ఓటుకు అంత ఇస్తున్నారా.. పెద్ద ఫ్యామిలీలకు దసర పండుగే.!

by  |
ఓటుకు అంత ఇస్తున్నారా.. పెద్ద ఫ్యామిలీలకు దసర పండుగే.!
X

దిశ, జమ్మికుంట : ఓటుకు రూ.20 వేలు ఇస్తాం వాళ్ళే ఓట్లు వేస్తారు.. అని అంటున్నారట.. హుజురాబాద్ ప్రజలు గొర్రెల మందలు కాదని, మీరు ఏది చేబితే అది చేయడానికి వారు సిద్ధంగా లేరని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఈటల.. మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్బంగా ఆడబిడ్డలకు గొప్ప పండుగ అయిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఐదు నెలలుగా ఇక్కడ ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారని, పెన్షన్ తీసుకున్నా, రేషన్ కార్డు తీసుకున్నా.. ప్రభుత్వ పరంగా ఏ లాభం పొందినా టీఆర్ఎస్‌కే ఓటు వేయాలి, కేసీఆర్‌ను గెలిపించాలి అనే మాట వినిపిస్తున్నది. ఇవన్నీ కేసీఆర్ ఇంటి నుంచి ఫ్రీగా ఇచ్చాడా, భూమి అమ్మి ఇచ్చాడా, కూలి పని చేసి ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కానీ, ఆ డబ్బులన్నీ మనం కట్టిన పన్నులవి, అవి మన డబ్బులు అని తెలిపారు.

ఆ డబ్బులకు కేసీఆర్ కేవలం కాపలాదారుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇస్తున్న డబ్బులన్నీ నన్ను ఓడించడానికి ఇస్తున్న డబ్బులే తప్ప మీ మీద ప్రేమతో ఇస్తున్నవి కాదని అన్నారు. హుజురాబాద్, జమ్మికుంటలో జెండా కట్టడానికి, ఫ్లెక్సీ కట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నన్ను ఒంటరిని చేసేందుకు నా కారు నడపడానికి డ్రైవర్, వంట మనిషి, వడ్డించడానికి అటెండర్ ఉండకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అది మీతో అవుతుందా అని మండిపడ్డారు.

అదేవిధంగా ఈటల జమున మాట్లాడుతూ.. మహిళలు తలచుకుంటే కానిదంటూ ఏదీ ఉండదని, మహిళలందరూ ఆది శక్తులని, ఉగ్రరూపం కూడా చూపిస్తారని అన్నారు. ధర్మం కోసం నిలబడే వ్యక్తి ఈటల రాజేందర్ అని, మీ అందరి ఆశీస్సులు అందించి ఆయనను ఆదరించాలని కోరారు.


Next Story

Most Viewed