కరోనాపై ప్రభుత్వ వ్యాఖ్యలు నిజమేనా?

by  |
కరోనాపై ప్రభుత్వ వ్యాఖ్యలు నిజమేనా?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ :

రాష్ట్రంలో కరోనా కేసులు సెప్టెంబర్ 2 నాటికి కనిష్ఠ స్థాయికి పడిపోతాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ జీ శ్రీనివాస రావు ఇలా ప్రకటించారో లేదో రాష్ట్రంలో అలా కేసులు అమాంతం పెరిగిపోయాయి. హెల్త్ డైరెక్టర్ మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కేసుల నమోదు తదితర అంశాలపై మాట్లాడి సెప్టెంబర్ 2 వరకు కేసులు తగ్గుతాయని జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఆయన సదరు ప్రకటన చేసి గంటలు గడువక ముందే ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,018 కేసులు నమోదయ్యాయని హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఇప్పటి వరకు ఇన్ని కేసులు రాష్ట్రంలో నమోదు కాకపోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలోకూడా గత వారం రోజులతో పోలిస్తే మంగళవారం కేసులు అధికంగానే నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో ఇప్పట్లో కరోనా తగ్గే అవకాశం కన్పించడం లేదు. ఇలాంటి ప్రకటనలు ప్రభుత్వం నుండి గుడ్ వర్క్ అనే మార్కులు కొట్టేయడం తప్పితే మరొకటి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలు పరిగణలోకి తీసుకోరా..?

కేవలం ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో కొంత మేర కేసులు తగ్గితే రాష్ట్రం మొత్తం తగ్గినట్లేనా? జిల్లాలలో రోజురోజుకూ పెరిగి పోతున్న కరోనా కేసులు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు కన్పించడం లేదా? అనే ప్రశ్నలను ప్రజలు సందిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కరోనా కేసులు తగ్గాయి. కాగా జిల్లాల్లో ఎన్నో రెట్లు పెరిగాయి. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం 3018 కేసులు నమోదైనట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,11,688 మంది కరోనా బారిన పడగా వీరిలో 788 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 25,685 యాక్టివ్ కేసులున్నాయని బులిటెన్‌లో పేర్కొన్నారు. గతంలో ఆయా జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యేవి కానీ, తాజాగా వందకు పైగా చేరుకుంటున్నాయి. మరి ఈ కేసులన్నీ సెప్టెంబర్ మొదటి వారం వరకు సంగతి అటుంచితే ఎప్పటిలోపు అదుపులోకి వచ్చేనోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన దానికంటే కూడా మించి కేసులు నమోదౌతున్నప్పటికీ వాటిని దాచి తక్కువ కేసులు నమోదౌతున్నట్లుగా అధికారులు లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


Next Story

Most Viewed