న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్‌గా డ్రగ్స్ ముఠాల దందా

by  |
drug
X

దిశ, శేరిలింగంపల్లి: మాదక ద్రవ్యాల రవాణాపై సైబరాబాద్ పోలీసులు నిఘా పెంచారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో మత్తు పదార్థాల రవాణా విరివిగా జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఓటీ బృందాలు మాదకద్రవ్యాల వ్యాపారులు, వినియోగదారుల ఆటకట్టించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం మత్తు పదార్థాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నైజీరియా దేశానికి చెందిన ప్రధాన ఆర్గనైజర్ అండ్ డ్రగ్ సప్లయర్ జుడ్ అలియాస్ క్రిష్ గత కొంతకాలంగా గోవా నుండి హైదరాబాద్ కు మత్తు పదార్థాలను సప్లై చేస్తున్నాడు. అతనికి అరబిక్ ట్యూటర్ గా పనిచేస్తున్న టోలీచౌకికి చెందిన మహమ్మద్ అష్రఫ్ బేగ్( 37) సహకరిస్తున్నారు. ఇతను బాచుపల్లి మండలం నిజాంపేట్ కు చెందిన రామేశ్వర శ్రావణ్(24) ప్రకాశం జిల్లా ఆనంబట్ల వారి పాలెం కు చెందిన గోరెంట్ల చరణ్ తేజ (27)లకు మత్తు పదార్థాలు విక్రయించారన్న సమాచారంతో మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు గురువారం దాడులు చేశారు.

వారి వద్ద నుండి ఒక్కో గ్రాము కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో డ్రగ్ సరఫరాదారుడు మహమ్మద్ అష్రఫ్ బేగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 181 గ్రాముల కొకైన్, 44 MD ఎక్స్‌టసీ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహమ్మద్ అష్రఫ్ బేగ్ గోవా నుంచి కొకైన్‌ డ్రగ్‌ని చాలాసార్లు తీసుకొచ్చి అదే డ్రగ్‌ను హైదరాబాద్‌లో విక్రయించి సులువుగా డబ్బు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ రూ. 26 లక్షల 28వేలు ఉంటుందని సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు జుడ్ పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది సైబరాబాద్‌ పరిధిలో 202 డ్రగ్స్ కేసులు నమోదు కాగా 419మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.


Next Story

Most Viewed