ఘనంగా యాదగిరీశుని కళ్యాణం

by Muthe.Rajitha |

యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(Sri Lakshmi Narasimha Swamy Temple) అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు

ఘనంగా యాదగిరీశుని కళ్యాణం
X

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(Sri Lakshmi Narasimha Swamy Temple) అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల పర్వంలో వైష్ణవ పాంచరాత్రాగమశాస్త్రానుసారం నిర్వహించిన లక్ష్మీ నరసింహుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించారు. జిల్లా కలెక్టర్ వి హనుమంతరావు.. ఆలయ ఈవో భాస్కరరావు, అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తిలు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. గజవాహనరూఢుడై పెళ్లికొడుకుగా ముస్తాబైన నరసింహుడిని, రత్న ఖచిత స్వర్ణాభరణాలు ధరించి ముత్యాల పల్లకిలో వేంచేసిన వధువు క్షీర సముద్ర తనయ లక్ష్మీ అమ్మవారిని కళ్యాణ మండపంలో ఆసీనులు చేసి ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు, యజ్ఞాచార్యులు అర్చక పండిత బృందం పాంచరాత్రాగమశాస్త్రానుసారం కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.

గరుడాళ్వార్ ఆహ్వానంతో కొండపైకి వేంచేసి విడిది చేసిన బ్రహ్మాది దేవతలు, సుర మునులు భక్తజనులు లక్ష్మీ నరసింహ కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి తరించారు. గంగా, కావేరి, కృష్ణ, గోదావరి, యమున పుణ్య నదుల జలాల ఆవాహన, సంప్రోక్షణ, రక్షాబంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ, మధుపర్క నివేదన, నూతన వస్త్రాలంకరణ, జీలకర్ర బెల్లం ధారణ, కన్యాదాన ఘట్టాలతో అధ్యంతం కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహుల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు స్వామివారికి కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఘట్టాన్ని యాజ్ఞిక బృందం నిర్వహించింది. యాజ్ఞిక పండితులు కళ్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు బ్రహ్మ ముడులు వేసి భక్తుల గోవింద నామస్మరణల మధ్య మాంగళ్యధారణ ఘట్టం నిర్వహించారు.

అనంతరం తలంబ్ర ధారణ ఘట్టం సాగింది. స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించిన భక్తుల గోవింద నామస్మరణలతో కొండ పరిసరాలు మారుమోగాయి. అర్చక బృందం కళ్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు మంగళ నీరాజనాలు, ఆశీర్వచనాలు అందించాక గజవాహనంపై మాడవీధుల్లో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. కళ్యాణోత్సవంతో ఒకటైన స్వామి అమ్మవార్లు ప్రసన్నమూర్తులై భక్తులకు తమ దర్శనంతో అనుగ్రహించారు. తిరువీధుల్లో ఊరేగాక స్వామి అమ్మవారు తిరిగి ఆలయం చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల పర్వంలో రేపు ఉదయం స్వామివారికి గరుడ వాహన సేవ దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.

Next Story