- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులు తక్కువ.. బిల్లులు ఎక్కువ! ఆశ్రమ పాఠశాలలో అవినీతి!
గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కావాల్సినన్ని నిధులు విడుదల చేస్తూ విద్యాభివృద్ధికి చేయూతనిస్తున్నా కొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతూ తప్పుడు నివేదికలు సమర్పిస్తూ ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారు.

ఆశ్రమ పాఠశాలలో అవినీతి రోజురోజుకు పెరుగుతుంది. లేని విద్యార్థులను ఉన్నట్లుగా చూపడం.. ఉన్నవారిని అధికంగా చేసి చూపడం షరా మామూలైంది. కారేపల్లి మండలం రేలకాయల పల్లి ఆశ్రమ పాఠశాలలో ఇదే తంతు కొనసాగుతుంది. అక్కడి హాస్టల్ లో 70 నుంచి 80 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా.. దాదాపు 140 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్కలు చూపుతూ నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ విద్యార్థికి రోజుకు 49రూపాయలు ప్రభుత్వం ఇస్తుండగా.. విద్యార్థుల సంఖ్యను పెంచి చూపుతూ అక్రమాలకు తెరలేపుతున్నారు. ఈ ఉదంతంలో వార్డెన్ తో పాటు ఆ పాఠశాల హెడ్ మాస్టర్ కూడా కుమ్మక్కైనట్లు ఆరోపణలు వస్తున్నారు. - దిశ, కారేపల్లి
దిశ, కారేపల్లి: గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కావాల్సినన్ని నిధులు విడుదల చేస్తూ విద్యాభివృద్ధికి చేయూతనిస్తున్నా కొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతూ తప్పుడు నివేదికలు సమర్పిస్తూ ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హాస్టళ్లను తీర్చిదిద్దుతూ, విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తుంటే అక్రమ బిల్లులు పెడుతూ లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా ఈ తంతు సాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అడ్మిషన్ రిజిస్టర్‌లో ఒకలా.. ఎంఈఓకు సమర్పించే రిపోర్టు ఒకలా.. గిరిజన శాఖకు సమర్పించే రిపోర్టు మరోలా ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఒక్కో విద్యార్థి పేరిట ఒక్క రోజుకు రూ. 49 చొప్పున నెలకు రూ. 1470 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. విద్యార్థుల సంఖ్యను 20 నుంచి 30 మందికి పైగా సంఖ్యను పెంచుతూ లెక్కలు చూపుతూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు.
రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలలో..
సింగరేణి మండలం రేలకాయలపల్లిలో ఈ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడి సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని ఎక్కువగా చూపుతూ బిల్లులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులకు పంపే లెక్కల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ బిల్లులు చేసుకుంటున్నారనే టాక్ నడుస్తుంది. దీంతో ‘దిశ’ వివరాలు సేకరించగా అనేక ఆసక్తికర అవినీతి విషయాలు వెలుగు చూశాయి. వాస్తవానికి ఇక్కడ జనవరి నెలలో 129 మంది విద్యార్థులున్నట్లు రిజిస్టర్‌లో నమోదు కాగా.. అందులో 20 మంది విద్యార్థులు సెలవుల్లో ఉన్నారు. 109 మందికి బిల్లు చేయాల్సిన వార్డెన్ 142 మందికి అంటే అదనంగా 33 మందికి బిల్లు చేసి సంక్షేమ శాఖ అధికారులకు పంపారు. ఫిబ్రవరి నెలలో కూడా 129 మంది ఉన్నట్లు రిజిస్టర్‌లో నమోదు కాగా అందులో కూడా కొంత మంది విద్యార్థులు సెలవులో ఉన్నారు. ఈ నెలలో కూడా 132 మంది ఉన్నట్లు బిల్లు చేసి పంపించారు. అంతేకాదు స్థానికంగా 30 మంది విద్యార్థులు సాయంత్రమే ఇంటికి వెళ్లిపోతారు. అయినా వారి పేరిట కూడా బిల్లు చేసి పంపడం విశేషం.
విద్యార్థికి ఒక్క రోజుకు 49 రూపాయలు..
ప్రభుత్వం వసతి గృహంలో ఉండే విద్యార్థికి ప్రతీ రోజు రూ. 49 చెల్లిస్తుంది. లెక్కల్లో తేడాలు చూపిస్తూ వార్డెన్ ప్రతి నెలా సుమారు 30 మందిని అధికంగా చూపుతూ రిపోర్టు సంక్షేమ శాఖ అధికారులకు పంపుతున్నాడు. 30 మందికి ఒక రోజుకు రూ. 1470 అవుతుండగా.. నెలకు రూ. 44,100 అదనంగా బిల్లులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్థానిక ఎంఈఓకు ఒక రకమైన రిపోర్టు ఇస్తే.. సంక్షేమ శాఖకు మరో రకమైన రిపోర్టు ఇవ్వడం గమనార్హం. వెరసి నెలకు రూ. 44,100 చొప్పున పది నెలలకు దాదాపు రూ. 4,41,000 మేర ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు పంపిన వివరాల్లో, సంక్షేమ శాఖకు పంపిన వివరాల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బిల్లుల్లో మాత్రం అధికంగానే..
ఈ విషయమై ‘దిశ’ జర్నలిస్ట్ హెడ్ మాస్టర్‌ను సంప్రదించి వివరణ అడగ్గా.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆరుగురు విద్యార్థులకు టీసీలు ఇచ్చామని, ఐదుగురు విద్యార్థులు లాంగ్ లీవ్‌లో ఉన్నారని తెలిపారు. బిల్లుల్లో ఈ వ్యత్యాసాలు ఎందుకు వచ్చాయంటే మాత్రం సమాధానం లేదు. ఎంఈఓను ఈ విషయమై అడగ్గా.. యూడైస్ రికార్డుల ప్రకారం పాఠశాలలో కేవలం 129 మంది ఉన్నట్లు ఉందని, అధికంగా బిల్లులు పెట్టినట్లు సమాచారం లేదని చెప్పారు. మొత్తానికి హాస్టల్ లో ఉండే విద్యార్థుల సంఖ్య కంటే బిల్లుల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న రిపోర్టుల ‘దిశ’ చేతికి చిక్కడంతో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమేనని అక్కడ పనిచేసే ఉపాధ్యాయులల్లో ఒకరు తెలిపారు. ఇది అన్ని సంక్షేమ శాఖ హాస్టళ్లలో జరిగేదేనని, కొత్తగా ఇక్కడ మాత్రమే జరుగడం లేదని సెలవిచ్చారు.






