- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట చేతికొచ్చినా ప్రయోజనం లేదు.. కేంద్రాల వద్ద రోజులు గడుపుతున్న రైతులు
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు తిప్పలు తప్పడం లేదు.

ఖానాపూర్ మండలంలో ఐకేపీ కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కేంద్రాలు తెరిచి పది రోజులు దాటుతున్నా ధాన్యం సేకరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. మండలంలోని మాస్కాపూర్‌లో మాత్రమే కొనుగోళ్లు సాగుతుండగా, మిగతా కేంద్రాల్లో పనులు మొదలుకాలేదు. బాధనకుర్తి, సూర్జాపూర్, మేడంపల్లి, ఇక్బాల్‌పూర్ కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. బుధవారం రాత్రి కురిసిన అకాల భారీ వర్షానికి ఓపెన్ యార్డుల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట వాన పాలవడంతో పెట్టుబడులు సైతం దక్కవని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేత బూసి నరేందర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తక్షణమే కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
దిశ, ఖానాపూర్ : రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు తిప్పలు తప్పడం లేదు. వర్షాకాలం రాకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా.. కేంద్రాలు ప్రారంభమై పది రోజులైనా కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాధనకుర్తి, సూర్జాపూర్, మేడంపల్లి, మాస్కాపూర్, ఇక్బాల్‌పూర్ గ్రామాల్లో పదిరోజుల క్రితం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
రోజుల తరబడి పడిగాపులు..
మండలంలోని మాస్కాపూర్ గ్రామంలో మాత్రమే ఐకేపీ ఆధ్వర్యంలో వడ్లను కొనుగోలు చేస్తున్నారు. మిగతా బాధనకుర్తి, సూర్జాపూర్, మేడంపల్లి, ఇక్బాల్‌పూర్ కేంద్రాలలో రైతులు వరి ధాన్యం పోసి ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి గత పది రోజులుగా కేంద్రాల వద్దే రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఉరుములు, ఈదురుగాలులతో కురిసిన భారీ అకాల వర్షానికి ఓపెన్ యార్డులో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఒకవైపు కొనుగోళ్లు జరగక మరోవైపు చేతికొచ్చిన పంట వాన పాలవడంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు.
పట్టించుకోకుంటే ఆందోళనలు తప్పవు..
రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 15రోజులైనా కొనుగోలు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బూసి నరేందర్ విమర్శించారు. కనీసం ఐకేపీ అధికారులు కూడా కేంద్రాలను సందర్శించి రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.






