మేయర్​ సాబ్.. జర కొంచెం పట్టించుకోండి..

by  |
మేయర్​ సాబ్.. జర కొంచెం పట్టించుకోండి..
X

దిశ, చార్మినార్: ​’పట్టణ, పల్లె ప్రాంతాలలో అభివృద్దికి నడుం బిగించండి.. నేను ఒక జిల్లాను దత్తత తీసుకుంటా.. స్వయంగా నేనే పర్యవేక్షిస్తా.. ఎందుకు అభివృద్ది కాదో అదీ నేను చూస్తా.. మీ వెంట సీఎం ఉన్నాడన్న భరోసాతో పనులు చేయండి.. ఎందుకు అభివృద్ది కాదో అదీ నేను చూస్తా’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ పదే పదే చెబుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం పాతబస్తీలో మొద్దునిద్ర వీడడం లేదు. రూ.2.80 కోట్లతో కేవలం 500 మీటర్ల దూరం..10 ఫీట్ల ఎత్తు.. 8 ఫీట్ల వెడల్పులో నవంబర్​ 2019లో ప్రారంభమైన నాళా విస్తరణ పనులు 20 నెలలు గడుస్తున్నా.. నేటికీ 250 మీటర్ల దూరం కూడా పూర్తి కాలేదు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపానికి నిలువెత్తు నిదర్శనం ఇది. నాళా నిర్మించిన 250 మీటర్ల దూరం లోపు కూడా మూడు పాయింట్​ల దగ్గర అసంపూర్తిగా పనులు దర్శనమిస్తాయి. కేవలం 6 నుంచి 8 నెలల్లో పూర్తి కావాల్సిన నాళా నిర్మాణ పనులు రెండేళ్ల దగ్గరికి వస్తున్నా పూర్తి కాలేదు.

అదేదో మారుమూల గళ్లీలో పనులు అనుకుంటే పొరపాటే. అదో ప్రధాన రహదారి.. ఛత్రినాక నుంచి ఫలక్​నుమాకు .. లాల్​దర్వాజా నుంచి చాంద్రాయణగుట్టకు వెళ్లాలన్నా.. రాజన్నబావి శివాజీనగర్​ మీదుగానే వెళ్లాల్సి వస్తుంది. అనునిత్యం వేలాది మంది ప్రయాణించే వాహనాదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజన్నబావి టు సికింద్రాబాద్​ కు తిరిగే ఆర్టీసీ బస్సు కూడా నాళా విస్తరణ పనుల కారణంగా రద్దు అయ్యింది. ఆర్టీసి బస్సు ఎక్కాలంటే ఇటు రెండు కిలోమీటర్లు అలియాబాద్​కు .. అటు రెండు కిలోమీటర్లు ఛత్రినాకకు నడిచి వెళ్లాల్సిందే. అంతే గాకుండా మార్చి నెలలో ఫలక్​నుమా ఫ్లై ఓవర్​ బ్రిడ్జి పనులు కూడా ప్రారంభం కావడంతో చాంద్రాయణగుట్ట నుంచి చార్మినార్​ కు వెళ్లే ప్రధాన రహదారి కూడా మూసి వేయడంతో పాతబస్తీ ప్రజల కష్టాలు అంతా ఇంతా కావు.

రెండవ విడత నాళా పనులు ఇక కష్టమే

రాజన్నబావి శివాజీనగర్​ నుంచి ఛత్రినాక వరకు 900 మీటర్ల వరకు నాళా విస్తరణ పనులు చేపట్టాల్సి ఉండగా.. తొలి విడతలో 500 మీటర్ల వరకు, రెండవ విడతలో మరో 400 మీటర్ల పనులు చేపట్టాల్సి ఉంది. తొలి విడత పనులే ఇప్పటి వరకు పూర్తి కాలేకపోవడం, ఇక రెండవ విడత పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో.. ఎపుడు పూర్తవుతాయో .. ఎపుడు శివాజీనగర్​ కాలనీ వాసులకు ఈ నాళా విస్తరణ పనులతో మోక్ష్యం లభించనుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

కొరవడిన అధికారుల ముందుచూపు

గత 30 ఏళ్ల క్రింద పాతబస్తీ రాజన్నబావి శివాజీనగర్ లో​ రెడ్డి జనసంఘం నుంచి ఛత్రినాక వరకు అప్పట్లో ఉన్న జనాభాకు అనుగుణంగా 4 ఫీట్ల ఎత్తు 4ఫీట్ల వెడల్పులో (4×4) వరద నీటి కోసం నాళాను నిర్మించారు. ఇక్కడ శివాజీనగర్​, లక్ష్మీనగర్​, భట్​జీనగర్​, మొరంబావి,శివగంగానగర్, ఛత్రినాక బస్తీలుగా విస్తరించాయి. కాలాదికనుగుణంగా ప్రస్తుతం వేలాది ఇండ్లు నిర్మితమయ్యాయి.​ వట్టేపల్లి నుంచి రాజన్నబావి శివాజీనగర్​ మీదుగా ఛత్రినాక, ఉప్పుగూడ వరకు నాళా ప్రవహిస్తుంది. అప్పట్లో ఎగువ ప్రాంతంలో గాంధీనగర్ నుంచి నాళా నిర్మించకుండా దిగువ ప్రాంతంలో శివాజీనగర్​లో నాళాను నిర్మించారు. గాంధీనగర్​ నుంచి రెడ్డిజన సంఘం వరకు అప్పట్లో ఓపెన్​ కాలువ మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఉన్న కెపాసిటికి తగ్గట్టుగా కాకుండా రెండేళ్ల క్రితం అతి చిన్న ఓపెన్​ నాళాను నిర్మించారు. ప్రస్తుతంజనాభాపెరుగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా నాళాను నిర్మించలేదనే విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆ నాళా పై కప్పు వేయకోవడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్​ లేకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. ఆ ఓ పెన్​ నాళా లో స్థానికులు చెత్తతో పాటు పాడైపైన గృహోపకరణ వస్తువులు సైతం కూలర్​, హెల్మెట్​, చెట్టు మొద్దులు సైతం అందులో వేస్తున్నారు. దీంతో కొద్ది పాటి వర్షానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరద నీటిలో కాలనీలు మునిగిపోతున్నాయి. గత సెప్టెంబర్​లో కురిసిన భారీ వర్షాలకు పరిస్థితి మరింత దారుణంగా మారింది. రాక పోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. నాలుగు ఫీట్ల ఎత్తువరకు వరద నీరు ఏరులా ప్రవహించడంతో ఇళ్లలోని గృహోపకరణ వస్తువులు సైతం తడిచి ముద్దయ్యేవి. వానాకాలం వచ్చిందటే కంటి మీద కునుకు ఉండేది కాదు .. చిన్న పిల్లలను ఎత్తుకుని సబ్జాలపై తలదాచుకునే వారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరికొందరైతే వరదల సమయంలో ఊళ్లకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థతి దాపురించింది.

ప్రధాన సమస్యకు బడ్జెట్​ లేదా?

పాతబస్తీలో అత్యంత ప్రధాన సమస్యగా పేరొందిన రాజన్నబావి శివాజీనగర్ నాళా విస్తరణ పనులకు బడ్జెట్​ లేనపుడు పనులు అసలు ఎందుకు ప్రారంభించారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు?. పెద్దపనులు ప్రారంభించేటపుడు బడ్జెట్​ లేకుండా హడావిడిగా పనులు ప్రారంభించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారుల తొందరపాటుతో స్థానికులకు రెండేళ్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పటికీ పనులు పూర్తిగా స్తంభించిం పోయాయని, నాళా విస్తరణ పనులకు జాప్యం అయిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

నాళా నిర్మాణ పనుల్లో పగిలిన సివరేజ్ పెద్ద​ పైప్​ లైన్​

శివాజీనగర్​ కాలనీలో అప్పట్లో జనాభాకు అనుగుణంగానే ఒకే ఒక్క సివరేజ్​ పైప్​ లైన్​ను ఏర్పాటు చేశారు. ..రోజు రోజుకు జనాభా విపరీతంగా పెరుగుతున్నా వాటర్​ వర్క్స్​ అధికారులు మాత్రం సివరేజ్​ విపస్తరణ పనులు ప్రారంభించలేదు. పనుల ప్రారంభంలో నాళా విస్తరణ పనులు చేపట్టేటపుడు జేసీబీ తొవ్వుతుండగా సివరేజ్​పైప్​ లైన్​ పగిలింది. పగిలిన ప్రాంతంలో కొత్త సివరేజ్​ పైప్​ లైన్​ ఏర్పాటు చేయాలని స్థానికులు వాటర్​ వర్క్స్​ అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి అధికారులు పట్టించుకోకపోవడంతో నాళా లోకే కలిపి చేతులు దులుపుకున్నారు. మరో వైపు నాళాలోకి సివరేజ్​ లైన్​ కలుపొద్దని కచ్చితమైన నిబంధనలు ఉన్నప్పటికీ నాళాలోకి సివరేజ్​లైన్​ వ్యవస్థను కలిపి నిబంధనలు తుంగలోకి తొక్కారు. అదే శివాజీనగర్ కాలనీకి​ మరో పక్కన ఇప్పటి వరకు సివరేజి పైప్​ లైన్​ కూడా లేదు.. పనులలో భాగంగా ఎలాగో జేసీబీతో తొవ్వారని … నూతన సివరేజి పైప్​ లైన్​ పనులు వేయాలని వాటర్​వర్క్స్​ అధికారులను స్థానికులు ఎంత బ్రతిమాలినా పనులు చేయకపోవడంతో సివరేజ్​ పైప్​ లైన్​ను కొత్తగా నిర్మితమవుతున్న నాళాలోకి కలుపుకున్నారు.


Next Story

Most Viewed