రూ. 25 తుది డివిడెండ్‌ ప్రకటించిన డా రెడ్డీస్ లాబోరేటరీస్!

by  |
రూ. 25 తుది డివిడెండ్‌ ప్రకటించిన డా రెడ్డీస్ లాబోరేటరీస్!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 557 కోట్లతో 29 శాతం క్షీణించినట్టు శుక్రవారం వెల్లడించింది. కంపెనీ ఆదాయం 7 శాతం పెరిగి రూ. 4,728 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ ప్రధాన ఆదాయ మార్కెట్ అయిన ఉత్తర అమెరికాలో పనితీరు ఆశాజనకంగా లేనందునే ఆర్థిక ఫలితాలు మెరుగ్గా లేవని కంపెనీ అభిప్రాయపడింది.

కరోనా మహమ్మారికి సంబంధించి నిల్వలు, ధరలు కారణంగా క్షీణత ఉందని, దేశీయంగా గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్, సరఫరా అంతరాయం వల్ల ప్రతికూలంగా ఉందని, ప్రస్తుతం వృద్ధి బలంగా ఉందని కంపెనీ వివరించింది. సమీక్షించిన త్రైమాసికంలో భారత్‌లో అమ్మకాలు 23 శాతం పెరిగి రూ. 844.5 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ నికర లాభం రూ. 1,952 కోట్లకు తగ్గగా, ఆదాయం రూ. 18,420 కోట్లకు పెరిగాయని వెల్లడించింది. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ. 25 తుది డివిడెండ్‌కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో డా రెడ్డీస్ షేర్ శుక్రవారం 2 శాతం క్షీణించి రూ. 5,203 వద్ద ట్రేడయింది.


Next Story