పంట రైతుదే.. లాభం మిల్లర్లదే! తరుగు పేరుతో దర్జాగా దోపిడీ

by Ramesh Naini |

ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన అన్నదాతకు కన్నీరే మిగులుతోంది.. పెట్టుబడులు పెరిగినా పంట సాగే రైతాంగం జీవనాధారం.. అంత కష్టపడి గింజ గింజ పోగు చేసి మిల్లుకు పంపితే తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి గురి చేస్తున్నారు.

పంట రైతుదే.. లాభం మిల్లర్లదే! తరుగు పేరుతో దర్జాగా దోపిడీ
X

దిశ, మెదక్ ప్రతినిధి: ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన అన్నదాతకు కన్నీరే మిగులుతోంది.. పెట్టుబడులు పెరిగినా పంట సాగే రైతాంగం జీవనాధారం.. అంత కష్టపడి గింజ గింజ పోగు చేసి మిల్లుకు పంపితే తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి గురి చేస్తున్నారు. నిబంధనల మేరకు బస్తా బరువు, తరుగుతో కలిపి తూకం చేసినా.. మిల్లర్లు మాత్రం ఏదో సాకుతో తరుగు తీస్తూ దర్జాగా దోపిడీ చేస్తున్న వైనం జిల్లాలో సాగుతోంది. మెదక్ జిల్లాలో వరి పంటే ప్రధాన పంట.. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతాంగం సాగును మాత్రం వీడడం లేదు. అదే విధంగా మిల్లర్ల దోపిడీ కూడా ఆగడం లేదు. ప్రతి సారి మిల్లర్ల మాయాజాలం ప్రదర్శిస్తున్న తప్పదులే అన్నట్టుగా రైతాంగం భావిస్తుంది. కానీ ప్రతి సీజన్ లో మిల్లర్లు రైతులను నిలువునా దోచేస్తున్నా అధికారులు మాత్రం మిల్లర్ల పక్షం నిలవడం గమనార్హం. హవేలీ ఘనపూర్ కు చెందిన ముగ్గురు రైతులకు చెందిన 769 బస్తాల ధాన్యం తూకం చేశారు. నిబంధనల మేరకు బస్తాలు 42.300 కిలోల తూకం చేశారు. ఇదే నెల 11 న ట్రాక్ షీట్ లో కూడా నమోదు చేసి నిజాంపేట్ మండలం నందిగామ లక్ష్మీ నర్సింహ రైస్ మిల్లుకు లారీలో తరలించారు. అక్కడికి వెళ్లి న తర్వాత 769 బస్తాల ధాన్యానికి 762 కు తగ్గించారు. ఏడు బస్తాల ధాన్యం తగ్గించడం పై రైతులు ఆరా తీస్తే తూకం వేసిన తర్వాత ధాన్యం నిల్వ ఉండడం వల్ల తరుగు వచ్చిందని, అందుకే ఏడు బస్తాల ధాన్యం తగ్గించినట్టు చెప్పడం, రైతులు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా మిల్లర్ల పక్షమే నిలవడంతో రైతులు రెండు క్వింటాళ్లకు పైగా నష్టపోవాల్సి వచ్చింది.

అన్ని మిల్లులు అంతే..

ఇది ఒక నిజాంపేట మండలంలోని రైస్ మిల్లు దోపిడీ ఒకటే కాదు.. జిల్లాలో దాదాపు చాలా మిల్లుల్లో జరుగుతున్న దోపిడీగా రైతాంగం ఆరోపిస్తోంది. తరుగు తీసినంత రైతులు ఒప్పుకుంటే సరే లేకపోతే ధాన్యం లారీలు తిరిగి పంపుతున్నారే తప్ప ధాన్యం తీసుకోవడం లేదని రైతాంగం అవేదన వ్యక్తం చేస్తుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కొన్ని మిల్లులు బస్తాకు నాలుగు కిలోల తరుగు ఇస్తేనే మిల్లులోకి అనుమతి ఇస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదంతా అధికారుల దృష్టికి వచ్చిన పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్ షీట్ లో మిల్లులకు వెళ్లిన ధాన్యం ఎంత.. మిల్లులోకి వెళ్ళిన తగ్గిన ధాన్యం వివరాలు సేకరిస్తే అన్నదాతలు ఎంత ధన్యం నష్టపోతున్నారు..? అనేది తెలుస్తుంది. కానీ ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద నుంచి ధాన్యం తరలిస్తే చాలు అన్నట్లుగా ఉన్న అధికారులు రైతుల నష్టాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మిల్లుల దోపిడీని అరికట్టకుంటే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలు కావలసిన దుస్థితి వచ్చే ప్రమాదం ఉంది.

Next Story