‘దిశ’ ఎఫెక్ట్.. వందల కోట్ల పనులపై కదులుతున్న డొంక!​

139

దిశ, తెలంగాణ బ్యూరో: నీటిపారుదల శాఖలో ఎంబీ రికార్డుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. వందల కోట్ల పనులకు సంబంధించిన రికార్డులు కనిపించకుండా పోయిన వైనంపై ‘దిశ’ వరుస కథనాలతో నీటిపారుదల శాఖ స్పందించింది. ఇరిగేషన్‌తో పాటుగా విజిలెన్స్ విభాగం కూడా నోటీసులు జారీ చేసింది. ఎంబీ రికార్డులు ఎలా మాయమయ్యాయి, ఎక్కడెక్కడ కనిపించడం లేదనే విషయాలపై విచారణ మొదలు పెట్టింది. దీనిలో భాగంగా ఎస్సారెస్పీలోని కరీంనగర్, వరంగల్ సర్కిళ్లకు నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్​నోటీసులతో ఎస్సారెస్పీ ఉన్నతాధికారులు కూడా అన్ని సబ్​డివిజన్లు, డివిజన్లకు నోటీసులిచ్చారు.

చేసిన పనులేంది?

ఎస్సారెస్పీ ప్రధాన కాల్వతో పాటు ఉప కాల్వల మరమ్మతులు, మెయింటెనెన్స్ పనులు, సిబ్బంది క్వార్టర్ల మరమ్మతులు, మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులు మూడేండ్ల నుంచి కనిపించడం లేదనే విషయం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మూడేండ్ల నుంచి దాస్తూ వచ్చిన ఈ అంశం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. కొన్నిచోట్ల వెతికి కొన్ని రికార్డులను కనిపెట్టారు. అయితే కార్యాలయాల్లో ఉండాల్సిన ఈ ఎంబీలు ప్రైవేట్ గదుల్లో ఎందుకు దాచారనే అంశంపై కూడా కూపీ లాగుతున్నారు. వాస్తవంగా ఎన్ని పనులు, ఎంత బిల్లులు చెల్లించారు, ఎన్ని కోట్లు అనే అంశాలను ఇంకా నిగ్గు తేల్చడం లేదు.

ఎందుకంటే అసలు ఎన్ని ఎంబీలు మిస్సయ్యాయో బయటకు చెప్పడం లేదు. దీన్ని సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా సంబంధం లేని అడ్మినిస్ట్రేషన్ సిబ్బందికి వేతనాలు నిలిపివేయడం, నోటీసులు ఇవ్వడంతో మరింత అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇటీవల ‘దిశ’లో వచ్చిన వరుస కథనాలతో అధికారులు స్పందించారు. అసలు మూడేండ్ల నుంచి ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతులు, విడుదల చేసిన బిల్లులపై సమగ్ర వివరాలు సేకరించేందుకు విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది.

ముందుగా ఉన్నతస్థాయిలో నోటీసులు జారీ చేసింది. మొత్తం పనులు, విడుదల చేసిన బిల్లులు, కనిపించకుండా పోయిన ఎంబీల వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ఎంబీలను మాయం చేసి తేలిగ్గా తీసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లకు ఈ నోటీసులు షాక్​ ఇచ్చాయి. విజిలెన్స్ నోటీసులను జత చేస్తూ ఇరిగేషన్ శాఖ నుంచి సబ్‌‌డివిజన్లు, డివిజన్లకు నోటీసులు ఇచ్చారు. ఒక్కో సబ్‌ డివిజన్‌లో ఇప్పటి వరకు ఎన్ని పనులు చేశారు? ఎంత బిల్లులు ఇచ్చారు? వాటికి సంబందించిన రికార్డులు, ఎంబీలు, మూవ్‌మెంట్ రిజిస్టర్ ఇలా అన్నింటిని పంపించాలంటూ సూచించారు. అత్యవసరంగా గుర్తించి ఈ వివరాలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇక తేలుతాయా?

వాస్తవంగా ఎంబీల మాయంలో వందల కోట్లు చేతులు మారినట్లు అనుమానాలున్నాయి. సంబంధిత ఇంజినీర్లతో పాటుగా ఆడిట్ విభాగం కూడా ఈ అక్రమాల్లో పాలు పంచుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఎంబీలు మిస్సయ్యాయనే అంశం తేలినప్పటికీ.. ఎన్ని వందల కోట్లకు సంబంధించిన రికార్డులనేవి తేలడం లేదు. దీనిలో భాగస్వామ్యం ఉన్న ఇంజినీర్లు మాత్రం రికార్డులు దొరుకుతున్నాయంటూ చెప్పుకొస్తున్నారు. వాస్తవంగా గతంలో కొంతమంది ఇక్కడ నుంచి బదిలీ అయ్యారని కూడా అధికారులు చెప్పుతున్నారు.

బదిలీ సమయంలో ఈ రికార్డులు, పెండింగ్​ పనులకు సంబంధించిన అంశాలన్నీ లిఖితపూర్వకంగా కొత్తవారికి అప్పగించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎందుకు అప్పగించలేదు. ఎవరెవరు దాచి పెట్టారనే అంశాలు తేలాల్సి ఉంది. వరంగల్​సర్కిల్‌కు ఇటీవలే కొత్త సీఈ విధుల్లో చేరారు. అయితే ఆయనకు కూడా వీటికి సంబంధించిన రికార్డులు ఇవ్వలేదని సదరు సీఈ వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పినట్లు సీఈ పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..