Target Women : మహిళలే టార్గెట్‌ !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-15 04:12:28  IST  )

మహిళలు(Womens) ఒంటరిగా కనబడగానే మెడలో ఉన్న బంగారు గొలుసుల(Gold chains)ను తెంచుకుని పరారవుతున్నారు. నగరంలో రోడ్లపై ఒంటరిగా నడవాలన్నా, ఇంట్లో ఒంటరిగా ఉండాలన్నా మహిళలు, వృద్ధులు భయపడాల్సిన పరిస్థితులెదురవుతున్నాయి.

Target Women : మహిళలే టార్గెట్‌ !
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మహిళలు(Womens) ఒంటరిగా కనబడగానే మెడలో ఉన్న బంగారు గొలుసుల(Gold chains)ను తెంచుకుని పరారవుతున్నారు. నగరంలో రోడ్లపై ఒంటరిగా నడవాలన్నా, ఇంట్లో ఒంటరిగా ఉండాలన్నా మహిళలు, వృద్ధులు భయపడాల్సిన పరిస్థితులెదురవుతున్నాయి. మహిళలకు, వృద్ధులకు నగరంలో రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు. వ్యక్తిగత పనుల కోసం రోడ్డు మీద ఎవరి తోడు లేకుండా నడిచి వెళుతున్న మహిళలను, ఇంట్లో మధ్యాహ్నం వేళల్లో ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను చైన్ స్నాచర్లు టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు.

ఇటీవలి కాలంలో జిల్లాలో అక్కడక్కడా చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిజామాబాద్ నగరంలో వారంలో ఒక్క చోటనైనా చైన్ స్నాచింగ్ సంఘటనలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్న చోట జరిగిన సంఘటనల్లో పోలీసులకు ఆధారాలు దొరుకుతుండగా, ఇప్పటి వరకు కొన్ని కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి దొంగిలించబడిన బంగారాన్ని రికవరీ చేశారు. వెలుగులోకి వచ్చిన కేసులు కొన్ని వెలుగులోకి రాకుండా ఉన్న కేసులు కూడా మరి కొన్ని ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న చైన్‌ స్నాచింగ్‌ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సాధారణంగా మహిళలు ఒంటిపై నిండుగా బంగారు నగలు ధరించి వచ్చేది ఏవైనా పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లు జరిగినప్పుడే. తాజాగా చైన్ స్నాచర్లు ఫంక్షన్ హాళ్లు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో కూడా రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చైన్ స్నాచర్లు టిప్పు టాపుగా డ్రెస్ చేసుకుని పెళ్లిల్లకు, ఫంక్షన్లకు పెళ్లికొడుకు, పెళ్లికూతురు తరపు బంధువులుగానో వెళ్లి చోరీ చేయడానికి అవకాశం కోసం చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజామాబాద్ లోని ఓ పెద్ద ఫంక్షన్ హాలు వద్ద ఇలా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను నిలదీస్తే తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. ఇలాగే బాల్కొండ, బోధన్ మండలాలల్లో కూడా రెండు చోట్ల జరిగినట్లు సమాచారం. దీన్ని బట్టిచూస్తే చైన్ స్నాచింగ్ లలో నిష్ణాతులైన కొందరు ఓ ముఠాగా ఏర్పడి ఈ దందాను నడిపిస్తున్నారేమోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడే వారు స్పీడ్ గా నడిపే స్పోర్ట్స్ బైక్ లను ఉపయోగించే వారు. చైన్ స్నాచింగ్ చేసి క్షణాల్లో బైక్ పై స్పీడ్ గా మాయమయ్యేవారు. ఇప్పుడు మామూలు బైక్ లపై కూడా వచ్చి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు..

మూడురోజుల క్రితం బోధన్ పట్టణంలో ఓ స్వప్న అనే చీరలు విక్రయించే మహిళ వద్దకు వెళ్లి చీరలు కొనడానికి వెళ్లినట్లు వెళ్లింది. చీరలు సెలెక్ట్ చేసుకుంటున్నట్లు నటిస్తూ అవకాశం చిక్కగానే తన వెంట తెచ్చుకున్న పొడికారాన్ని మహిళ కంట్లో చల్లి రూ.40 వేలు దొంగిలించి పారిపోయే ప్రయత్నం చేసి స్థానికులకు దొరికిపోయింది.. ఆ మహిళను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. బాల్కొండలో ఓ గృహిణి తన కొడుకును స్కూల్ లో వదిలేసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వెనక నుండి ఇద్దరు గుర్తు తెలియని ఇద్దరు బైక్ పై వచ్చి బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు.

తాజాగా నిజామాబాద్ నగరంలోని వీక్లీ బజార్ లో ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయ అనే వృద్ధురాలి మెడలోంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసును దొంగిలించుకుని పారిపోయాడు. ఈ ప్రయత్నంలో ఆ వృద్ధురాలిపై దాడికి పాల్పడగా ఆమెకు గాయాలు కూడా అయ్యాయి.

Next Story