Bugga cheruvu: యథేచ్ఛగా బుగ్గ చెరువు మట్టి తరలింపు దందా!

by Y. Venkata Narasimha Reddy |

అక్రమార్కుల ఆగడాలతో చెరువు నల్లమట్టి(Black Soil) తరలిపోతుంది. రెండు ఎకరాలకు పర్మిషన్ తీసుకుని 15 ఎకరాలలో తవ్వకాలు చేస్తూ పగలు రాత్రి తేడా లేకుండా 60 టిప్పర్లలో నల్ల మట్టి యథేచ్ఛగా తరలిస్తున్నారు.

Bugga cheruvu: యథేచ్ఛగా బుగ్గ చెరువు మట్టి తరలింపు దందా!
X

దిశ, మర్రిగూడ: అక్రమార్కుల ఆగడాలతో చెరువు నల్లమట్టి(Black Soil) తరలిపోతుంది. రెండు ఎకరాలకు పర్మిషన్ తీసుకుని 15 ఎకరాలలో తవ్వకాలు చేస్తూ పగలు రాత్రి తేడా లేకుండా 60 టిప్పర్లలో నల్ల మట్టి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అడిగినవారికి కేవలం మీసేవ పర్మిషన్ చూపిస్తూ నల్లమట్టి తరలింపుపై అటు అధికారులు ఇటు ప్రజలు టిప్పర్ల స్పీడ్ తో బెంబేలెత్తుతున్నారు. అక్రమంగా నల్ల మట్టిని తరలిస్తున్న(Illegal Trafficking) కాంట్రాక్టర్ పై ఉన్నతాధికారులు గతంలో తవ్వకాలు నిలిపివేసినప్పటికీ మూడు రోజుల నుంచి రోజుకు 60 టిప్పర్లు పగలు రాత్రి తేడా లేకుండా జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బుగ్గ చెరువు(Bugga cheruvu)ను కాపాడాలని దామెర ప్రజలు కోరుతున్నారు.

నాంపల్లి మండలం దామెర గ్రామ పంచాయతీ లోని బుగ్గ చెరువు 19 సర్వే నెంబర్ కడారు శ్రీను అసైన్డ్ ల్యాండ్ లో రెండెకరాల ఆరు గంటలకు జిల్లా మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. కానీ అనుమతికి మించి సుమారు 15 ఎకరాల లో నల్లమట్టి తవ్వకాలు జరపడమే కాకుండా, అర్ధ రాత్రుల్లు సైతం టిప్పర్ వాహనాలలో నల్లమట్టిని రంగారెడ్డి జిల్లా కు ఇటుకల తయారీకి తరలిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అధికారులు 5000 ట్రిప్పులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ పర్మిషన్ తీసుకున్న కాంట్రాక్టర్ ఇప్పటికీ 50 వేల పైచిలుకు టిప్పర్లలో నల్ల మట్టిని అక్రమంగా తరలించారు.

రోజుకు వందల టిప్పర్లు అధిక లోడ్లతో, అతి వేగంగా వెళ్తూ, రోడ్లను డ్యామేజ్ చేస్తున్నాయని, కనీసం రోడ్లపై నీటిని కూడా చల్లటం లేదని దామెర భీమనపల్లి , కమ్మ గూడెం లంకలపల్లి సరంపేట రాం రెడ్డి పల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలనే తేడా లేకుండా, వరుస పెట్టి గ్రామాల నుంచి వాహనాలు వెళ్లడంతో, ఆ శబ్దానికి నిద్ర కూడా రావటం లేదని రోడ్ల వెంట ఉన్నా ఇండ్లవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లమట్టి రవాణా చేస్తున్న వాహనాలకు సరైన పత్రాలు లేవని, నడిపే వారిలో మైనర్లు ఉన్నారని రాంరెడ్డి పెళ్లి గ్రామస్తులు అంటున్నారు.

వే బిల్స్ పూర్తి స్థాయిలో లేకుండానే నల్లమట్టి రవాణా చేస్తున్నారని, అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. కనీస అనుమతులను పాటించకుండానే, లోతుగా గుంతలు పెట్టి, నిర్ణీత సమయంలోనే అధిక మొత్తంలో మట్టి రవాణ చేశారని ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలు అక్రమ తవ్వకాలేనని దామెర గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నల్లమట్టి తరలింపుతో టిప్పర్ వాహనాల వలన రోడ్లు ధ్వంసం కావడం, దుమ్ము ధూళితో వాతావరణం కలుషితం అవుతున్న నేపథ్యంలో రాంరెడ్డి పల్లి గ్రామస్తులు రోడ్డుపైన బారికేడ్లను ఏర్పాటు చేసి టిప్పర్లను కొద్దిసేపు నిలిపివేశారు.

రాత్రి సమయాలలో పర్మిషన్ లేకుండా టిప్పర్ వాహనాలు నడపడం అక్రమమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన క్వాంటిటీని అధికారుల పర్యవేక్షణ లేకుండా, ఎంత మొత్తంలో తవ్వారని ఎలా అంచనా వేస్తారని, అనుమతి పేరిట బుగ్గ చెరువును లూటి చెయ్యమని అధికారులే వారికి అండగా ఉంటూ, మేమున్నామని హామీ ఇస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నాయి..!? రోడ్లు డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో ఆర్అండ్ బీ అధికారుల అనుమతులు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా అక్రమ తవ్వకాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

మైనింగ్ ఏడి వివరణ

దామెర భీమనపల్లి బుగ్గ చెరువు నల్ల మట్టి తరలింపు పై జిల్లా ఏడి ని "దిశ" వివరణ కోరగా గతంలోనే తవ్వకాలు నిలిపివేశామని మళ్లీ నల్ల మట్టి తవ్వకాలు, మట్టి తరలింపు తన దృష్టికి రాలేదని ఒకవేళ చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story