అహ్మద్ పటేల్‌ను నాలుగోసారి ప్రశ్నించిన ఈడీ

by Shamantha N |

<p>న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసు, రూ.14,500కోట్ల బ్యాంకు స్కామ్‌ల కేసులో నిందితులైన సందేసార సోదరులతో సంబంధమున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం గురువారం అహ్మద్‌ పటేల్‌ను నాలుగోసారి విచారించింది. ఈ కేసుకు సంబంధించి జూన్ నెల ఆరంభంలో ఇప్పటికే మూడుసార్లు అహ్మద్‌ను విచారించింది. చివరిసారిగా ఈనెల 2న సుమారు 10గంటల పాటు ప్రశ్నించింది. ఈ మూడు సెషన్స్‌లో ఈడీ [&hellip;]</p>

అహ్మద్ పటేల్‌ను నాలుగోసారి ప్రశ్నించిన ఈడీ
X

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసు, రూ.14,500కోట్ల బ్యాంకు స్కామ్‌ల కేసులో నిందితులైన సందేసార సోదరులతో సంబంధమున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం గురువారం అహ్మద్‌ పటేల్‌ను నాలుగోసారి విచారించింది. ఈ కేసుకు సంబంధించి జూన్ నెల ఆరంభంలో ఇప్పటికే మూడుసార్లు అహ్మద్‌ను విచారించింది. చివరిసారిగా ఈనెల 2న సుమారు 10గంటల పాటు ప్రశ్నించింది.

ఈ మూడు సెషన్స్‌లో ఈడీ అడిగిన 128ప్రశ్నలకు సమాధానం చెప్పానని అహ్మద్ వెల్లడించారు. తప్పు చేయనివారు భయపడక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు లేదా సంక్షోభం ఎదుర్కొన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. ఇది రాజకీయ వేధింపు చర్యేనని, ఈడీ అధికారులు ఎవరి ఒత్తిళ్లపై పనిచేస్తున్నారో తెలియట్లేదన్నారు. మొత్తం నాలుగు సెషన్లలో 27గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద అహ్మద్‌ పటేల్‌ ప్రకటనను రికార్డు చేశారు.

కాగా, వడోదరకు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్‌ బయోటెక్‌ ప్రమోటర్లు నితిన్‌ సందేసార, చేతన్‌ సందేసార, దీప్తి సందేసార బ్యాంకు నుంచి రూ.14,500కోట్ల రుణం తీసుకొని, చెల్లించకుండానే పరారయ్యారు. ఈ కేసులో అహ్మద్‌ పటేల్‌కు సంబంధమున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు అహ్మద్‌ను విచారించారు.

Next Story