కేసీఆర్ ఫామ్ హౌసులో యువకుడు మృతి.. ఫ్యామిలీకి అండగా నిలిచిన ఈటల

by  |
కేసీఆర్ ఫామ్ హౌసులో యువకుడు మృతి.. ఫ్యామిలీకి అండగా నిలిచిన ఈటల
X

దిశ, మర్కుక్ : వ్యవసాయ క్షేత్రం చుట్టూ పోలీస్ బలగాలను పెట్టి చుట్టుపక్క గ్రామస్తులను ఇబ్బంది పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వరదరాజపురం గ్రామంలో ఇటీవల సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో మృతి చెందిన ఆంజనేయులు కుటుంబ సభ్యులను ఆదివారం ఈటల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో నాలుగు ఎకరాల బావిలో ముళ్లపొదలను తొలగించేందుకు ఎలాంటి భద్రత లేకుండా పనులు చేయించారని ఆరోపించారు. ఫామ్ హౌస్ పోలీసుల భద్రతా వలయంలో ఉండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి వెళ్లలేకపోతున్నారని అన్నారు.

గ్రామస్తులను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆంజనేయులు కుటుంబానికి రూ. 50 వేలు అందజేసి చేతులు దులుపుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తమ వ్యవసాయ పొలాల్లో పనులకు రప్పించేందుకు భద్రత సిబ్బందితో వేధింపులకు చేస్తున్నారని రైతులు తెలిపారని ఈటల అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆంజనేయులు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. అంతకుముందు మృతి చెందిన ఆంజనేయులు కుటుంబానికి ఈటల రూ.50వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ గుప్తా, నాయకులు ఏగొండ, అంజిరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, కుశాల్ సింగ్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed