- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సక్కుబాయి లేఔట్‌లో ఆక్రమణలపై హైడ్రా విచారణ.. కమిషనర్ కీలక ఆదేశాలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం, షేక్‌పేట విలేజ్‌లోని సక్కుబాయి లే ఔట్‌లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలపై హైడ్రా విచారణ చేపట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ నియోజకవర్గం, షేక్‌పేట విలేజ్‌లోని సక్కుబాయి లే ఔట్‌లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలపై హైడ్రా విచారణ చేపట్టింది. సర్వేనంబరు 327లో 25 ఎకరాల పరిధిలో సక్కుబాయి నగర్ మ్యూచ్చ్యువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ పేరుతో లే ఔట్ వేశారు. ఇక్కడ పార్కును కాపాడాలంటూ హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్ర స్థాయిలో విచారించిన హైడ్రా అధికారులకు మరిన్ని ఆక్రమణల గురించి తెలిసింది. పార్కుతో పాటు.. శ్మశాన వాటిక, చారిత్రక బుల్కాపూర్ నాలా ఆక్రమణలకు గురైనట్టు అధికారులు గుర్తించారు. దీంతో సర్వే నంబరు 327లో మిగిలి ఉన్న భూమికి సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భావించారు. ఇక్కడి ఖాళీ స్థలాలపై సొసైటీకి చెందిన వారితో పాటు, షేక్‌పేట విలేజ్ ప్రతినిధులతో హైడ్రా కార్యాలయంలో గురువారం హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్నారు. సంబంధిత పత్రాలను పరిశీలించారు. సక్కుబాయి లే ఔట్ వేసిన భూమి ప్రభుత్వానిదని షేక్ పేట విలేజ్ ప్రతినిధులు సదానందం, అశోక్ కుమార్ ఆరోపించారు.
పార్కు స్థలంగా పేర్కొంటున్న ప్రాంతాన్ని తాము ఆలయ ఉత్సవాలకు వాడుకుంటున్నామని కమిషనర్‌కు వివరించారు. శ్మశానాన్ని కూడా వదలకుండా సొసైటీ ప్రతినిధులు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సొసైటీ ప్రతినిధులు కూడా ఆ భూమి తమకు ఎలా వచ్చిందో సొసైటీ సెక్రటరీ సీతారామయ్య వివరించారు. అధికారిక లే ఔట్‌లోని పార్కును కాపాడాలని కోరారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరింత లోతైన విచారణ చేపట్టాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సబంధిత పత్రాలన్నీ పరిశీలించి.. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని హైడ్రా అదికారులకు సూచించారు. ఇరు పక్షాలకు చెందిన వారు కూడా పూర్తి వివరాలు అందజేయాలని, తర్వాత అన్ని శాఖల అధికారుల సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అక్కడ ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల్లో నిర్మాణాలు మున్ముందు రాకుండా చూడాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు, బీఆర్ఎస్ నేత శ్రీమతి మాగంటి సునీత, స్థానిక నివాసితులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.






