గ్రేటర్‌ ప్రజలకు షాక్.. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు లేనట్టేనా !

by  |
గ్రేటర్‌ ప్రజలకు షాక్.. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు లేనట్టేనా !
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ప్రజలకు ఇక డబుల్ బెడ్‌ రూం ఇళ్లు కలేనా ! ఇన్నిరోజులు పేదలు పెంచుకున్న ఆశలు అడిశయాలు కావల్సిందేనా ? ప్రస్తుతం నిర్మాణాల్లో ఉన్నవాటినే పూర్తి చేసి ప్రభుత్వం మమా అనిపిస్తోందా ! అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం గ్రేటర్ ఎలక్షన్ టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రెస్‌మీట్‌లో ఎక్కడా డబుల్ బెడ్‌ రూం ఇళ్ల ప్రస్తావనను తేకపోవడంతో, ఇక భాగ్యనగర వాసులకు ముందు ముందు డబుల్‌ బెడ్‌ ఇళ్లు అందని ద్రాక్షలా మారుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దాదాపు గంటకు పైగా మీడియాతో మాట్లాడి గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను పూసగుచ్చినట్టు వివరించిన కేసీఆర్.. తన నోట్లో నుంచి డబుల్ బెడ్‌ రూం ఇళ్లు అన్న పదాన్నే పలకలేదు. హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్లతో పాటు, రోడ్లు, డ్రైనేజీలు, మెట్రో లైన్‌, సెలూన్ సెంటర్లకు ఉచిత విద్యుత్‌పై హామీలు ఇచ్చి.. ఈసారి మళ్లీ డబుల్‌ బెడ్‌ రూంలు నిర్మిస్తామని స్పష్టం చేయలేదు. ప్రెస్‌మీట్ అయిపోయాక సైతం, మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగేందుకు రెడీ అవుతుండగా.. స్వారీ బ్రదర్, ఇప్పటివరకు ఇంతే.. ఇంకేమైనా ఉంటే రేపు మాట్లాడుకుందామని సముదాయించి వెళ్లిపోయారు. అయితే డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఎదురు ప్రశ్నలు ఉత్పన్నమైతే ప్రస్తుతం ఇచ్చిన హామీలపై నెగిటివ్ ప్రచారం మొదలవుతుందని భావించే కేసీఆర్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారన్న చర్చ జరుగుతోంది.

2014ఎన్నికల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మేనిఫెస్టోలో చేర్చిన టీఆర్ఎస్.. ఆతర్వాత ఏడాదిన్నరకే జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌ల్లోనూ ఇదే ప్రధాన హామీగా వినిపించింది. రాష్ట్రం వ్యాప్తంగా లక్ష , కేవలం హైదరాబాద్‌ నగరంలోనే లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మొత్తం రెండు 2లక్షల ఇళ్లు నిర్మిస్తామని మీడియా ముఖంగా కేసీఆర్ వెల్లడించారు. కానీ 99సీట్లు సాధించి ఒంటరిగానే మేయర్ పీఠాన్ని దక్కించుకున్న టీఆర్ఎస్‌ తాను చెప్పినట్లు లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు పంచలేదు. ఈ అంశంపై మూడు నెలల క్రితం అసెంబ్లీలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, తలసాని మధ్య వివాదం జరిగి.. లక్ష ఇళ్లను చూపెట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్న విమర్శలు వినిపించాయి. దీనిపై కొద్దిరోజులు ప్రతిపక్షాలు పట్టుబట్టినా, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కౌంటర్‌ ఇవ్వడంలో మాత్రం విఫలం అవుతున్నాయి.

అయితే.. గ్రేటర్ మేనిఫెస్టో కాపీలో డబుల్ బెడ్ రూం ఇళ్లను కొనసాగిస్తామని ఒక లైనులో రాసుకొచ్చినప్పటికీ.. కేసీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా చెప్పకపోవడం విశేషం. డబుల్ బెడ్ రూంల నిర్మాణం పెద్దమొత్తంతో కూడుకున్న ఖర్చు కావడంతో ఇప్పుడు ప్రకటనలు చేసి, తర్వాత జాప్యం చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే కేసీఆర్.. ఉచిత నీళ్లు, రోడ్లు, మెట్రో, సెలూన్లకు ఉచిత కరెంట్‌పై ప్రధానంగా వివరించి, డబుల్ బెడ్‌ రూం ఇళ్ల అంశాన్ని పక్కకు పట్టించారని సమాచారం. జియాగూడలో పలువురు లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేసినా ఆ విషయాన్ని ప్రస్తావించకుండానే, త్వరలో ఎన్నిఇళ్లు నిర్మిస్తారో స్పష్టం చేయక పోవడంతో.. ఇక భవిష్యత్‌లో హైదరాబాద్ పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు కలగానే మిగిలిపోతాయని అభిప్రాయ పడుతున్నారు.


Next Story