చందానగర్‌లో రూ.80 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. అధికారుల మౌనం!

by Ramesh Naini |

చందానగర్‌లో రూ.40 కోట్లు విలువ చేసి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.

చందానగర్‌లో రూ.80 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. అధికారుల మౌనం!
X

దిశ, శేరిలింగంపల్లి : చందానగర్‌లో రూ.40 కోట్లు విలువ చేసి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ స్థలాలకు రక్షణ ఏర్పాట్లు చేయాలని కొన్నేళ్లుగా మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నా స్పందన కరువైంది. నెలనెలా వేతనాలు తీసుకుంటున్న అధికారుల కళ్లముందే కబ్జా జరుగుతున్నా స్పందించడం లేదు. సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వ భూమి అవునా? కదా తెలుస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మరో వైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మియాపూర్ సర్కిల్ అధికారులకు ఆస్తిని బదిలీ చేశారు. వారే ఆ స్థలాన్ని కాపాడుకోవాలంటూ తప్పించుకుంటున్నారు.

కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు..

చందానగర్ కైలాస నగర్‌లో సర్వే నెంబర్ 210 లో 2.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రూ.40 కోట్లు విలువ చేసి ప్రభుత్వ భూమి కళ్లముందే కబ్జాదారులు ఇల్లు నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందులో సుమారు 35 గుంటల భూమి సబ్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించారు. రూ.40 కోట్ల విలువ చేసే నాలుగు వేల గజాల ప్రభుత్వ భూమి దశల వారీగా కబ్జా చేసి శాశ్వతంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇదే స్థలంలో ప్రజా ప్రయోజనార్థం ప్రొసీడింగ్ నెంబర్ ఎల్ సీ/4076/2026 ప్రకారం.. సర్వే నెంబర్ 210/2లో 3904 గజాల ప్రభుత్వ స్థలాన్ని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, మోడల్ మార్కెట్, మహిళా భవన్ నిర్మాణం కోసం అప్పటి కలెక్టర్ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ జారీ చేసే ఉత్తర్వుల సాక్షిగా కళ్లముందు మొత్తం స్థలం ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. అప్పటి కార్పొరేటర్‌గా కొనసాగిన నవతారెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా కృషి చేసి కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసేందుకు కృషి చేశారు. ఈ స్థలాన్ని అప్పటి ఆర్టీవో తనిఖీ చేసి నివేదిక కలెక్టర్‌కు అందించారు. జీవో ఎంఎస్ నెంబర్ 571, తేదీ.14/9/2012 ప్రకారం అప్పటి జీహెచ్ఎంసీ ప్రజా అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా స్థలాన్ని అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల కళ్ల ముందే కబ్జా..!

కలెక్టర్ ఆదేశాల ప్రకారం జీహెచ్ఎంసీ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని నిధులు విడుదల చేసి నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టక పోగా.. కళ్ల ముందే కబ్జా అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జీహెచ్ఎంసీకి అప్పగించిన స్థలాన్ని కాపాడాలని పలుమార్లు రెవెన్యూ, సీఎంసీ అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు మాజీ కౌన్సిలర్ సునీతా ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఇరు రాజకీయ పార్టీ నేతల మధ్య వైరం కబ్జాదారులకు కలిసి వచ్చింది. ఈ విషయంపై హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖను వివరణ కోరగా.. మియాపూర్ సర్కిల్‌కు ప్రభుత్వ స్థలాన్ని అప్పగించలేదని, ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. శేరిలింగంపల్లి తహశీల్దార్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది సర్వే నెంబర్ 210 ప్రైవేట్ స్థలంగా చెబుతున్నారు. సర్వేయర్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అయినా సీఎంసీ మియాపూర్ సర్కిల్‌కు ఈ స్థలాన్ని అప్పగించామని, వారే రక్షించుకోవాలని చెప్పారు.

హెచ్చరిక బోర్డు సాక్షిగా..

సర్వేనెంబర్ 170 లో 10 గుంటల ప్రభుత్వ భూమి ప్రధాన రహదారి పక్కనే ఉంది. ఈ భూమి ప్రభుత్వ స్థలం అంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఆ బోర్డుపై ప్రైవేటు వ్యక్తులు వాలెట్ పార్కింగ్ అంటూ ఫ్లెక్సీతో కప్పేశారు. రూ.10 కోట్ల విలువ చేసే స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు సొంత వ్యాపారాలు నడుపుకుంటున్నారు. ఈ వ్యవహారం రెవెన్యూ అధికారులు తెలిసినా పట్టించుకోవడం లేదు.

ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పాగా..

చందానగర్ రెడ్డి కాలనీ సమీపంలో ప్రధాన కాలువకు ఆనుకొని సర్వే నెంబర్ 213 లో మూడు గుంటల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో ఓ వ్యక్తి దుకాణ సముదాయాలు నిర్మించి నెలకు వేలాది రూపాయలు అద్దె రూపంలో సంపాదిస్తున్నారు.

Next Story