58లక్షల మంది రైతులకు రైతుబంధు పంపిణీ పూర్తి

by  |
58లక్షల మంది రైతులకు రైతుబంధు పంపిణీ పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 58.07 లక్షల మంది రైతులకు ప్రస్తుత సీజన్‌కు రైతుబంధు సాయాన్ని అందించినట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1.32 కోట్ల ఎకరాలకు సంబంధించిన రూ. 6,632.74 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో, పది ఎకరాల లోపు సాగుభూమి ఉన్న రైతులందరికీ ఈసారి రైతుబంధు డబ్బులు పది రోజుల వ్యవధిలోనే జమ అయ్యాయని వివరించారు.

అత్యధికంగా నల్లగొండ జిల్లాలో సుమారు 4.31 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 530కోట్లు జమ అయ్యాయని తెలిపారు. ఆ తర్వాత ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ మంది రైతులు, ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అయిందని పేర్కొన్నారు. కనిష్ట స్థాయిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కేవలం 30వేల లోపు మంది మాత్రమే రైతుబంధు ద్వారా రైతులు లబ్ధిపొందారని, వీరి ఖాతాల్లోకి రసూ. 26.82 కోట్లు జమ అయినట్లు తెలిపారు. కానీ రైతుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ నాగర్‌కర్నూల్ జిల్లాలో 2.52లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.327కోట్ల మేర జమ అయినట్లు వివరించారు.

మేడ్చల్ జిల్లా తరహాలోనే ములుగు, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కూడా రైతు లబ్ధిదారుల సంఖ్య లక్ష లోపు మాత్రమే ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు రోజులలో మిగిలిన రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని, చివరి రైతు వరకూ అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటే చెప్పారని, ఆ ప్రకారమే పంపిణీ జరుగుతోందన్నారు.


Next Story