అమెరికన్లకు ట్రంప్ చెప్పిన చివరి మాట ఇదే!

235

వాషింగ్టన్: అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ బుధవారం చివరిసారిగా శ్వేతసౌధాన్ని వీడారు. అధికార మార్పిడిలో పాటించే సంప్రదాయాలను ఆయన తుంగలో తొక్కుతూ జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాకుండా తన మద్దతుదారులు, కుటుంబ సభ్యులతో నిర్వహించతలపెట్టిన వీడ్కోలు సమావేశానికి వెళ్లారు. వెళుతూ వెళుతూ ఒకే ఒక్క నిబంధనను పాటించి వైట్‌‌హౌస్‌లో బైడెన్‌కు ట్రెడిషనల్ నోట్‌ను ఉంచారు.

కొత్త అధ్యక్షుడు, ఆయన దంపతులకు బయటికివెళ్లే అధ్యక్ష దంపతులు తేయాకు విందును ఇచ్చి వైట్‌హౌస్‌‌లో చిన్నపాటి సందర్శన ఇస్తారు. అనంతరం నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వెళతారు. కానీ, ట్రంప్ ఇందుకు భిన్నంగా ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొడుతూ ఉదయాన్నే తన వీడ్కోలు సమావేశానికి వెళ్లిపోయారు. వైట్‌హౌస్‌ నుంచి ఇరువురు దంపతులు మెరైన్ వన్ హెలికాప్టర్‌ ద్వారా మేరీలాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌ ఎయిర్‌బేస్‌కు వెళ్లడానికి ముందు విలేకరులతో సంక్షిప్తంగా మాట్లాడారు.

ఇక్కడే ఎప్పుడు ఉండిపోవడానికి రాలేదని, అయితే, త్వరలోనే ఏదో ఒక రూపంలో మళ్లీ మీముందుకు తిరిగి వస్తానని వ్యాఖ్యానించారు. రెడ్ కార్పెట్ నడుస్తూ వైట్‌హౌస్‌ దక్షిణ లాన్‌లో వేచి చూస్తున్న హెలికాప్టర్ ఎక్కారు. అక్కడ 21 గన్ సెల్యూట్‌లతో మిలిటరీ అభివాదం చేసింది. అమెరికాకు సేవలందించడం తనకు లభించిన అరుదైన గౌరవని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వీడ్కోలు సమావేశం ముగిసిన తర్వాత ట్రంప్ దంపతులు ఎయిర్‌ఫోర్స్ వన్ ద్వారా ఫ్లోరిడాలోని మర్ ఎ లాగో రిసార్టుకు చేరనున్నారు. ఫ్లోరిడాలో సాధారణ పౌరుడి జీవితాన్ని ట్రంప్ గడపనున్నారు. ట్రంప్ వీడ్కోలు సమావేశానికి ఆయన ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మైక్ పెన్స్ గైర్హాజరవ్వడం గమనార్హం.

ట్రంప్.. దేశభక్తుల పార్టీ?

అధ్యక్ష ఎన్నికల్లో పరాజయాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్న డొనాల్డ్ ట్రంప్ తన శ్రేయోభిలాషులు, అభిమానులను అట్టిపెట్టుకుని ఉండేందుకు కొత్త పార్టీని స్థాపించనున్నట్టు కథనాలు వచ్చాయి. ఆయన రిపబ్లికన్ పార్టీపై ఇటీవల విమర్శలు పెంచారు. తన చర్యలతో విభేదించిన నేతలపై విరుచుకుపడ్డారని సమాచారం. త్వరలోనే రిపబ్లికన్ పార్టీలో చీలిక ఏర్పడే అవకాశముందని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. ట్రంప్ కొత్తగా పేట్రియట్ పార్టీని స్థాపించనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..