‘రామసముద్రం’మట్టి దందా! మిషన్ కాకతీయ మట్టి.. ఇటుక బట్టీలకు?

by Ramesh Naini |

రైతులు తమ వ్యవసాయ పొలాల్లో భూసారాన్ని పెంచుకునేందుకు చెరువు నుండి మట్టి అనుమతులు కోరితే నానా ఇబ్బందులు పెట్టే అధికారులు బడా నాయకులకు మాత్రం క్షణాలలో అనుమతులు జారీ చేస్తారని జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘రామసముద్రం’మట్టి దందా! మిషన్ కాకతీయ మట్టి.. ఇటుక బట్టీలకు?
X

దిశ, నల్లగొండ బ్యూరో : రైతులు తమ వ్యవసాయ పొలాల్లో భూసారాన్ని పెంచుకునేందుకు చెరువు నుండి మట్టి అనుమతులు కోరితే నానా ఇబ్బందులు పెట్టే అధికారులు బడా నాయకులకు మాత్రం క్షణాలలో అనుమతులు జారీ చేస్తారని జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారంలోని రామసముద్రం చెరువు నుండి నల్లమట్టి తరలించేందుకు గతంలో నిబంధనలను తుంగలో తొక్కి మరీ అనుమతులు జారీ చేశారు. సదరు అధికారులు జారీ చేసిన అనుమతి పత్రంలోని నిబంధనలు పాటించకున్న చర్యలు తీసుకోవడంలో నీటిపారుదల శాఖ అధికారులు అలసత్వం వహించారనే ఆరోపణలు వచ్చాయి. స్థానికుల నుంచి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు సదరు వ్యాపారులు ఇచ్చే అమ్యామ్యాలకు అలవాటు పడి కళ్ళు మూసుకున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా తాజాగా గతంలో జారీ చేసిన అనుమతులకు అనుబందంగా మరోసారి అనుమతుల పొడిగింపు జరిపారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి, కోరుకున్నది ఇస్తే చాలు ఇక తమకేమి కనపడటం లేదన్నట్లు కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. కాసులకు కక్కుర్తి పడి వెనకా ముందు చూసుకోకుండా నిబంధనలు తుంగలో తొక్కి అనుమతి పత్రాల జారీ కోసం సంతకాలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అనుమతుల పొడిగింపు ఎవరి కోసం?

గోకారం గ్రామంలోని రామసముద్రం చెరువు నుంచి మట్టిని తరలించేందుకు మిషన్ కాకతీయ కింద అనుమతులు గత నెలలోనే జారీ చేశారు. ఏప్రిల్ 22 నుంచి మే 6వ తారీకు వరకు 15 రోజుల పాటు 5000 క్యూబిక్ మీటర్లు అనగా 8000 మెట్రిక్ టన్నులు తరలించుకున్నందుకు అనుమతులు జారీ చేశారు. గ్రామస్తుల నుండి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన పట్టించుకోని అధికారులు సదరు మట్టి జిల్లా సరిహద్దులు దాటి ఇటుక బట్టీలకు తరలించిన చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా సదరు దరఖాస్తుదారుడు తిరిగి తనకు మట్టి తరలింపునకు అనుమతులు పొడిగించాలని దరఖాస్తు చేసుకోగా నీటిపారుదల శాఖ అధికారులు గతంలో క్షేత్రస్థాయి పర్యటన రిపోర్టుల ఆధారంగానే తిరిగి మరొక 13 రోజులు అనుమతులను పొడిగించారు. తాజా అనుమతుల్లో మే 21 నుంచి జూన్ 2వ తేదీ వరకు 2000 క్యూబిక్ మీటర్లు అనగా 3000 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించేందుకు నీటిపారుదల శాఖ అనుమతులు జారీ చేసింది. అసలు మిషన్ కాకతీయ పేర వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఎక్కడికి తరలించేందుకు అనుమతులు జారీ చేస్తున్నారో అధికారులకు అర్థం కాకపోవడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది.

మైనింగ్ శాఖ ప్రమేయం అవసరం లేదా..?

గతంలో మొదటిసారి జారీ చేసిన మట్టి రవాణా అనుమతుల్లో మైనింగ్ శాఖ ప్రమేయం లేదు. సదరు క్షేత్రస్థాయి రిపోర్టులతోనే తిరిగి తాజా అనుమతుల పొడిగింపు నీటిపారుదల శాఖ జారీ చేసింది. వాణిజ్య అవసరాలకు మట్టిని ఉపయోగించేందుకు మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదా..? కేవలం నీటిపారుదల,రెవెన్యూ శాఖ అధికారుల అనుమతులతోనే వాణిజ్య అవసరాలకు కూడా మట్టిని తరలించుకునే అవకాశం ఉంటే ఇక మైనింగ్ శాఖ ప్రమేయం ఎందులో అనే అనుమానం స్థానిక ప్రజలలో కలుగుతుంది. ఒకవేళ మైనింగ్ శాఖ అధికారులు కూడా అనుమతులు జారీ చేయాల్సి ఉంటే ఈ అనుమతుల ప్రక్రియలో ఎందుకు పాల్గొనలేదు? అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. మిషన్ కాకతీయ అనుమతుల పేరుతో ఇటుక బట్టి వ్యాపారులకు మట్టిని తరలించేందుకు అనుమతులు జారీ చేస్తూ నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకోవడం పట్ల వారికి చేకూరుతున్న ప్రయోజనం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. మిషన్ కాకతీయ గైడ్‌లైన్స్ ప్రకారం నీటిపారుదల శాఖ అధికారులు వ్యవహరించలేదని ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి.

అధికార పార్టీ ఒత్తిడి, మామూళ్ల మత్తులో!

అధికార పార్టీ నేతల ఒత్తిడితోపాటు కాసులకు కక్కుర్తి పడి పలువురు అధికారులు నిబంధనలు ఉల్లంఘించి మట్టిని తరలిస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనపై పక్కా ఆధారాలతో గతంలో ఫిర్యాదులు చేసిన అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. రామసముద్రం చెరువు నుంచి మట్టిని తరలించేందుకు ఉపయోగించే ప్రోక్ లైనర్ డ్రైవర్లు స్థానిక రైతు వేదికలోనే బస చేస్తూ ఉండటం చూస్తే సదరు మట్టి వ్యాపారులకు అధికారులు ఏ స్థాయిలో సహకరిస్తున్నారనేది ఇట్టే అర్థమవుతుంది. నీటిపారుదల శాఖ అధికారులు వచ్చాక ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపు వారి పర్యవేక్షణలోనే మట్టిని తరలించాల్సి ఉన్న ఆ నిబంధనలను పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొదటిసారి జారీ చేసిన అనుమతులతోనే సుమారు రెండు కోట్ల రూపాయల మట్టి దందా జరిగినట్లు ఇందులో అధికారులకు కూడా కొంత వాటా వెళ్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలో పొందుపరిచినా 12 వాహనాలు కాకుండా అనుమతి లేని వాహనాలలో కూడా భారీగానే మట్టిని తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా మినరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ గా ఉండే జిల్లా కలెక్టర్ ఈ మట్టి దోపిడీపై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటి వరకు అక్రమంగా తరలించిన మట్టి వివరాలను సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story