- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలాపున మానేరు.. కానీ అక్కడ మంచినీటికి తిప్పలు.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
తలాపున మానేరు ఉన్నా అక్కడ తాగేందు మంచినీటికి తీవ్ర కరువు. లక్షల రూపాయలు వెచ్చించి మంచినీటి సరఫరాకు వాటర్ ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేసిన పట్టించుకునే వారు లేక రెండు రోజులకు ఒకసారి మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

దిశ, మానకొండూరు : తలాపున మానేరు ఉన్నా అక్కడ తాగేందు మంచినీటికి తీవ్ర కరువు. లక్షల రూపాయలు వెచ్చించి మంచినీటి సరఫరాకు వాటర్ ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేసిన పట్టించుకునే వారు లేక రెండు రోజులకు ఒకసారి మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. చివరకు మిషన్ భగీరథ నీల్లే దిక్కు అవుతున్నాయి. అయితే తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ సైతం నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్లాంట్ పైపుల్లో నాచు, చెత్త చెదారం నిండుకుపోయి కంపు కొడుతున్నా ఆ నీరే తాగాల్సి రావడం అక్కడి పరిస్థితి ఏర్పడింది.
అపరిశుభ్రత ఉన్నా నిర్లక్ష్యం
వాటర్ కోసం ప్లాంట్ కు వెళ్తే పట్టుకునే నీళ్ల క్యాన్లలోకి పైపుల నుంచి నేరుగా నాచు వచ్చి చేరుతోంది. ప్లాంట్ ఆవరణ అంతా పాకురు పట్టి, కంపు కొడుతోంది. దీనిపై అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే, ‘మాకు తెలియదు.. పైపులు క్లీన్ చేయలేదు’ అంటూ వితండవాదం చేస్తున్నారు. ఆపరేటర్ అనారోగ్యం సాకుతో ప్లాంట్ నిర్వహణను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఆ నీరు చూస్తేనే వాంతులు చేసుకునేలా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరెంటు కోతలు.. కలుషిత నీరు!
కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా అక్కడ అడుగడుగునా సమస్యలే ఓవైపు కరెంటు కోతలు మరో వైపు తాగునీటి తిప్పలు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మంచి నీటి తరలింపు కోసం మానేరులో ఏర్పాటు చేసిన బావుల్లో నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన మోటార్లు ఎప్పుడు నడుస్తాయో, ఎప్పుడు మొరాయిస్తాయో తెలియదు. దీనికి తోడు కొత్త లైన్ల పేరుతో కరెంటు కోతలతో గ్రామస్తులను తిప్పలు తప్పడం లేదు. గంటల తరబడి విద్యుత్ నిలిపివేయడంతో అటు ఉక్కపోతతో, ఇటు గుక్కెడు నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నామని వాపోతున్నారు. చేసేదేమీ లేక కలుషితమైన ‘మినరల్’ వాటర్ తాగి రోగాల బారిన పడుతున్నారు.
మిషన్ భగీరథ నీల్లే దిక్కు
ఇసుక తరలింపుతో లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ ఆదాయం సమకూరుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో అక్కడ తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపంతో మంచినీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన ప్లాంట్లు అపరిశుభ్రతకు నిలయంగా మారింది. అసలు ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన నీరు అందుతుందా? అని తనిఖీ చేయాల్సిన అధికారులు అది విస్మరించడంతో అదికరుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
చర్యలు తీసుకుంటాం: పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్
ఊటూర్ గ్రామంలో తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న అంతరాయం, మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణలో లోపాలపై పంచాయతీ కార్యదర్శి మామిడి శ్రీనివాస్ శుక్రవారం వివరణ కోరగా నీటి కలుషితం సమస్యను వెంటనే పరిష్కరిస్తానని మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతులు త్వరితగతిన చేపడుతామని ఆయన తెలిపారు. ప్లాంట్‌లో నాచు పేరుకుపోవడానికి ప్లాస్టిక్ పైపులే కారణమని గుర్తించినట్లు తెలిపారు. త్వరలో ప్లాస్టిక్ పైపులను తొలగించి, వాటి స్థానంలో కొత్త స్టీల్ పైపులను ఏర్పాటు చేస్తామన్నారు. వేసవి కాలంలో గ్రామస్థులు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా పూర్తి బాధ్యత తీసుకుంటామని శ్రీనివాస్ వెల్లడించారు.





