- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు.. ‘మాతృశ్రీ’లో వసూళ్ల దందా!
విద్యానగర్‌లో గల మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల జారీ కోసం వేల రూపాయలు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది.

దిశ, హుజూరాబాద్ రూరల్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన కళాశాల యాజమాన్యం.. అడ్డగోలు వసూళ్లతో వారి పాలిట శాపంగా మారింది. హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో గల మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల జారీ కోసం వేల రూపాయలు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఫీజుల వేధింపులు..
కళాశాలలో డిగ్రీ, పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ టీసీ, ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం వెళ్తే యాజమాన్యం కొత్త నిబంధనలను తెరపైకి తెస్తోంది. 'యూనివర్సిటీ డెవలప్‌మెంట్ ఫండ్' పేరిట భారీ మొత్తంలో నగదు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కరాకండిగా చెబుతోంది. యూనివర్సిటీ ఫండ్ కింద రూ. 4,500, టీసీ కోసం రూ. 2,500 చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. డబ్బులు ఉన్నవారు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటుండగా నిరుపేద విద్యార్థులు నెలల తరబడి కళాశాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.
ఆరు నెలలుగా తిరుగుతున్నా కనికరించని వైనం
ఈసంపల్లి శ్యామల అనే విద్యార్థిని ఈ కళాశాలలో బీకామ్ పీజీ పూర్తి చేసి గత సప్లమెంటరీలో ఉత్తీర్ణత సాధించింది. ఉన్నత చదువుల కోసం ఆరు నెలల నుంచి తన సర్టిఫికెట్ల కోసం కళాశాల చుట్టూ తిరుగుతోంది. ‘టీసీ కోసం రూ. 2,000 ఇస్తానని బతిమిలాడినా యాజమాన్యం కనికరించడం లేదు. మొత్తం రూ. 7,000 చెల్లిస్తేనే కాగితాలు ఇస్తామని వేధిస్తున్నారు’ అని బాధితురాలు కన్నీరు మున్నీరవుతోంది.
కరాకండిగా చెబుతున్న కరస్పాండెంట్..
ఈ విషయమై కళాశాల కరస్పాండెంట్ ఇంద్రసేనా రెడ్డిని వివరణ కోరగా విద్యార్థుల ఆరోపణలను తోసిపుచ్చకపోగా యూనివర్సిటీ ఫండ్, టీసీ డబ్బులు కచ్చితంగా చెల్లించాల్సిందే అని స్పష్టం చేయడం గమనార్హం. ఉన్నత విద్యకు వెళ్లాలన్నా, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా సర్టిఫికెట్లు అత్యవసరమని తెలిసినా యాజమాన్యం మొండిగా వ్యవహరించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్న మాతృశ్రీ కళాశాల యాజమాన్యం పై విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కళాశాలపై చర్యలు తీసుకోవాలి.. పీడీఎస్‌యూ
హుజురాబాద్ పట్టణంలోని మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యజమాన్యం విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ లు ఇవ్వడానికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని పీడీఎస్‌యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణా ప్రతాప్ ఆరోపించారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కళాశాలలో విద్యార్థులకు అనుగుణంగా ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు. సరైన ఫ్యాకల్టీ సైతం లేదన్నారు. యూనివర్సిటీ అధికారులు కళాశాలపై చర్యలు తీసుకోవాలని, గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు డబ్బులు తీసుకోకుండా తక్షణమే అందించాలని, లేనియెడల తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.






