ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో సరస్వతి నది ఎందుకు కనిపించదు?

by Yella Dhawani Reddy |

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం ఉంది.

ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో సరస్వతి నది ఎందుకు కనిపించదు?
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం ఉంది. ప్రస్తుతం ఇక్కడ మహా కుంభమేళా జరుగుతుంది. ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే, త్రివేణి సంగమం అంటే.. మూడు నదుల కలయిక. కానీ, ఇక్కడ గంగా, యమున నదులు మాత్రమే కనిపిస్తాయి. సరస్వతి నది కనిపించకుండా త్రివేణి సంగమం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం.

ప్రయాగ్‌‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పశ్చిమం వైపు నుంచి యమునా నది వస్తుంది. ఉత్తరం వైపు నుంచి గంగ ప్రవహిస్తుంది. ఈ రెండు నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడి తూర్పువైపుగా సాగుతాయి. అయితే ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా సాగుతుందని పండితులు చెబుతుంటారు. ఇందుకు సంబంధించిన పురాణ గాథలు కూడా అనేకం ప్రచారంలో ఉన్నాయి.

బ్రహ్మ శాపంతో మాయమైన సరస్వతి

సింధు నది తరహాలోనే, దాదాపు క్రీస్తుపూర్వం 6 వేల సంవత్సరాలకు పూర్వం సరస్వతి నది ప్రవహించినట్లు వేదాలు, పురాణాల్లో ఉంది. ఈ నది హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యాణా, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి గుజరాత్‌లోని కచ్ వద్ద సముద్రంలో కలిసేదని కూడా ఉంది.

పురాణాల ప్రకారం.. బ్రహ్మ కుమార్తె అయిన సరస్వతి ఒక సందర్భంలో కౌషంబి రాజ్యానికి చక్రవర్తి అయిన పురూరవ అనే రాజుకు ఆకర్షితురాలైంది. ప్రయాగ్‌రాజ్‌కు దగ్గర్లోనే ఈ కౌషంబి ఉంది. ఈ విషయం బ్రహ్మకు తెలిసి కోపంతో సరస్వతిని మాయమైపోవాలని శపించాడని చెబుతుంటారు. అందుకే సరస్వతి నది కనిపించదని అంతర్వాహినిగా ఉంటుందని చెబుతుంటారు.

చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయి?

సరస్వతి నది ప్రవాహాన్ని చివరిసారిగా హర్యాణాలోని కురుక్షేత్ర ప్రాంతంలో చూసినట్లుగా ఆధారాలున్నాయని అలహాబాద్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర విభాగం ఆచార్యురాలు అనామిక రాయ్ చెబుతున్నారు. హర్యాణాలోని ఘగ్గర్ ప్రాంతంలో సరస్వతి నది యమునా నదిలో కలిసిపోయిందని, అక్కడి నుంచి యమునా నది ద్వివేణి ప్రవాహంగా కొనసాగుతుందని వివరించారు.

అంతేకాదు, 2002లో సరస్వతి నదీ ప్రవాహా మార్గాన్ని కనుగొనేందుకు తవ్వకాలు కూడా జరిగాయి. ఇందుకోసం కేంద్రం ఇస్రోకు చెందిన బల్‌దేవ్ సహాయ్, పురావస్తు శాస్త్రవేత్త ఎస్.కల్యాణ్ రామన్, గ్లేసియాలజిస్ట్(హిమానీనద శాస్త్రవేత్త) వైకే పురి, వాటర్ కన్సల్టెంట్ మాధవ్ చితాలతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక అనేక పరిశోధనల తర్వాత ఈ బృందం 2015లో ఓ నివేదిక కూడా విడుదల చేసింది. ఉపఖండం వాయువ్య ప్రాంతంలో గతంలో ఎన్నో పెద్ద నదులు ప్రవహించాయని ఆ నివేదిక పేర్కొంది. హిమాలయాల ప్రాంతంలో వాతావరణ మార్పులు, టెక్టోనిక్ ప్లేట్లలో మార్పుల కారణంగా సరస్వతి నది క్రీస్తుపూర్వం మూడు వేల ఏళ్ల క్రితం పూర్తిగా ఎండిపోయి, కనుమరుగైనట్లు వివరించింది.

Next Story