RSP ఎందుకు రాజీనామా చేశారో నీకు తెలియదా కేసీఆర్.. ఈటల షాకింగ్ కామెంట్స్

by  |
RSP ఎందుకు రాజీనామా చేశారో నీకు తెలియదా కేసీఆర్.. ఈటల షాకింగ్ కామెంట్స్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ఖజానా నుంచి దళిత బంధుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇండియా టూడే సర్వేతో అయినా ముఖ్యమంత్రిలో మార్పు వస్తే బావుంటుందని ఈటల ఆకాంక్షించారు.

గురువారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ధర్మాన్ని, న్యాయాన్ని, నాలాంటి ప్రజలతో మమేకమైన వ్యక్తిని చెడిపే ప్రయత్నం చేసి, తానే చెడిపోయే పరిస్థితికి చేరుకున్నారని ఆరోపించారు. చెడపకురా చెడేవు అనే సామెత ఆయన పట్ల నిజమైందని, సంపద, ఆరోగ్యం పోయినా కొంతవరకే నష్టం కానీ క్యారెక్టర్ పోతే అన్ని పోయినట్లేనని ఇంగ్లీష్ సామెతను గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్ నోట వచ్చిన ఏమాటనూ ప్రజలు నమ్మలేని పరిస్థితి తయారైందన్నారు.

శాలపల్లి సభలో కేసీఆర్ ప్రసంగం వింటున్న మహిళలు కూడా అవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, దగ్గరి వాళ్లు ఎవరు చెప్పినా పట్టించుకోని క్యారెక్టర్ కేసీఆర్‌దేనన్నారు. చరిత్రలో రాజులు, చక్రవర్తులు.. మారువేషాల్లో వచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాళ్లుని, గతంలో ముఖ్యమంత్రులు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలను కలిసే అవకాశం ఉండేదన్నారు. కానీ, ఈ సంప్రాదాయాలకు కేసీఆర్ చెల్లు చీటీ చెప్పారని ఈటల రాజేందర్ విమర్శించారు.

ఏ సీఎం అయినా ఆఫీసుకు వచ్చి మీటింగ్ పెట్టే సంస్కృతి ఉండేది. కానీ ఈయన మాత్రం ఆఫీసుకే వెళ్లరని, సీఎం ఇమేజ్ అథ: పాతాళంలో పడిపోయిందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా ఆయనకు చేరడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇండియా టుడే సర్వేలో ఆయనకిచ్చిన స్థానం చూసైనా పరిస్థితి అర్థం చేసుకోవాలని, ఎక్కడ తప్పు జరిగిందో, ఎందుకు జరిగిందో అంచనావేసుకుని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయడం లేదని ఈటల మండి పడ్డారు.

వందల ఏళ్ల క్రితం అశోకుడు చెట్లు నాటిస్తే ఇప్పటికీ చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటున్నామని, కేసీఆర్ పాలన గురించి చరిత్రలో వందల కోట్లు పెట్టి సొంత పార్టీ నేతలనే కొన్నారని చదువుకోవాల్సిన దుస్థితి ఉంటుందని ఎద్దేవ చేశారు. హుజురాబాద్‌లో ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా టీఆర్ఎస్ నేతలు, సీఎం ప్రవర్తిస్తున్నారు. ఏదైనా పథకం తెస్తే రాష్ట్రమంతా తేవాలి కానీ.. కుళ్లుబుద్ధితో నన్ను ఓడించేందుకు దళిత బంధును ఇక్కడ మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు.

అప్పటికే వాసాలమర్రిలో దళితబంధు ప్రారంభించి మళ్లీ హుజురాబాద్‌లో ఆర్భాటం చేయడం వెనక ఆంతర్యం ఏంటని అడిగారు. లక్షా 70 వేల కోట్లు దళితబంధుకు అవసరమని సీఎం చెప్తున్నప్పటికీ, రూ 2 లక్షల కోట్లు దాటుతుందని ఈటల స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ఏటా జీతభత్యాలు 40-45 వేల కోట్లు, తెచ్చిన అప్పులకు వడ్డీ, అసలు కలిపి 56 వేల కోట్లు కావాల్సి ఉంటుందని, కేవలం ఏ రెండింటి కోసమే లక్ష కోట్లు దాటుతోందన్నారు.

రైతు బంధు, సబ్సిడీలతో పాటు కేసీఆర్ కిట్స్ కోసం మరో 35 వేల కోట్లు అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయమెంత.? ఇవన్నీ పోనూ మిగిలేదెంతో సీఎంకే తెలియాలన్నారు. ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో దళిత బంధుకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఖజానాలో డబ్బులు లేకుండా ప్రకటనలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఈటల వ్యాఖ్యానించారు. నూటికి 85 శాతం ప్రజలు బలహీన వర్గాలే ఉన్నాయని మీరే చెప్పారని, 7 ఏళ్లుగా గుర్తురాని దళితజాతిపై హఠాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసన్నారు.

0.2 శాతం ఉన్న మీ సామాజిక వర్గానికి చెందిన వారికి నాలుగు మంత్రి పదవులు, 15 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు కేవలం ఓకే మంత్రి పదవిని కట్టబెట్టడం ఎంత వరకు సమజంసమన్నారు. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్నది కేసీఆరేనని, తల నరుక్కుంటానన్నది ఆయనేనన్నారు. చివరకు ముఖ్యమంత్రిని చేయకపోగా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తీసేశారని విమర్శించారు. సీఎంఓలో దళిత అధికారులకు చోటు లేదని నేను అడిగినందుకే ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు సీఎంవోలో స్థానం ఇచ్చారన్నారు. రాహుల్ బొజ్జాతో పాటు, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారులకు కూడా సీఎంవోల స్థానం కల్పించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు కూడా కేటాయించాలన్నారు.

ఓపెన్ డిబేట్‌కు సిద్దం..

రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, చేపడుతున్న పథకాలపై తాను ఓపెన్ డిబెట్‌కు సిద్ధంగా ఉన్నానని ఈటల రాజేందర్ ప్రకటించారు. అన్నీ ఖర్చులు పోనూ, మీరు దళిత బంధుకు కనీసం 10 కోట్లైనా కేటాయించే సత్తా ఉందా.? అని ప్రశ్నించారు. లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేయాలంటే 17 ఏళ్ల సమయం పడుతుందని,. రెండేళ్లలో ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలన్నారు.

దళిత బంధు స్కీంను అందరికీ వర్తింపజేసేందుకు అవసరమైన 17 ఏళ్ల పాటు మీకే అధికారమని ప్రజలు రాసివ్వలేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని ఈటల హితవు పలికారు. కేవలం దళితుల ఓట్ల మీద ఉన్న మమకారంతో హైటెక్ సిటీ దగ్గర అమ్మిన భూముల ద్వారా వచ్చిన డబ్బును హుజురాబాద్‌లో ఖర్చు చేస్తున్నారన్నారు. ఈ భూములకు సంబంధించిన క్రయవిక్రయాలు చెల్లే పరిస్థితి లేదని, ఇప్పటికే కొన్న వారి డబ్బులు వారికి తిరిగి చెల్లించాలని కోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు.

వాసాలమర్రిలో కేటాయించిన దళిత బంధు డబ్బులు ఇంకా కలెక్టర్ దగ్గరే ఉన్నాయన్నారు. హుజురాబాద్‌లో ఇచ్చే సాంక్షన్ లెటర్లు కూడా ఉత్త లెటర్లుగా ఉంటాయా.? అన్న అనుమానం వ్యక్తమవుతోందని ఈటల అన్నారు. చిత్తశుద్ధి ఉన్నట్టయితే నోటిఫికేషన్ రాకముందే దళితులందరికీ 10 లక్షల చొప్పున అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. వాటిపై అజమాయిషీ లేకుండా లబ్ధిదారులే స్వేచ్ఛగా ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు.

రైతు బంధు లాగానే దళిత బంధును రాష్ట్రంలోని దళిత బిడ్డకు ఇవ్వాల్సిందేనన్నారు. సంచార జాతులు, అన్ని వర్గాల్లోని నిరుపేదలకు కూడా రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని, ఆకలి కేకలులేని, సుసంపన్నమైన రాష్ట్రం రావాలంటే.. అందరికీ ఫలాలు దక్కాలని ఈటల స్పష్టం చేశారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రజలను నమ్మించిన సీఎం ఏ పూటకు ఆపూట అక్కర తీర్చుకునే మాటలు చెబుతూ నేటికీ పూర్తి స్థాయి రుణమాఫీని అమలు చేయలేదన్నారు.

వారెందుకు రాజీనామా చేశారో..?

ఐఏస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు రాజీనామా ఎందుకు చేశారని ఈటల ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఆదర్శంగా పని చేసిన ప్రవీణ్ కుమార్ మూడేళ్లుగా డైట్ ఛార్జీలు రావడం లేదని, ఇన్‌ఫ్రాస్టక్చర్ కొనడం లేదని రాజీనామా చేశారంటే.. ప్రభుత్వం తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఈటల అన్నారు. ఆర్ఎస్పీ కదలిలను తెలుసుకునేందుకు మూడు వాహనాల్లో, నా వెంట ఆరు వాహనాల్లో పోలీసులను తిప్పుతున్నారని ఆరోపించారు. నాకు ఏ అలవాట్లు లేవు కాబట్టి నేను బతికిపోయానన్నారు.

రాజకీయ నాయకుడిని కాబట్టి నాపై నిఘా పెట్టావనుకుంటాను. కానీ, ప్రవీణ్ కుమార్ ఏం తప్పు చేశాడని ఇంటెలిజెన్స్ ఆరా తీయడం వెనక కారణాలేంటన్నారు. టీఎస్-ఐపాస్ సృష్టికర్త, సీఎస్‌గా పని చేసిన ప్రదీప్ చంద్ర రిటైర్‌మెంట్ ఫంక్షన్‌కు సీఎం రాలేదని, అందరికీ ఎక్స్‌టెన్షన్ ఇచ్చినా ఆయనకు మాత్రం ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వం ఎంత మంది దళిత బిడ్డలకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చిందో చెప్పగలరా అని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో సాయం చేసిన అధికారులు ఎవరికీ కీలక పదవులు దక్కలేదన్నారు.

లెఫ్ట్ రైట్ భావజాలం స్థిరంగా ఉండదు..

రాజకీయాల్లో లెఫ్ట్, రైట్ అన్న భావాలు స్థిరంగా ఉండవని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ, ప్రజలకు మేలు చేసే పార్టీ బీజేపీ అని నమ్మి చేరానని ఈటల ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి, కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిలు హాజరయ్యారు.


Next Story

Most Viewed