కేసీఆర్ నీకు దమ్ముంటే వారితో రాజీనామా చేపించు : ఈటల సవాల్

92

దిశ, హుజురాబాద్ : ఎన్నికలు సాఫీగా జరిగితే టీఆర్ఎస్ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మండలంలోని సింగపూర్, మందాడిపల్లి, చిన్న పాపయ్యపల్లి, తుమ్మనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల పాటు ఉద్యమంలో వాడుకొని కుట్రలు, కుతంత్రాలతో కేసీఆర్ తనకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్.. మొసలి కన్నీరు కార్చినా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహిస్తే ఇక్కడి ఓటర్లు ఇచ్చే తీర్పుతో దిమ్మతిరుగుతుందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏదో ఒక ఊరిలో తమ ప్రచారాన్ని అడ్డుకోవచ్చు. అదే మేము తలుచుకుంటే ఏ ఒక్క ఊరిలో కూడా తిరగకుండా చేస్తామని టీఆర్ఎస్ నాయకులను ఈటల హెచ్చరించారు.

తెలంగాణ.. ప్రజల జాగీర్ తప్ప ఎవడబ్బ సొత్తూ కాదన్నారు. సత్తా ఉంది కాబట్టే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, కేసీఆర్‌కు దమ్ముంటే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేర్చుకున్న వారితో రాజీనామా చేపించి ఆ స్థానాలలో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. వేరే పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యేను టీఆర్ఎస్‌లోకి తీసుకొని మంత్రి పదవిని కట్టబెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరపరిచిన చరిత్ర కేసీఆర్‌దని విమర్శించారు.

తాము ఎవరి జోలికి వెళ్ళమని.. తమ జోలికి వస్తే ఊరుకోమన్నారు. తప్పుడు లేఖలు సృష్టించి విష ప్రచారం చేస్తున్న వారి బాగోతం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా దళితులందరికీ దళిత బంధు అందజేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు ముగిశాక సిద్దిపేటకు వచ్చి సత్తా చూపిస్తానని పరోక్షంగా హరీష్ రావును హెచ్చరించారు. ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..