడ కాంగ్రెస్ చనిపోతుంటే అక్కడ పాకిస్థాన్ ఏడుస్తోంది. కాంగ్రెస్ కోసం పాకిస్థానీయులు ప్రార్థనలు చేస్తున్నారు. యువరాజును ప్రధాని చేయాలని కోరుకుంటున్నారు’’ అని ప్రధాని మోడీ గురువారం నాటి ఎన్నికల ప్రచారంలో దుయ్యబట్టగా, తాజాగా అసోం సీఎం సైతం ఇదే అంశంపై సెటైర్లు వేశారు.


Next Story

Most Viewed