ఎమ్మెల్యేగా నాకు ఆహ్వానం లేదు

by  |
ఎమ్మెల్యేగా నాకు ఆహ్వానం లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరగనున్నందునే సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన పేరుతో వరాలు గుప్పించారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏ స్థాయిలో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయో అదే స్థాయిలో దుబ్బాకకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సిద్దిపేట పర్యటన సందర్భంగా ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేగా తనకు ఆహ్వానమే అందలేదని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని, జిల్లా కలెక్టర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ అవలంబించిన వివక్షకు ఎన్నికల రూపంలో గుణపాఠం చెప్పినా ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోలేదని ఆరోపించారు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాయ మాటలు చెప్పి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తారని, ఇప్పుడు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిధుల వర్షం కురిపించారని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని కల్వకుంట్ల పేరంటంగా మార్చారని ఎద్దేవా చేశారు. దుబ్బాకలోనూ వంద పడకల ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటకు వంద రూపాయలు ఇస్తే దుబ్బాకకు కూడా అదే స్థాయిలో ఇవ్వాలన్నారు. దుబ్బాక పాత బస్టాండ్‌ను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కొడుకు కేటీఆర్ కోసం ఐటీ పార్కు, అల్లుడు హరీశ్‌రావు కోసం మెడికల్ కాలేజీ, మనుమడు హిమాన్షు కోసం గజ్వేల్‌ను సీఎం అభివృద్ధి చేస్తున్నారని చమత్కరించారు. రంగనాయక సాగర్‌లో కన్వెషన్ సెంటర్ల సంగతేమోగానీ మండల కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు కట్టాలని ప్రజలు కోరుతున్నారని, ముందు వీటిపై దృష్టి పెట్టాలని సీఎంకు హితవు పలికారు.


Next Story

Most Viewed