మంత్రులంతా కలెక్షన్ ఏజెంట్లుగా మారారు : కందుల దుర్గేశ్

by  |
మంత్రులంతా కలెక్షన్ ఏజెంట్లుగా మారారు : కందుల దుర్గేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మంత్రులంతా కలక్షన్ ఏజెంట్లలా తయారయ్యారంటూ తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల లక్ష్మీదుర్గేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఏ మంత్రికి కూడా ఆయా మంత్రిత్వశాఖలపై పట్టులేదని విమర్శించారు. రాజమండ్రిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలతోపాటు కనీసం ఎరువులు కూడా సకాలంలో అందించలేకపోతున్నారని విమర్శించారు.

ఇదేనా రైతు భరోసా అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న దుకాణాలపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 6 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే రూ. 42 వేల కోట్లు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని.. రైతు సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఉద్యమం చేపట్టబోతుందని జిల్లా అధ్యక్షుడు కందుల లక్ష్మీదుర్గేశ్ వెల్లడించారు.


Next Story

Most Viewed